Abn logo
Nov 27 2020 @ 10:58AM

ట్యాప్ ఓపెన్ చేసి.. నీళ్లకు నిప్పు పెట్టిన యువతి.. వీడియో వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారందరికీ దిమ్మతిరిగి పోతోంది. ఇది చూసిన సైంటిస్టులకు కూడా అసలేం జరుగుతుందో అర్థంకాకుండా పోయింది. ఎందుకంటే ఈ వీడియోలోని దృశ్యాలు ప్రకృతి నియమాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వీడియోలో కనిపించే ఘటన డ్రాగన్ దేశం చైనాలో జరిగిందట. ఇంతకీ ఈ వీడియోలో కనిపించే ఈ వింత ఏంటో తెలుసా? ట్యాప్ వాటర్ మండిపోవడం. అర్థం కాలేదు కదూ? కానీ ఇది నిజం. వీడియోలో ఓ ట్యాప్ ఓపెన్ చేసి లైటర్‌తో ఇలా ముట్టించగానే ఆ నీళ్లు అలా భగ్గున మండిపోతున్నాయి. ట్యాప్‌లోంచి నీళ్లు వస్తున్నంత సేపూ ఇలా మంట మండుతూనే ఉంది.


సాధారణంగా మనందరి ఇళ్లలోనూ ట్యాప్‌లు ఉంటాయి. ఈ నీళ్లే మనం ఇళ్లలో వాడుకుంటాం. పొరపాటున చిన్న మంట రేగితే ఆ నీళ్లే చల్లి మంటలు ఆర్పేస్తాం. కానీ ఈ వీడియోలో కనిపించే ఇంట్లో ఆ పని చేశామా అంతే. ఎందుకంటే ఈ నీళ్లే పెట్రోలులా మండుతున్నాయి. మంటల మీద పొరబాటున ఈ నీరు పోశామా అంతే సంగతులు. చైనాలోని పాంజిన్ సిటీలో ఓ యువతి ఇంట్లో ఈ వింత వెలుగు చూసింది. వెన్ అనే యువతి ఈ వీడియోను చైనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో దీన్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వీటిలో ముఖ్యంగా ట్విట్టర్లో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇక్కడ దీన్ని వేలాది మంది చూసి ఆశ్చర్యపోయారు.


‘‘మామూలు ట్యాప్ వాటర్‌తో పోలిస్తే మా ఇంట్లో నీళ్లు ఎప్పుడూ కొంచెం ఆయిల్‌ అనిపిస్తాయి’’ అని వెన్ చెప్పిందట. తమకు నీటిని సరఫరా చేసే పైపులో నేచురల్ గ్యాస్ కలుస్తోందని, దీని వల్లే ఇది జరుగుతందని తాము అనుకుంటున్నామని ఆమె తెలిపింది. ఈ విషయంపై తన తండ్రి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వేసవిలోనే కంప్లయింట్ చేసినా ఇప్పటి వరకూ అధికారులు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇంట్లోని నీళ్లు కొంచెం తేడాగా ఉన్నట్లు మా అమ్మ గమనించి ఆందోళన వ్యక్తం చేసింది’’ అని వెన్ అంది. అయితే ఈ నీరు ఎటువంటి వాసనా రావడం లేదని చెప్పింది. దాదాపు మూడు-నాలుగేళ్ల క్రితం తొలిసారి ఈ నీళ్లు కొంచెం తేడాగా ఉన్నట్లు తల్లి గుర్తించిందని వెన్ వెల్లడించింది.


ఇప్పుడు వెన్ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవడంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. చిన్న మొత్తంలో సహజ వాయువు భూమిలో ఇంకిపోవడంతోనే ఇలా జరిగిందని వాళ్లు చెప్పారట. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేసి ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, వీడియో పోస్ట్ అయిన రోజు మధ్యాహ్నమే అధికారులు రంగంలోకి దిగారు. సమస్య ఉన్న ప్రాంతంలో బావులను మూసేశారు. ఇళ్లకు నీటి సరఫరా నిలిపేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారని ఈ ప్రకటనలో అధికారులు చెప్పారు.


Advertisement
Advertisement