నీటి సంఘాల రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-04T17:41:41+05:30 IST

నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఆరేళ్ల కాలపరిమితితో గత ప్రభుత్వం 2015 ఆగస్టులో ఎన్నికలు నిర్వహించింది. ఈ పదవులకు

నీటి సంఘాల రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే తొలగింపు

టీడీపీ హయాంలో ఎన్నికైన వారు కావడమే కారణం!


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఆరేళ్ల కాలపరిమితితో గత ప్రభుత్వం 2015 ఆగస్టులో ఎన్నికలు నిర్వహించింది. ఈ పదవులకు ఎన్నికైన వారికి వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం వుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికైన సంఘాలను రద్దుచేయాలని నిర్ణయించి సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీల బాధ్యతలను ఆయా స్థాయిల అధికారులకు అప్పగించింది. తాజా ఉత్తర్వుతో జిల్లాలో అన్ని రకాల కమిటీలు(366) రద్దు అయ్యాయి. చిన్ననీటి పారుదల శాఖ పరిధిలో 327, మధ్యతరహా ప్రాజెక్టుల కింద రైవాడ పరిధిలో 10, కోనాంలో ఎనిమిది, భారీ నీటిపారుదల ప్రాజెక్టు తాండవ పరిధిలో 16 నీటి సంఘాలు ఉన్నాయి. తాండవ ప్రాజెక్టు పరిధిలో రెండు జిల్లాలకు(విశాఖపట్నం, తూర్పుగోదావరి) కలిపి ఐదు డిస్ర్టిబ్యూటరీ సంఘాలు ఉన్నాయి. ఇంకా తాండవ, కోనాం, రైవాడ ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 


పెద్దేరుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. భారీ ప్రాజెక్టులకు మాత్రమే డిస్ర్టిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల విశాఖ జిల్లాలో తాండవ ప్రాజెక్టుకు మాత్రమే డిస్ర్టిబ్యూటరీలకు ఎన్నికలు జరిగాయి. గతంలో రెండేళ్ల కాలపరిమితి ఉండే ఈ సంఘాల పదవీ కాలాన్ని టీడీపీ ప్రభుత్వం ఆరేళ్లకు పెంచింది. 2015లో ఎన్నికలు జరిగినందున ఈ సంఘాల పదవీ కాలం మరో ఏడాది ఉంది. సాధారణంగా కమిటీలు తమ పరిధిలో నీటి పారుదల స్థిరీకరణకు సంబంధించి పనులు, మరమ్మతులు, పూడికతీత, ఆధునికీకరణ పనులు చేపట్టేవి. కమిటీలకు ఎన్నికలు నిర్వహించే వరకు అధికారులే సంబంధిత సంఘాల బాధ్యతలను పర్యవేక్షిస్తారు.  కాగా నీటి సంఘాల నేతృత్వంలో గడచిన రెండేళ్ల నుంచి చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది


సంఘాల రద్దు అన్యాయం: గండి ముసలినాయుడు, చైర్మన్‌, కోనాం ప్రాజెక్టు కమిటీ

నీటి వినియోగదారులు, ప్రాజెక్టు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలను ప్రభుత్వం రద్దుచేయడం అన్యాయం. ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన మాకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు గడువుంది. అయినా ముందుగా కమిటీలను రద్దుచేయడం మంచి నిర్ణయం కాదు. 

Updated Date - 2020-08-04T17:41:41+05:30 IST