ప్రాజెక్టులకు జలకళ!

ABN , First Publish Date - 2020-08-13T07:59:56+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. బుధవారం

ప్రాజెక్టులకు జలకళ!

  • ఆల్మట్టికి మళ్లీ పోటెత్తిన వరద
  • నారాయణ్‌పూర్‌కి 80 వేల క్యూసెక్కులు
  • భద్రాచలంలో 13.5 సెం.మీ. వర్షం

 ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 12: ఎగువన కురుస్తున్న వర్షాలతో  ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. బుధవారం సాయంత్రానికి 1,26,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో.. అక్కడి నుంచి నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.  నారాయణపూర్‌ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 14 గేట్లు ఎత్తి 1,22,200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు జూరాల ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం అందడంతో.. వారు అప్రమత్తమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 57 గేట్లు ఎత్తి 4.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ జలాశయం సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 405 అడుగులకు చేరింది. దీంతో.. అధికారులు మంగళవారం రాత్రి 4 గేట్లుఎత్తి 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకోవడంతో 7 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.   


భద్రాచలంలో నీటమునిగిన స్నాన ఘట్టాలు

పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 25.4 అడుగులున్న నీటిమట్టం.. బుధవారం సాయంత్రానికి 29.6 అడుగులకు చేరింది. భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద స్నాన ఘట్టాలు నీట మునిగాయి. భద్రాచలం పట్టణంలో మంగళవారం రాత్రి నుంచి 12 గంటలపాటు ఏకధాటిగా 13.5 సెం.మీ.ల వర్షం కురిసింది. దీంతో.. గోదావరి కరకట్ట పక్కన అంబాసత్రం వద్ద ఉన్న చెరువు పొంగిపొర్లి.. ఆ నీరు రామాలయం పరిసర ప్రాంతాల వద్దకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో జల్లులు కొనసాగాయి. అత్యధికంగా ఎర్రుపాలెంలో 2.4 సెం.మీ. వర్షం కురిసింది. అశ్వాపురంలో ఇసుకవాగు పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి.  ఇళ్లలోకి వరదనీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఓపెన్‌కా్‌స్ట గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.



Updated Date - 2020-08-13T07:59:56+05:30 IST