నిఘా నేత్రం!

ABN , First Publish Date - 2022-08-18T11:55:11+05:30 IST

భయపడుతున్నదే జరిగింది. కన్యాకుమారికి నాలుగువందల యాభై కిలోమీటర్ల దూరంలో చైనా నిఘా నౌక లంగరేసుకు కూచుంది....

నిఘా నేత్రం!

భయపడుతున్నదే జరిగింది. కన్యాకుమారికి నాలుగువందల యాభై కిలోమీటర్ల దూరంలో చైనా నిఘా నౌక లంగరేసుకు కూచుంది. ఆగుఆగు అంటూనే, లంక పాలకులు దానిని స్వాగతించారు, హంబన్ టోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో దానికి ఆశ్రయం ఇచ్చారు. భారత సరిహద్దుకు అతిసమీపంలో ‘యువాన్ వాంగ్ 5’ అనే ఈ శక్తిమంతమైన సైనిక గూఢచర్య నౌక అవసరాలు తీర్చుకొనే పేరిట పదిరోజులు ఉండబోతున్నదంటే, అందుకు లంక పాలకులను మాత్రమే నిందించి ప్రయోజనం లేదు.


మా నౌకతో ఎవరికీ ఏ ముప్పూలేదు, దానిని రావద్దనే హక్కూ లేదు అని చైనా వ్యాఖ్యానించింది. కానీ, దాని లక్ష్యాన్ని అటుంచితే, శక్తినీ, సామర్థ్యాన్ని గమనించినప్పుడు రాకను మనం వ్యతిరేకించడంలో తప్పేమీ లేదు. 750 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్థావరాలను, కదలికలను అది గమనించగలదు కనుక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని ఓడరేవులన్నింటినీ చైనా నిశితంగా అధ్యయనం చేయగలదు. దక్షిణభారతదేశంలోని కీలకమైన, రక్షణపరంగా ముఖ్యమైన స్థావరాలు, కల్పాక్కం వంటి అణుపరిశోధక కేంద్రాలు చైనా గూఢచర్యం బారిన పడవచ్చు. ఇంధనం నింపుకోవడం, చిన్నచిన్న మరమ్మతులు చేసుకోవడం కోసమే ఈ నిఘానౌక వస్తున్నదని లంక చెబుతున్నప్పటికీ, చైనా మాటవరుసకైనా నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం లేదు, లంక కూడా దానికి హద్దులు గీయడం లేదు. ఎన్నడో రావల్సిన ఈ నిఘానౌకను శ్రీలంక కాస్తంత ఆగమన్నదే కానీ, నిలువరించడం దాని ఉద్దేశం కాదని తేలిపోయింది. ఇంతకాలం భారతదేశం ఒత్తిడి కారణంగా లంకకు కాస్తంత దూరంలో సముద్రజలాల్లో ఆ నౌక అటూ ఇటూ చక్కెర్లు కొడుతున్నప్పుడే అది కచ్చితంగా హంబన్ టోటకు వచ్చితీరుతుందని నిపుణులు స్పష్టంచేశారు. ఇప్పుడు శ్రీలంక, చైనా నాయకులు, అధికారులు చేయీచేయీ కలిపి జెండాలు ఊపుతూ దానిని ఘనంగా స్వాగతించారు.


మీరు తప్ప మమ్మల్ని అదుకొనేవారు ఎవరున్నారు, మనసులు వీలైనంత విశాలం చేసుకొని ఈ కష్టకాలంలో మమ్మల్ని కాపాడండి అంటూ లంక నాయకులంతా భారతదేశాన్ని సాయంకోసం అర్థించడం చూశాం. గతవారం పాకిస్థాన్ నావికాదళానికి చెందిన చైనా తయారీ నౌక తైమూర్‌ను లంగరేసుకోవడానికి శ్రీలంక అనుమతించింది. ఇప్పుడు ఏకంగా ఓ అత్యంత శక్తిమంతమైన, అధునాతన గూఢచర్య వ్యవస్థ ఉన్న చైనా నౌకను స్వాగతించింది. యువాన్ వాంగ్ విషయంలో భారత్, చైనా ఒత్తిళ్ళ మధ్య శ్రీలంక నలిగిపోయి ఉండవచ్చు. దేశ ఆర్థికస్థితి, తీవ్ర రాజకీయ సామాజిక సంక్షోభాల మధ్య ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చైనాతో కఠినంగా వ్యవహరించగలిగే స్థితిలో లేరు. పైగా, హంబన్ టోట నౌకాశ్రయం చైనా అధీనంలో ఉన్నది. దాని నిర్మాణం వెనుక లంక ప్రయోజనాలకంటే చైనా ప్రయోజనాలు అధికమన్న విషయం అందరికీ తెలుసు. ఏటా వేలాది చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, శ్రీలంకలోని రెండవ అతి పెద్దదైన, ముఖ్యమైన ఈ నౌకాశ్రయం నిర్మాణానికి మాజీ అధ్యక్షుడు రాజపక్సే దురుద్దేశపూరితంగా అనుమతించి, చివరకు ఆర్థికంగా గిట్టుబాటు కాక, అప్పుతీర్చలేక వందేళ్ళ లీజుకు చైనాకే రాసిచ్చేశారు.


అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీపెలోసీ తైవాన్ పర్యటన మరోమారు నిప్పురాజేసిన నేపథ్యంలో, ఏక చైనా సిద్ధాంతానికి మీ మద్దతు మాటేమిటంటూ చైనా మనలను మొన్ననే నిలదీసిన తరుణంలో ఓ బలమైన హెచ్చరిక ఈ నిఘానౌక రాక. చైనానూ లంకనూ ఎంత విమర్శించుకున్నా ఈ విషయంలో మనం ఏమీ చేయలేకపోయామన్న మాట నిజం. ఒకపక్క లంకను ఆదుకుంటూ కూడా మన విదేశాంగశాఖ మాట నెగ్గించుకోలేకపోయింది. మనపై ఆధారపడుతున్న ఆ దేశం మనమాట గౌరవించలేదు, మన భయాన్ని మన్నించలేదు, మన గౌరవాన్ని కాపాడలేదు. మనకంటే కూడా గట్టిగా లంకలోని కొన్ని పార్టీలు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీశాయి. మనలను ఆదుకోవాల్సిన చైనా అప్పుతీర్చడాన్ని మాత్రమే గుర్తుచేస్తుంటే, భారతదేశం విస్తృతంగా సాయపడిందనీ, ఈ దశలో చైనా నౌకను స్వాగతించడం వ్యూహాత్మకంగానూ నైతికంగానూ ఘోరతప్పిదమని పలువురు ప్రముఖులు సైతం విమర్శించారు. కానీ, అంతిమంగా చేయగలిగిందేమీ లేక కాబోలు, మన విదేశాంగమంత్రి మాత్రం ఈ అంశాన్ని తేలికపరచే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రయోజానాలను మనం చూసుకోవాలి కానీ, చుట్టుపక్కలంతా మనమే పెత్తనం చేయాలని అనుకోవడం సరికాదంటున్నారు ఆయన. ఒక నౌక లంగరేసినంత మాత్రాన మన భద్రతకు పెనుప్రమాదమేమీ లేదని సులువుగా అనవచ్చును కానీ, రాబోయే రోజుల్లో అదే ఓడరేవు చైనా సైన్యానికి కీలకస్థావరంగా పరిణమించదని మాత్రం ఎవరూ గట్టిగా చెప్పలేరు.

Updated Date - 2022-08-18T11:55:11+05:30 IST