తోటపల్లి కుడి కాలువకు గండి

ABN , First Publish Date - 2022-07-26T04:17:00+05:30 IST

తోటపల్లి కుడి ప్రధాన కాలువకు గండిపడింది. సుంకి సమీపంలోని బోటు షికారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గండిపడడంతో సాగునీరు వృథాగా పోతోంది. ఈ నెల 21న తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర అట్టహాసంగా కార్యక్ర

తోటపల్లి కుడి కాలువకు గండి
కుడి కాలువకు గండిపడిన దృశ్యం

వృథాగా పోతున్న సాగునీరు

ఆందోళనలో ఆయకట్టు రైతులు

గరుగుబిల్లి, జూలై 25 : తోటపల్లి కుడి ప్రధాన కాలువకు గండిపడింది. సుంకి సమీపంలోని బోటు షికారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గండిపడడంతో సాగునీరు వృథాగా పోతోంది. ఈ నెల 21న తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర అట్టహాసంగా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇంకా కాలువ శివారు ఆయకట్టుకు నీరు చేరలేదు. అప్పుడే గండిపడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలతో అదును దొరకక విత్తనాలు చల్లుకోవడం ఆలస్యమైంది. ఆ ప్రభావం నీటి విడుదలపై పడింది. ఏటా ఖరీఫ్‌లో నీరు విడుదల చేసే సమయంలో అధికారులు కాలవల పరిస్థితిని అంచనా వేసేవారు. అక్కడక్కడా మరమ్మతులు పనులు చేపట్టేవారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్లు నిధులతో కాలువ నిర్వహణ పనులు చేసేవారు. అయితే గత మూడేళ్లుగా అటువంటిదేమీ లేదు. దీంతో కాలువలు దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నీరు విడుదల చేసిన  కొద్దిరోజులకే కాలువకు గండ్లు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఎడమ ప్రధాన కాలువ నుంచి 414 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 106 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ అధికారులు కొద్దిపాటి నీటినే విడుదల చేశారు. అయినా కాలువలు గండికొట్టాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వేలాది ఎకరాలకు సాగునీరందించే కాలువలను ఆధునీకరించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వరి ఆకు అందుబాటులోకి వచ్చింది. ఎక్కడికక్కడే గండ్లు పడుతుండడంతో శివారు ఆయకట్టుకు నీరందని దుస్థితి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా గండిని పూడ్చాలని కోరుతున్నారు. దీనిపై తోటపల్లి ప్రాజెక్టు డీఈ రవికుమార్‌ వద్ద ప్రస్తావించగా.. మంగళవారం గండి పూడ్చుతామన్నారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.




Updated Date - 2022-07-26T04:17:00+05:30 IST