నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

ABN , First Publish Date - 2021-07-30T06:34:41+05:30 IST

చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ఉపాధి హామీ నిఽధులతో పంచాయితీకి ఒకటి చొప్పున చెత్త సంపద కేంద్రాలను నిర్మించింది.

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు
మళ్లచెట్లతో నిండిన చెత్త సంపద కేంద్రం

పీసీపల్లి, జూలై 29 : చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ఉపాధి హామీ నిఽధులతో పంచాయితీకి ఒకటి చొప్పున చెత్త సంపద కేంద్రాలను నిర్మించింది. జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయితీకి రూ.2లక్షలతో, మేజర్‌ పంచాయితీలకు 7నుండి10లక్షల రూపాయలతో మండలంలోని ప్రతి పంచాయితీలో చెత్త సంపద కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఉన్న చెత్తను సేకరించి యంత్రాల ద్వారా గ్రేడింగ్‌ చేసి నిల్వ చేసేందుకు ఆ కేంద్రాలు ఉపయోగపడాలి. చెత్తసంపద కేంద్రాల ప్రాంగణంలో నిర్మించిన నాడెప్‌ తొట్లలో వానపాముల ద్వారా సేంద్రీయ ఎరువుల తయారీ చేయాలి. తయారైన ఎరువును విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం తేవాలి. అయితే గత ప్రభుత్వం నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు ప్రస్తుతం చిల్లచెట్లు, ముళ్లపొదల్లో కనుమరుగయ్యాయి.వాటి పరిసరాల్లో నిర్మించిన నాడెప్‌ తొట్లలో పిచ్చిమొక్కలు మొలిచాయి. పలుచోట్ల అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మండలంలో తలకొండపాడు, గుంటుపల్లి, చౌటగోగులపల్లి గ్రామాల్లోని చెత్తసంపద కేంద్రాలను ముళ్లపొదలు కప్పేయగా పీసీపల్లి, పెదయిర్లపాడు తదితర గ్రామాల్లోని చెత్తసంపద కేంద్రాలు మందుబాబులకు, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణాలోపంతో చెత్తసంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనం వృథా అయింది. ఆయా గ్రామాల ప్రజలు వీటిని చూస్తున్నప్పుడల్లా అధికారుల పనితీరు ఇదేనా అంటూ చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత పంచాయితీ అధికారులు స్పందించి చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-07-30T06:34:41+05:30 IST