రాజా కథలో వసూల్‌ రాణి?

ABN , First Publish Date - 2022-08-05T08:34:23+05:30 IST

రాజా కథలో వసూల్‌ రాణి?

రాజా కథలో వసూల్‌ రాణి?

‘వసూల్‌ రాజా’ దందాలో కొత్త కోణం

కీలక విషయాల్లో నిర్ణయాలు ఆమెవే

ఆమె భర్తకు అడ్డగోలు అందలం

రుషికొండ వ్యవహారంలో కీలకపాత్ర

బదిలీలు, పోస్టింగ్‌లు ఆమె ద్వారానే

బెంగళూరు దందాల మాటేమిటి?

సీనియర్‌ అధికారుల్లో చర్చ

ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతల్లోనూ సమీక్షా సమావేశాల్లో ప్రస్తావన

ప్రభుత్వ పెద్దల మౌనం ఎందుకో!

ఇందులో ఏదైనా మతలబు ఉందా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వసూల్‌ రాజా ధనాధన్‌ దందాలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఇప్పటివరకు భార్య, బావమరిది, ఇతర సన్నిహితుల ద్వారానే దందాలు, సెటిల్‌మెంట్‌లు, వసూళ్లు జరిగాయని అనేక ఉదంతాలు వెలుగుచూశాయి. అంతకు మించి అన్నట్లుగా... ఓ కలెక్షన్‌ క్వీన్‌ ఆయన కోసం పనిచేస్తున్నట్లుగా తాజాగా బయటకొచ్చింది. బదిలీలు, పోస్టింగ్‌లు, సిఫారసులు, ఇంకా రాయలసీమ జిల్లాలకు చెందిన సెటిల్‌మెంట్లు అన్నీ ఆమె ద్వారానే జరుగుతున్నాయని తెలిసింది. అమరావతిలో నిర్ణయాలు తీసుకుంటే బెంగళూరు కేంద్రంగా పంపకాలు చక్కబెడుతున్నారని అధికారవర్గాల్లో చర్చజరుగుతోంది. రుషికొండ వ్యవహారంలోనూ ఆమె కుటుంబానిదే కీలక పాత్ర అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... ఆమెది సచివాలయ సర్వీసు కానేకాదు. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన మరేదో విభాగం. వసూల్‌రాజా ముఖ్యనేత వద్దకు వచ్చిన వెంటనే తనకు బాగా నమ్మకస్థురాలు, బంధువయిన ఆమెను తనకార్యాలయంలోకి తీసుకొచ్చారని తెలిసింది. ఇక ఆ తర్వాత అంతా ఆమెదే హవా అని చెబుతున్నారు. ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్లు, సెక్షన్‌లు, వారికి కోరుకున్న సబ్జెక్టులు ఇప్పించడం, ముఖ్యకార్యదర్శుల నుంచి మంత్రుల పేషీల్లో వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌), ఓఎ్‌సడీ, వ్యక్తిగత సహాయకుల(పీఏ) నియామకం, అందుకు అవసరమైన సిఫారసులు ఆమె నుంచే వెళ్తున్నాయని తె లిసింది. సర్కారుకు ఆదాయం తీసుకొచ్చే కీలక విభాగాల్లో  ఏఏ అధికారికి ఏ విభాగం అప్పగించాలన్న సిఫారసులు కూడా ఈమె నుంచే వెళ్లాయని, అలా గుట్టుచప్పుడు కూడా పనులు చక్కబెట్టారని తెలిసింది. తన చర్యలతో ఆయా శాఖల్లో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు వసూల్‌రాజాకు పెద్ద నెట్‌వర్క్‌నే ఆమె సిద్ధం చేశారని, ఏ శాఖలో ఏం జరిగినా వెంటనే ఆయనకు తెలిసే పరిస్థితిని కల్పించారని ఓ సీనియర్‌ అధికారి చెబుతున్నారు. ‘‘ఈ మధ్యలో ఓ అధికారిపై ఫిర్యాదులు రాగానే ఆయనను సరెండర్‌ చేయమని చెప్పాం. అంతే..నిమిషాల వ్యవధిలో ఫోన్‌లు. ఇదీ వారి స్థాయి. వారి నెట్‌వర్క్‌ ముందు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కూడా చిన్నదేమో అనిపిస్తోంది’’ అని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. వసూల్‌ రాజా అండతో ఆమె తన సొంత ఎదుగుదలకు పెద్దపీటలే వేసుకున్నారు. ఓ శాఖలో తన భర్తకు అర్హతకు మించిన పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. నలుగురు అధికారులు చేపట్టే విభాగాలకు తన భర్తనే ఇన్‌చార్జి పెట్టించారు. దాని ఫలితం రుషికొండ వ్యవహారంలో భారీగా కనిపిస్తోందని తెలిసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసి దాన్ని ఆఫీసు వ్యవహారాలకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. 


సండే వాకింగ్‌ మీటింగ్‌లు

వసూల్‌ రాజా ప్రతి వీకెండ్‌ విధిగా హైదరాబాద్‌ వెళ్తుంటారని తెలిసింది. అక్కడ ఓ ప్రముఖ క్లబ్‌లో తన టీమ్‌తో మార్నింగ్‌ వాక్‌ చేస్తుంటారు. ఇక ఈయన అక్కడికి వస్తున్నారన్న విషయం సెటిల్‌మెంట్‌ చేసుకోవాల్సిన వ్యక్తులు, పార్టీలకు వసూల్‌ రాణి ద్వారా వెళుతుంది. ఈ సమాచారంతో పలువురు వీవీఐపీలు కూడా మార్నింగ్‌ వాక్‌కోసం ఆ క్లబ్‌కు వెళ్లి అక్కడే కీలకమైన అంశాలపై చర్చించుకునేవారని తెలిసింది. ఆ తర్వాత ఆ పార్టీలు ఆమె సమక్షంలో పనులు చక్కబెట్టుకునేవని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బెంగళూరులో సిట్టింగ్‌లు, పంపకాల మాటేమిటని కొందరు సీనియర్‌ అధికారులు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాయలసీమకు చెందిన పలు అంశాలు అక్కడే సెటిల్‌ అవుతున్నాయని, ఇవి కూడా ఆమె ద్వారానే నడుస్తున్నాయని చెబుతున్నారు. 


వసూల్‌ రాజా ఈయనే కదా..!

వసూల్‌రాజా ఎవరో ప్రజాప్రతినిధులు, అధికారులకు అర్ధమయిపోయింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆయన గురించే చర్చ. ‘మీడియాలో వస్తోంది నిజమే కదా...ఉన్నదే రాస్తున్నారు కదా’ అని పలువురు సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరయితే..మీడియాలో 20 శాతమే వచ్చిందని, ఇంకా అనేక విషయాలు వెలుగుచూడనివి ఉన్నాయంటూ బాహటంగానే  చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. ‘అన్నా.. రాస్తున్నది నీ గురించేనట కదా!’ అని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆయనను పరామర్శిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన ఓ సమీక్షా సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశం నుంచి బయటకొచ్చిన వారు...‘‘ఆంధ్రజ్యోతి’లో వస్తున్న వసూల్‌రాజా కథనాలు ఈయన గురించే. అయినా ఇతన్ని కీలక సమావేశాలకు పిలుస్తున్నారేమిటి?’’ అని పెదవి విరుస్తున్నారు. నిజానికి వసూల్‌రాజా ఎవరో యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు కూడా తెలిసిపోయింది. అయినా.. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టిపెట్టకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ మౌనం వెనుక మరేదైన మతలబు ఉందా....అన్న సందేహాలను సీనియర్‌ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-05T08:34:23+05:30 IST