బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం.. లాక్‌డౌన్ దిశగా వాషింగ్టన్

ABN , First Publish Date - 2021-01-15T18:04:54+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.

బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం.. లాక్‌డౌన్ దిశగా వాషింగ్టన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానిలో మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో ఇప్పటికే రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. తాజాగా నగరంలో కనీసం 20,000 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని అధికారులు యోచిస్తున్నందున అక్కడి హోటళ్లు, విమానయాన సంస్థలు, ఇతర వ్యాపార సముదాయాలు కూడా భద్రతను పెంచాయి. దీంతో రాజాధాని నగరం లాక్‌డౌన్ దిశగా పయనిస్తోంది. ప్రముఖ ఎయిర్ లైన్స్ డేల్టా ఎయిర్ ప్రయాణికులపై ప్రత్యేక ఆంక్షలు విధించడం కూడా దీనికి నిదర్శనం. వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులను తమ విమానాల్లో ఎక్కించుకోవడంలేదని ఈ సందర్భంగా సీఈఓ బాస్టియన్ వెల్లడించారు.  


ఇక ఈ నెల 6న జరిగిన కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ఘటన అనంతరం అప్రమత్తమైన వ్యాపార సముదాయాలు భద్రతను పెంచుకునే పనిలో పడ్డాయి. ప్రమాణ స్వీకారం రోజున అల్లరిమూకలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అటు ఇప్పటికే కేపిటల్ భవనం, సుప్రీం కోర్టు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చట్టు కూడా భద్రతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటి చుట్టుపక్కల ఉన్న వ్యాపార సముదాయాలు, అటువైపు వెళ్లే రోడ్డు మార్గాలను అధికారులు ఇప్పటికే మూసివేశారు. అలాగే శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మెట్రో స్టేషన్స్, బస్సు రూట్లు కూడా మూతపడనున్నాయని సమాచారం. నేషనల్ పార్క్ సర్వీసులను కూడా నిలిపివేయనున్న నేపథ్యంలో వాషింగ్టన్ స్మారక చిహ్నం సందర్శనకు వచ్చే పర్యాటకులను నగరానికి రావొద్దని మేయర్ మురియెల్ బౌసెర్ కోరారు. ఇలా వాషింగ్టన్ నగరం కట్టుదిట్టమైన భద్రత మధ్య బైడెన్ ప్రయాణస్వీకారం రోజు నాటికి దాదాపు లాక్‌డౌన్ అయ్యే అవకాశం ఉంది.  


Updated Date - 2021-01-15T18:04:54+05:30 IST