బీజేపీ 2019లో డబ్బులు ఆఫర్ చేసిందన్న కర్ణాటక మాజీ మంత్రి

ABN , First Publish Date - 2021-09-13T01:23:10+05:30 IST

రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసినట్టు..

బీజేపీ 2019లో డబ్బులు ఆఫర్ చేసిందన్న కర్ణాటక మాజీ మంత్రి

బెంగళూరు: రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసినట్టు కర్ణాటక మాజీ మంత్రి, కాగ్వాడ్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టినట్టు చెబుతున్నారు. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలలో శ్రీమంత్ పాటిల్ ఒకరు. నాటి పరిణామంతో హెచ్‌డీ కుమారస్వామి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.


''ఎంత డబ్బు కావాలని వాళ్లు నన్ను అడిగారు. డబ్బు వద్దన్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంచి పొజిషన్ ఇమ్మని అడిగాను. డబ్బులు తీసుకోకుండానే బీజేపీలో చేరాను. మంత్రివర్గం ఎప్పుడు విస్తరిస్తే అప్పుడు మీ పేరు పరిశీలిస్తున్నామని ప్రస్తుతం వారు వాగ్దానం చేశారు'' అని పాటిల్ చెప్పారు. కుమారస్వామి సర్కార్ పతనం అనంతరం బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పాటిల్, బీజేపీలో చేరిన తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలుపొందారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. కాగా, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కమలనాథులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారంటూ కాంగ్రెస్, జేడీఎస్ అప్పట్లో విమర్శలు గుప్పించగా, బీజేపీ తోసిపుచ్చుతూ వచ్చింది. తాజాగా, బీజేపీకే చెందిన పాటిల్ తనకు కూడా బీజేపీ అప్పట్లో డబ్బులు ఎర చూపించిందంటూ వ్యాఖ్యానించడం బీజేపీని ఇరుకున పెట్టింది. అందులోనూ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.

Updated Date - 2021-09-13T01:23:10+05:30 IST