అప్పటి చీకటే చిక్కగా ఉన్నదా?

ABN , First Publish Date - 2021-02-11T06:37:08+05:30 IST

అల్బర్ట్ కామూ నవల ‘ది ప్లేగ్’లో లాగా, మొదటి సారిగా రోడ్డు మీద చచ్చిన ఎలుక కనిపించినప్పుడు, ఎవరూ పట్టించుకోరు. తరువాత తరువాత...

అప్పటి చీకటే చిక్కగా ఉన్నదా?

అల్బర్ట్ కామూ నవల ‘ది ప్లేగ్’లో లాగా, మొదటి సారిగా రోడ్డు మీద చచ్చిన ఎలుక కనిపించినప్పుడు, ఎవరూ పట్టించుకోరు. తరువాత తరువాత గుట్టలు గుట్టలుగా చచ్చిన ఎలుకలు. మనుషులకు జ్వరాలు మొదలవుతాయి. ఏదో జరుగుతోందని తెలుస్తుంటుంది, పత్రికల్లో వార్తలు కూడా వస్తుంటాయి. కట్టడులు మొదలవుతాయి. ఎలుకలు చచ్చిపోవడం తగ్గిపోయి, మనుషులు మరణించడం మొదలవుతుంది. ప్రమాదం గురించి ఎవరో వైతాళికుడు హెచ్చరించినప్పుడు, తక్కినవారు హేళన చేస్తారు. కనిపిస్తున్నదే చూస్తారు, చూపు ప్రసరించి చూడరు. తమను తాకే దాకా ఖాతరు చేయరు. ఫాసిస్టు ప్రమాదాన్ని, నాజీజాన్ని ఎదుర్కొనడంలో ఫ్రాన్స్ చూపిన మందకొడితనాన్ని మనసులో పెట్టుకుని కామూ ఆ నవల రాశాడంటారు.


ప్రమాదాన్ని అంచనావేయడం సులువేమీ కాదు. పైకి కనిపించేదే సత్యమైతే, ఇక జ్ఞానానికి, శాస్త్రానికి అర్థమే లేదని ఒక పెద్దాయన అంటాడు.  దారి మొదట ఎటువంటి సూచిక ఉన్నప్పటికీ, అది మనలను ఎక్కడికి తీసుకుపోతుందో, మునుపు ఆ దారిని వెళ్లిన వారు చెప్పగలరు. అటువంటి దారుల్లో ఎన్ని మభ్యపెట్టేవి, ఎన్ని వాస్తవవైనవి ఉండగలవో తరతరాలుగా క్రోడీకరించిన సమాచారం ఆధారంగా చెప్పగలరు. జ్ఞానం వివేచన రెండూ ప్రపంచం చూపించని సత్యాలను చూపిస్తాయి. హెచ్చరిస్తాయి, జాగ్రత్తలు చెబుతాయి, మొక్కగా ఉండగానే వంచవలసినవి, బుసగొట్టకముందే పసిగట్టవలసినవి ఏమిటో హితవు చెబుతాయి. ఒక్కోసారి మంచిమాటలకు కొరత ఏర్పడుతుంది. మాట్లాడేవారు అరుదైపోతారు. ఒక వేళ మంచిమాటలు వినిపించినా పెడచెవిన పెడతాము. ప్రమాదం ఏమీ లేదని ధీమాగా ఉంటాము. అతిగా స్పందిస్తే నష్టమేమీ లేదు, కలవరపాటు తప్ప. కానీ, స్పందనే లేకపోతే, ప్రాణం మీదకు వస్తుంది.


భారతదేశంలో ఇప్పుడున్న పాలన గురించి, కేంద్రప్రభుత్వ పాలన గురించి రకరకాల అంచనాలు ఉన్నాయి. కొందరు దీనంత ఉత్తమప్రభుత్వం లేదని నమ్ముతున్నారు. మరికొందరు ఇది అత్యంత నిరంకుశ ప్రభుత్వమని విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిమానిస్తున్నవారు ప్రధానంగా ఉద్వేగ కారణాలతో అభిమానించడం కనిపిస్తుంది. దేశభక్తికి, జాతీయతకు ఈ పాలనలో పెద్ద పీట అని, లోపలి బయటి శత్రువులనుంచి ప్రజలను రక్షించే ధైర్యం, సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉన్నాయని వారు నమ్ముతారు. ప్రభుత్వం ఎవరిపై శత్రుభావంతో ఉంటుందో వారిపై వీరికీ అదే భావం ఉంటుంది. ఉద్యమకారులు, విమర్శకులు అందరూ ప్రభుత్వ ద్రోహులు, దేశద్రోహులుగా వారికి కనిపిస్తారు. అంత భక్తితో కాకపోయినా, ఈ ప్రభుత్వానిది సత్పరిపాలన అని భావించేవాళ్లు కొందరుంటారు. కొన్ని కొన్ని అంశాలలో సమర్థిస్తూ, కొన్ని విషయాలలో విమర్శిస్తూ, మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఉన్నదానితో సంతృప్తిపడేవారు ఇంకొందరు. అట్లాగే, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారిలో కూడా ఆ వ్యతిరేకత అనేక స్థాయిలలో ఉంటుంది. వ్యతిరేకించేవారు పాలనలో మార్పు తెచ్చే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి, వారి ఆచరణకూ, వారి విమర్శ స్థాయికీ నైష్పత్తిక సంబంధం ఉంటుంది. అంత ప్రమాదం లేదనుకున్నవాడు ఒక స్పందన చూపిస్తాడు. అతి ప్రమాదం ఉన్నదనుకున్న వారు హాహాకారాలు, ఉద్యమనినాదాలు చేస్తారు. 


మన దేశంలో ప్రస్తుత పరిస్థితిని 1975 నాటి అత్యవసర పరిస్థితితో పోల్చడానికి లేదు. ఇప్పటికీ మనకు ఎన్నో స్వేచ్ఛలు, అవకాశాలు ఉన్నాయి.. అని ప్రసిద్ధ పాత్రికేయుడు ఎన్. రామ్ ఈ మధ్య ఒక వెబ్ సదస్సులో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పత్రికాస్వేచ్ఛను ప్రస్తావిస్తూ, తీవ్రమైన అభిప్రాయాలను ప్రకటించడానికి, అణచివేతను ఎదుర్కొనడానికి ఇంకా కొన్ని మార్గాలు మిగిలే ఉన్నాయి- అని ఆయన అన్నారు. బహుశా, సార్వత్రక సెన్సార్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పుడు దేశంలో అటువంటిదేమీ అమలులో లేదనవచ్చు. రామ్ చెప్పినట్టు, ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదు. ఈ నలభై అయిదేళ్ల కాలంలో అదనంగా వచ్చి చేరిన మాధ్యమాలు కూడా ఈ అవకాశాలను పెంచుతున్నాయి. నిర్బంధాన్ని, నిషేధాన్ని ఎట్లా తూచాలి అన్నది ఒక ప్రశ్న. తీవ్రత నుంచా, విస్తృతి నుంచా? మాధ్యమాలు, అవకాశాలు పెరిగినట్టే నిర్బంధ పద్ధతులు కూడా పెరిగాయి. అనేక మాధ్యమాలు ప్రభుత్వ అనుకూల వైఖరితో నడుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక వైఖరులు తీసుకుంటున్న పత్రికాసంస్థలు ఉంటే వాటికి తగిన హెచ్చరికలు అందుతున్నాయి. మీడియా సంస్థల పాత్రికేయ అధిపతుల నియామకాలు కూడా స్వతంత్రంగా జరగడం లేదు. ప్రత్యక్ష ప్రసారంలో పొరపాటు దొర్లినా దేశద్రోహం కేసు పెడుతున్నారు. వర్తమాన అంశాలపై విదూషక వ్యాఖ్యలు చేసే స్టాండప్ కమెడియన్‌ను కూడా దీర్ఘకాలం జైల్‌లో పెడతారు. అత్యాచారం జరిగిన గ్రామానికి బయలుదేరిన పాత్రికేయుని మార్గమధ్యంలోనే అరెస్టు చేసి అత్యంత కఠినమైన చట్టం కింద నిరవధికంగా నిర్బంధిస్తారు. సెన్సార్‌షిప్ అధికారికంగా అమలుకావడం ఎక్కువ హానికరమా, ప్రతి కంఠం మీదా ఒక కత్తి వేలాడడం ఎక్కువ బాధాకరమా? రామ్ చేసిన వ్యాఖ్యలు సానుకూల దృక్పథంతో, ధైర్యం చెప్పడానికి చేసినవి అయి ఉండవచ్చు. ఆయన మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉన్న, ఉండవలసిన అనేక మంది వేసిన అంచనాలు తటపటాయింపుతో కూడి ఉంటున్నాయనిపిస్తుంది. కేంద్రప్రభుత్వం ఫాసిస్టు అని ఒకరు అంటారు, ఫాసిస్టు అనకూడదు, కొన్ని ఫాసిస్టు పోకడలుండవచ్చు, వాటిని మాత్రం ఫాసిస్టు విధానాలందాము అని మరొకరు అంటారు. నియంతృత్వం అనవచ్చునా, అని మరొకరు చర్చిస్తారు. ఏ పేరు పెడితేనేమి, విధానాల ప్రస్తుత స్థితి, వాటి గమనరీతి, పర్యవసానాలు.. అవగతం చేసుకోగలిగిన అవగాహన ఉన్నవారు కూడా కొందరు పండిత చర్చతో కాలక్షేపం చేస్తారు. 


మహువా మొయిత్ర, మార్క్సిస్టు కాదు, మావోయిస్టు కాదు. ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చిన ఆధునిక మహిళ, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి. దేశంలోని సమస్త బాధిత శ్రేణి తరఫునా తానే బాధ్యత తీసుకున్నట్టు, ఆమె పార్లమెంటులో మాట్లాడతారు. సుమారు ఏడాదిన్నర కిందట ఎంపిగా ఎన్నికై, లోక్‌సభలో మొదటిసారిగా చేసిన ప్రసంగంలోనే ప్రభుత్వంపై దండెత్తారు. యూదు వ్యతిరేక నాజీ హింసాకాండ ప్రదర్శనశాల ‘హోలోకాస్ట్ మ్యూజియం’లోని ఒక పోస్టర్‌లో పేర్కొన్న ఏడు ఫాసిజం తొలిసూచనలను ఉటంకిస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఆమె అన్వయించారు. ఈ విధానాలు ఇట్లాగే కొనసాగితే అది ఫాసిజానికి దారితీస్తుందని ఆమె అభిప్రాయం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడుతూ, సోమవారం నాడు మహువా చేసిన ప్రసంగం మరోసారి సంచనలం సృష్టించింది. నైతికత స్థానంలో దమననీతిని అనుసరిస్తోందని, కవులను మేధావులను జైళ్లలో పెట్టి వేధిస్తోందని, జాతీయవాదాన్ని సంకుచిత మత నినాదంగా మార్చివేసిందని ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


కొంతకాలం క్రితం, జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ కూడా 1975 నాటి అత్యవసర పరిస్థితికి, 2014 తరువాత దేశంలో నడుస్తున్న పాలనకు పోలిక తెచ్చారు. ఏది కఠినమైనది, ఏది మృదువైనది అన్న తారతమ్య చర్చ ఆయన చేయలేదు కానీ, ఇందిరాగాంధీ నియంతృత్వం, వ్యక్తిగత నిరంకుశత్వమని, ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థుల మీద గురిపెట్టినదని. దాని వెనుక ఎటువంటి సైద్ధాంతిక లక్ష్యమూ లేదని అభిప్రాయపడ్డారు. నైతిక, సామాజిక పోలిసింగ్ కానీ, జాతీయవాదాన్ని మతంతో ముడిపెట్టడం కానీ, పక్క మనిషిని చూసి బెదిరిపోయే అవసరం కానీ నాటి నియంతృత్వంలో లేవని ఆయన గుర్తు చేశారు. ఉపా వంటి కర్కశ చట్టాన్ని భారతదేశంలో ఎంత విస్తృతంగా ఉపయోగిస్తున్నారో గమనిస్తే, ప్రతి ప్రజా ఆందోళనను దేశద్రోహకరమైనదిగా ఎట్లా చిత్రిస్తున్నారో చూస్తే, ఆ నాటి అత్యవసర పరిస్థితితో పోలిక కుదరదని అర్థమవుతుంది. ఇది పూర్తిగా వేరే పరిస్థితి. అప్పటిలాగా మూకుమ్మడి నిర్బంధం కాక, ఇప్పుడు ఎంపిక చేసిన నిర్బంధాలు ఉండవచ్చు. అత్యవసర పరిస్థితి నిర్బంధకాలం కంటె, ప్రస్తుత నిర్బంధాలు మీరిపోవడం కొందరి విషయంలో గమనించవచ్చు. అన్నిటికంటే, భయానకమైన తేడా, అప్పటి చీకటిని అందరూ చాటుగానో బాహాటంగానో చీకటి అనే పిలిచారు. ఇప్పటి చీకటికి జనం జేజేలు కొడుతూ వెలుతురుగా కీర్తిస్తున్నారు. సమ్మతికి మించిన రాజ్యాయుధం ఉంటుందా? సమస్త అస్తిత్వ శ్రేణులు, ఉద్యమ బృందాలు, ప్రత్యామ్నాయ సాధకులు అందరి మీదా ఒక నీడ పరుచుకుని ఉంది. సంతరించుకున్న సమస్త ఆధునిక, ప్రగతిశీల విలువలకూ చెల్లుబాటు నశిస్తున్నది. ఇటువంటి ధోరణి మనలను 1930ల నాటి జర్మనీలోకి నడిపించుకు వెడుతుందని ఎవరైనా హెచ్చరిస్తే, అందులో నుంచి హితవును తీసుకుంటే తప్పేమిటి? ఇందిర నియంతృత్వానికి ఎన్నికలతో తెరపడింది. ఇప్పుడు ఎన్నికల ద్వారా మరింతగా మరింతగా నియంతృత్వం విస్తరిస్తున్నది, ఎందుకంటే, ఇది వ్యక్తి నియంతృత్వం కాదు, సైద్ధాంతిక నియంతృత్వం. 


అంత ప్రమాదం లేదనుకునేవారు, అది సమీపించేదాకా నిశ్చింతగా ఉండవచ్చు. వ్యక్తీకరణ మార్గాలు మూసుకుపోలేదనుకున్న వారు మాత్రం, ఆ మార్గాల ద్వారా ప్రమాదసూచికలు ఎగురవేయవలసిందే! 


కె. శ్రీనివాస

Updated Date - 2021-02-11T06:37:08+05:30 IST