సమర యోధులు నల్లమల వీరులు

ABN , First Publish Date - 2022-08-11T05:15:36+05:30 IST

నల్లమల నిప్పై మండిన రోజులవి.

సమర యోధులు నల్లమల వీరులు

బ్రిటీష్‌వాళ్లను ఎదిరించిన బయ్యన్న, హనుమంతు
బయ్యన్న తలకు రూ.10వేల బహుమతి  ప్రకటించిన బ్రిటీష్‌ ప్రభుత్వం
నల్లమలను కాపాడేందుకు వీరోచిత తిరుగుబాటు
ఇద్దరినీ చెట్లకు కట్టేసి కాల్చేసిన వలస పాలకులు
తుమ్మల బయలు వద్ద ఇరువురి విగ్రహాలు


నల్లమల నిప్పై మండిన రోజులవి. బ్రిటీష్‌ దొరల నుంచి అడవిని కాపాడటానికి పెద్ద బయన్న, హనుమంతప్ప సాయుధ తిరుగుబాటు చేశారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా చెంచులను కూడగట్టారు. వాళ్లను చైతన్యపరిచారు. చెంచు సైన్యాన్ని తయారు చేశారు. బ్రిటీష్‌ వాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. చెంచు విప్లవకారులను పట్టుకోడానికి నల్లమలలో బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. చిట్టచివరికి బయ్యన్నను, హనుమంతును పట్టుకొని కాల్చేశారు. దేశవ్యాప్తంగా బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన వందలాది ఆదివాసీ రైతాంగ సాయుధ పోరాటాల్లో నల్లమల బయన్న, హనుమంతప్ప త్యాగం అజరామరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా చెంచు అమరుల సాహసంపై ప్రత్యేక కథనం..

-ఆత్మకూరు

బ్రిటీష్‌ వ్యతిరేకంగా దేశంలో అనేక సామాజిక వర్గాల నుంచి తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో ఆదివాసులు చేసిన పోరాటాలు శిఖరాయమానం. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వయంపాలనను, స్వావలంబనను కాపాడుకోడానికి, అటవీ సంపదను నిలబెట్టుకోడానికి, దుర్మార్గమైన పన్నుల విధానాన్ని ధిక్కరించడానికి ఆదివాసులు పోరాడి అసాధారణ త్యాగాలు చేశారు. ఆ వరుసలో మన నల్లమల చెంచు పెద్ద బయ్యన్న, హనుమంతు కూడా నిలుస్తారు.

తెల్లదొరలను గడగడలాడించిన పెద్దబయన్న

ఒకప్పటి కర్నూలు జిల్లాలోని దోర్నాల మండలం, పెద్దచేమ గ్రామానికి చెందిన కుడుముల పాపన్న కుమారుడు  పెద్దబయన్న(పెద్ద బైలోడు). పరాయి పాలకులు అటవీ సంపదను కొల్లకొట్టేందుకు నల్లమలలోకి వచ్చారు. అటవీ ఉత్పత్తులపై చెంచుల నుంచి పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టారు. చెంచులతో వ్యక్తిగత పనులు చేయించుకొనేవారు. వాళ్ల శ్రమను కొల్లగొట్టేవారు. చెంచు మహిళలపై అఘాయిత్యాలు చేసేవారు. వారు మరణిస్తే శవాలను ఎక్కడో పడేసేవారు. ఈ దుశ్చర్యలను చూసి పెద్దబయన్న బ్రిటీష్‌వాళ్లపై కసి పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నల్లమలపై తమ జెండాను ఎగరేసి అధికారాన్ని చాటుకోవాలని బ్రిటీష్‌ వారు అనుకున్నారు. తమ జెండాను ఎగురవేయాలని వేయాలని చెంచులను ఆదేశించారు. ఇది పెద్దబయన్న ఆగ్రహానికి కారణమైంది. తుమ్మలబయలు గ్రామాన్ని స్థావరంగా చేసుకుని బ్రిటీష్‌ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టాడు. నల్లమలలోని పెద్దచేమ, చింతల, మర్రిపాలెం, తుమ్మలబయలు తదితర ప్రాంతాలను బ్రిటీష్‌ సైన్యం అప్పటికే ఆక్రమించుకుంది. ఒక సందర్భంలో బ్రిటీష్‌వాళ్లకు పెద్దబయ్యన్న ఎదురుపడగా పెద్దచేమ కొండ మీద తమ జెండా ఎగురవేయాలని ఆదేశించారు. పెద్దబయన్న అంగీకరించలేదు. తెల్లదొరలపై విల్లంబులతో దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పెచ్చెర్వుకు చేరుకున్నారు. అప్పటి నుంచి బ్రిటీష్‌ వారి కార్యకలాపాలకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన చెంచులతో సమావేశాలను నిర్వహించి చైతన్యపరచడం ప్రారంభించాడు. దీంతో బయన్నను మట్టుపెట్టాలని బ్రిటీష్‌వారు భావించారు. ఓరోజు తుమ్మలబయలు సమీపంలోని పిట్టబీతలబొక్క వద్ద మల్లమ్మ తల్లికి గ్రామస్థులంతా జాతర చేపట్టారు. ఆ సమయంలో పెద్దబయ్యన్న తీవ్రజ్వరంతో ఊళ్లోనే ఉండిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీష్‌ సైన్యం తుమ్మలబయలును చుట్టుముట్టి గాలింపు చేపట్టారు. పెద్దబయన్న అమ్మమ్మ ఆయనకు దుప్పటితో కప్పివేసి దాచేసింది. బ్రిటీష్‌సైన్యం వచ్చి అడగ్గా పిట్టబీతల బొక్క వద్ద జరిగే జాతర కు వెళ్లాడని చెప్పింది. దీంతో పిట్టబీతల బొక్క ప్రదేశానికి తీసుకెళ్లాలని చీకట్లో ఆ ముసలమ్మను వేధించారు. ఇక పెద్ద బయ్యన్న జ్వరంలో కూడా బ్రిటీష్‌వారు గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని దివిటీతో తాను దారిచూపిస్తానని చెప్పి బ్రిటీష్‌ సైన్యాన్ని అడవిలోకి తీసుకెళ్లాడు. వారిని ఓ గుండంలో పడవేసి దివిటితో నిప్పుపెట్టి బ్రిటీష్‌ సైన్యాన్ని మంటలకు ఆహుతి అయ్యేలా చేశాడు. దీన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పెద్దబయన్నను పట్టించిన వారికి రూ.10వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఆతర్వాత పెద్దబయ్యన్న కోసం బ్రిటీష్‌ సైన్యం అటవీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్‌ కాక్రేన్‌ పెద్దబయన్నను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. బ్రిటీష్‌ సైన్యం పెచ్చెర్వు గ్రామం ద్వారా తుమ్మలబయలుకు చేరుకుని చెంచులపై కాల్పులకు పాల్పడింది. తన కోసం అమాయక చెంచులు చనిపోవడం, గాయపడటం చూసి తట్టుకోలేక పెద్దబయ్యన్న బ్రిటీష్‌ సైన్యం ముందుకొచ్చాడు. గాయపడిన ఆయన్ను తుమ్మలబయలులోని ఓ చెట్టుకు కట్టేసి 1938 ఏప్రిల్‌ 25వ తేదిన కాల్చిచంపారు.

 జతగా హనుమంతప్ప

పెద్దబైలోడు పోరాటం సాగిస్తున్న సమయంలోనే కర్నూలు జిల్లాలోని కొత్తపల్లిలో చెంచుజాతికి చెందిన యువకుడు హనుమంతప్ప కూడా ఉద్యమంలోకి వచ్చాడు. ఈయన మెట్రిక్యూలేషన్‌ వరకు చదువుకున్నాడు. బ్రిటీష్‌వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాడు. బ్రిటీష్‌ సిబ్బంది చెంచు మహిళల పట్ల వ్యవహరించే తీరుతో ఆయన రలిగిపోయాడు. బ్రిటీష్‌ వారిని తరిమికొట్టేందుకు చెంచు పెంటల్లో ప్రజలను సమీకరించి దళాలను తయారు చేశాడు. పెద్దబయన్న పోరాడుతున్న సంగతి తెలిసి ఆయనతో చేతులు కలిపాడు. ఇద్దరూ ఏకకాలంలో చెంచు గూడేలు తిరిగి పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 25, 1938 నాడే హనుమంతప్పను కూడా బ్రిటీష్‌వారు పట్టుకున్నారు. చెట్టు కట్టేసి కాల్చి చంపేశారు. వీరి గురించి సాహితీ సుధా పౌండేషన్‌ వారు తెలుగు రాష్ట్రాల్లో గిరిజన ఉద్యమాలు, గుణపాఠాలు పుస్తకంలో ప్రస్తావించారు. చెంచు జాతి  స్వేచ్ఛ కోసం అసులువు బాసిన ఈ ఇరువురు చెంచు యోధులు చిరస్మణీయం.

ఆజాదీ కా  అమృత్‌ మహోత్సవ్‌లో అరుదైన గౌరవం

చెంచుల హక్కుల కోసం, అటవీ, వన్యప్రాణుల రక్షణ కోసం బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసిన ఆదివాసుల చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించింది. మద్రాస్‌ లైబ్రరీలో లభించిన ఆధారాలతో శ్రీశైలం ఐటీడీఏ అధికారులు నల్లమలకు చెందిన ఆదివాసులు పెద్దబయన్న, హనుమంతప్ప స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి గురించి కేంద్రానికి ప్రతిపాదించింది. దీంతో అజాదీ కా  అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వారికి తగిన గౌరవాన్ని ఇస్తూ.. ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న తుమ్మలబయలు గ్రామంలో ఈ ఇద్దరికి విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడిక రాజన్న దొర, మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఇద్దరు స్వతంత్య్రవీరుల విగ్రహాలను ఆవిష్కరించారు. కాగా గతంలో అనేకమార్లు తమ పూర్వీకులు స్వతంత్య్ర పోరాటం పాల్గొన్నారని పెద్దబయన్న వారసులు ప్రభుత్వానికి లేఖలు రాసినా అప్పుడు వారిని గుర్తించలేదు. ఇంతకాలానికి ఆ అమరవీరులకు అరుదైన గౌరవం దక్కింది.

మా తాత కథలుగా చెప్పేవాడు

మాముత్తాత పెద్దబయన్న గురించి మా తాత కథలు, కథలుగా చెప్పేవాడు. ఓరోజు మా గూడేం చెంచులు దేవతకు మేకపోతు బలి ఇచ్చి బ్రిటీష్‌ సైన్యానికి విందు ఇచ్చారు. ఆరోజున విందులో పెద్దబయన్న మత్తు కలిపి 20మందికిపైగా బ్రిటీష్‌సైన్యాన్ని గొంతులు కోసి చంపినట్లు చెప్పేవాడు. ఇంకా ఎన్నోవిధాలుగా బ్రిటీష్‌వాళ్లపై పోరాడినట్లు చెప్పేవాడు. స్వతంత్య్ర సమరంలో పాల్గొన్న పెద్ద బయ్యన్నను గుర్తించాలని ఎన్నోమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. నేడు ఆజాదీ కా  అమృత్‌ మహోత్సవ్‌లో మా పూర్వీకులను గుర్తించడం సంతోషించదగ్గ విషయం.

- కుడుముల మూగన్న, పెద్దబయన్న వారసుడు, దోర్నాల  

మద్రాస్‌ లైబ్రరీలో లభించిన ఆధారాలతో గుర్తించాం

మద్రాస్‌ లైబ్రరీలోని బ్రిటీష్‌ కాలంనాటి రికార్డుల్లో లభించిన ఆధారాలతో పెద్దబయన్న, హనుమంతప్పల స్వతంత్య్ర పోరాటాన్ని గుర్తించాం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించగా అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో ఆదివాసీ సమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో తుమ్మలబయలులో ఇటీవలే ఈ ఇరువురిని విగ్రహాలను ఏర్పాటు చేశాం. స్కూల్‌ఎడ్యుకేషన్‌, ట్రైబల్‌ వేల్ఫేర్‌ దృష్టికి తీసుకెళ్లి నల్లమల ఆదివాసీ అమరుల పోరాట స్పూర్తిని తెలియజేసేలా పాఠ్యపుస్తకాల్లోకి తీసుకరావాలని ప్రతిపాదిస్తాం.

 - రవీంద్రారెడ్డి, ఐటీడీఏ పీవో, శ్రీశైలం. 

Updated Date - 2022-08-11T05:15:36+05:30 IST