ఖాళీ చేయండి

ABN , First Publish Date - 2021-12-01T06:34:41+05:30 IST

నగరంలోని రామరాజ్యనగర్‌ రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలు తక్షణమే ఖాళీ చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఖాళీ చేయండి
రామరాజ్యనగర్‌ రైల్వే స్థలంలోని నివాసాలు

రామరాజ్యనగర్‌ రైల్వేస్థలాల్లోని 750 పేద కుటుంబాలకు హెచ్చరిక

ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా అని ప్రశ్నిస్తున్న పేదలు


పాయకాపురం, నవంబరు 30 : నగరంలోని రామరాజ్యనగర్‌ రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలు తక్షణమే ఖాళీ చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్థలాలు ఖాళీ చేయడానికి బుధవారమే డెడ్‌లైన్‌ అని రైల్వే అధికారులు ప్రకటించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తాము ఎక్కడ తలదాచుకోవాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పాలకులు తమ ‘గూడు’ గోడును పట్టించుకోవడం లేదని, తమ ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని రోదిస్తున్నారు. 


రోడ్డునపడనున్న 750 కుటుంబాలు

పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ కింద ఉన్న రైల్వే స్థలంలో 750 కుటుంబాలు 50 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. రెండు వేల మందికి పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో యాచకులు, రోజువారీ పనులు చేసుకునే నిరుపేదలు అధికంగా ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఈలప్రోలులో ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే అక్కడ ఇళ్ల నిర్మాణం, సదుపాయాల కల్పన జరగలేదు. అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తికాకుండా వెళ్లేదెలా? అని వీరు ప్రశ్నిస్తున్నారు.

 

నేడు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ హెచ్చరిక

బుధవారంలోగా స్థలాలు ఖాళీ చేయాలని డెడ్‌లైన్‌ విధించిన రైల్వే అధికారులు స్థానికంగా ఫెక్సీలను ఏర్పాటు చేశారు. ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటం, ఈలప్రోలులో పక్కా గృహాల నిర్మాణం జరగకపోవడంతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జేసీబీలను తెప్పించి, ఇళ్లను కూల్చేస్తామని అధికారులు హెచ్చరించడంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం ఈలప్రోలులో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రత్యామ్నాయం అయినా చూపించాలని వేడుకుంటున్నారు. 


ప్రజాప్రతినిధుల మద్దతు కరువు

రైల్వే అధికారులు ఒత్తిడి పెంచుతున్నా ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలబడడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని, దేవదాయ శాఖ మంత్రి పక్కనే ఉన్నా, తమను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఇప్పటికిప్పుడంటే రోడ్డున పడతాం

కరోనా కష్టకాలంలో తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తే, వెళ్లడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలా ఉన్న ఫళాన ఖాళీ చేయమంటే పిల్లాపాపలతో రోడ్డున పడాల్సి వస్తుంది.  - రాజేష్‌ దంపతులు

Updated Date - 2021-12-01T06:34:41+05:30 IST