ఇన్వెస్టర్లకు హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-01-19T19:55:20+05:30 IST

ప్రతీ ఏడాదీ బడ్జెట్‌కు నెల రోజుల ముందు మార్కెట్లు... ఊగిసలాడుతుంటాయన్న విషయం తెలిసిందే. ముందటేడు మందగమనం అనంతరం దెబ్బమీద దెబ్బ అన్నట్లుగా నిరుడు(2020) కరోనా మహమ్మరి... భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇన్వెస్టర్లకు హెచ్చరిక!

న్యూఢిల్లీ : ప్రతీ ఏడాదీ బడ్జెట్‌కు నెల రోజుల ముందు మార్కెట్లు... ఊగిసలాడుతుంటాయన్న విషయం తెలిసిందే. ముందటేడు మందగమనం అనంతరం దెబ్బమీద దెబ్బ అన్నట్లుగా నిరుడు(2020) కరోనా మహమ్మరి... భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపధ్యంలో... ఇప్పుడు రానున్న బడ్జెట్‌పై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఫిబ్రవరి ఒకటిన మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారన్న విషయం తెలిసిందే. కాగా... బడ్జెట్‌కు మరో పది రోజుల సమయమున్న నేపధ్యంలో... ఈ 20 రోజుల్లోనే సెన్సెక్స్ రెండు శాతం వరకు ఎగసింది. కరోనా నేపధ్యంలో నిరుడు మార్చి 23 నుండి మార్కెట్లు కుప్పకూలుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో సూచీలు కూడా అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. గత రెండు నెలల కాలంలోనే సెన్సెక్స్ 47 వేల నుండి 49 వేల మార్కుకు చేరుకుంది. 


ఇన్వెస్టర్లకు నిరుడు నిరాశ... అంతలోనే...  

కరోనా నేపధ్యంలో ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి మార్కెట్లు దారుణంగా పతనమవుతూ రావడం, ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోవడం తెలిైసిందే. లాక్ డౌన్ సమయంలో పలువురు ఇన్వెస్టర్లు ఆందోళనతో షేర్లు అమ్ముకున్న సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. 


కాగా... ఆగస్టు, సెప్టెంబరు నుండి పరిస్థితి క్రమంగా కోలుకోవడం మొదలైంది. ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోయేలా భారీ నష్టాల నుండి లాభాల్లోకి ప్రారంభమయ్యాయి. గత ఆరు నెలలుగా ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ అందుకుంటున్నారు. అయితే సూచీలు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. 


ఇన్వెస్టర్లకు హెచ్చరిక... బడ్జెట్‌కు ముందు సెన్సెక్స్ 49 వేల మార్కు దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,500 దాటింది. నిరుడు కూడా బడ్జెట్‌కు ముందు సరికొత్త శిఖరాలను తాకిన సూచీలు... ఆ తర్వాత మాత్రం పతనమయ్యాయి. ఈ దఫా మాత్రం కిందటి సంవత్సరం మాదిరిగా పతనం కాకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-01-19T19:55:20+05:30 IST