ఈసీకి హెచ్చరిక

ABN , First Publish Date - 2021-04-28T05:48:35+05:30 IST

భారత ఎన్నికల సంఘం మీద మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన విమర్శల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న విజయోత్సవ...

ఈసీకి హెచ్చరిక

భారత ఎన్నికల సంఘం మీద మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన విమర్శల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 2న విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక హైకోర్టు అక్షింతల ప్రభావం లేదని అనుకోలేం. కరోనా తీవ్రత నేపథ్యంలో, మిగతారాష్ట్రాల ఎన్నికలన్నీ ఎలాగూ ముగిసాయి కనుక, పశ్చిమబెంగాల్‌లో ప్రక్రియను ఇక సాగదీయకుండా మిగిలిన దశలన్నింటినీ ఒకేమారు పూర్తిచేయాలని మమతాబెనర్జీ విజ్ఞప్తిచేసినప్పుడు ఎన్నికల సంఘం నోరువిప్పలేదు. ఆ వ్యాఖ్యలు రాబోయే ఓటమి సంకేతాలన్నారు బీజేపీ నాయకులు. నరేంద్రమోదీ బెంగాల్‌ యాత్ర మానుకొని కరోనాస్థితిని సమీక్షించింది కూడా రోగ తీవ్రత తారస్థాయికి చేరిన తరువాతే. అప్పటివరకూ ఉధృతిని గుర్తించదల్చుకోని ఈసీ అదే ఏప్రిల్‌ 22నాడు బెంగాల్‌లో మిగతా ప్రచారం మీద కొన్ని నియంత్రణలు విధించింది. కలకత్తా హైకోర్టు ఈసీ మీద కస్సుమన్నది కూడా ఆనాడే. 


చిన్నస్థాయి ఎన్నికలు కూడా యుద్ధాలుగా మారిన కాలం కనుక, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఎన్నడూలేనంత ఎదుర్కొంటున్నది. భారత ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విదేశీ మీడియాను సైతం ఆశ్చర్యపరిచాయి. కరోనా మలివిడత విజృంభణకు ఎన్నికల సంఘమే ఏకైక కారణమని తప్పుబడుతూ, అధికారులమీద హత్యకేసులు పెట్టాలంటూ మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ధర్మాగ్రహాన్ని ప్రదర్శించింది. బెంగాల్‌లో చివరిదశ ప్రచారంమీద ఈసీ విధించిన కట్టడులైనా, ఇప్పుడు విజయోత్సవాలమీద నిషేధమైనా న్యాయస్థానాల హెచ్చరికల పుణ్యమే. మీరు వేరేగ్రహం మీద ఏమైనా ఉన్నారా? అని హైకోర్టు ప్రశ్నించినట్టుగానే ఎన్నికల సంఘం నిజానికి వ్యవహరించింది. పోలింగురోజున ఓటర్లు, అధికారులు భౌతికదూరాలు పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్పింది తప్ప, ప్రచారంలో రాజకీయపార్టీలు లక్షలాదిమందిని మోహరించకుండా ఆపలేకపోయింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏ నియంత్రణలూ లేకుండా జరిగిపోయినందున కూడా కరోనా కేసులు హెచ్చాయి. రాష్ట్రాల ఎన్నికలు, ఉప ఎన్నికలు ప్రకటించేనాటికే దేశంలో మలివిడత కరోనా కేసులు నమోదుకావడం మొదలైంది. పాశ్చాత్యదేశాల్లో దాని స్వైరవిహారం అప్పటికే ఉంది. అయినా, ఈ స్థాయి ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారని అనుకున్నా, ఈ తరువాతి దశలో పార్టీలను కట్టడిచేసి భారీర్యాలీలు, సభలను నియంత్రించడానికి ప్రయత్నించివుంటే బాగుండేది. బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌ నిర్ణయం వెనుక, సైనిక బలగాల తరలింపు, శాంతిభద్రతల పరిరక్షణ కంటే, బీజేపీ కార్యకర్తల మోహరింపు లక్ష్యం ఉన్నదన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. మార్చి మొదట్లో ప్రచారం ప్రారంభమై, మిగతా రాష్ట్రాల్లో ఆ నెల 27న తొలివిడత పోలింగ్‌ జరిగితే, బెంగాల్‌లో మాత్రం చివరి విడత ఇంకా రేపటికి మిగిలేవుంది. ఎన్నికల ప్రచారంలో జనంమాట అటుంచి నాయకులే భౌతికదూరాలు, మాస్కులు ఇత్యాది నిబంధనలు ఉల్లంఘించారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదావేయగలిగే విశేషాధికారాలు ఎన్నికల సంఘానికి ఉన్నాయి కానీ, కనీసం మొత్తం ప్రక్రియలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేట్టు చూడగలిగినా ఈ అప్రదిష్ఠ తప్పేది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతటి క్లిష్ట సమయంలో జరిగాయో, అందుకు ఆ దేశం ఎంతో ముందుచూపుతో ఎటువంటి ఏర్పాట్లు చేసుకుందో తెలిసిందే. మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలు ఈసీకంటే బీజేపీ నాయకులనే ఎక్కువ ఆగ్రహపరిచాయి. బెంగాల్‌ బీజేపీ ప్రతినిధి న్యాయమూర్తులు ఎవరికో అమ్ముడుపోయారన్నట్టుగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు గౌరవప్రదమైన భాషలో మాట్లాడాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హితవు చెప్పారు. ఎన్నికల సంఘం విజయోత్సవ ర్యాలీలు నిషేధించడాన్ని మాత్రం ఆ పార్టీ నాయకులంతా స్వాగతిస్తున్నారు.

Updated Date - 2021-04-28T05:48:35+05:30 IST