పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శ్రీకాళహస్తి, జనవరి 16: ఆది దంపతుల కల్యాణానికి రావాలంటూ దేవతలు, మునులకు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది దంపతుల కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కనుమ పండుగ రోజు శివపార్వతులు కైలాసగిరి ప్రదక్షిణ చేసి దేవతలను, రుషులను ఆహ్వానిస్తారు. దీంతో ఆదివారం కొవిడ్ నిబంధనల నడుమ ఘనంగా స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయ అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం చప్పరాలపై అధిష్ఠించి పురవీఽఽధుల్లో ఊరేగింపుగా తీసుకు వెళ్లి గిరిప్రదక్షిణ చేయించారు. అనంతరం శుకబ్రహ్మాశ్రమం వద్ద ఉన్న ఎదురుసేవ మండపానికి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, బియ్యపు పవిత్రారెడ్డి, ఆకర్ష్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.