అధికార పార్టీ సేవలో వార్డు వలంటీర్లు

ABN , First Publish Date - 2021-03-08T06:49:46+05:30 IST

‘‘అమ్మా జగన్‌ అన్న పింఛన్‌ ఇచ్చారు. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. మరెన్నో చేయబోతున్నారు. ప్రతి పథకం మీకు అందేలా చూసే బాధ్యత మాది.

అధికార పార్టీ సేవలో వార్డు వలంటీర్లు
నగరంలోని 26వ వార్డులో వైసీపీ అభ్యర్థినికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లు రుక్సానా, గౌస్య (బాణం గుర్తుతో వున్న వాళ్లు)

వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం

కొన్నిచోట్ల ప్రత్యక్షంగా... మరికొన్నిచోట్ల పరోక్షంగా..

పలు వార్డుల్లో అభ్యర్థుల వెన్నంటి ఉంటున్న వలంటీర్లు

పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల గుర్తింపు, దిద్దుబాటు చర్యలకు సలహాలు, సూచనలు

రాత్రి వేళల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్న వైనం

పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని హెచ్చరిక ధోరణితో వినతి

ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో అభ్యర్థుల తరపున డబ్బులు అందజేత


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

‘‘అమ్మా జగనన్న పింఛన్‌ ఇచ్చారు. ఇంటి పట్టా కూడా ఇచ్చారు. మరెన్నో చేయబోతున్నారు. ప్రతి పథకం మీకు అందేలా చూసే బాధ్యత మాది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో  వైసీపీకే ఓటేయండి. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తారు. వేరే పార్టీలకు ఓటేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే మీకూ, మాకూ మంచిది’’... ఇదీ వైసీపీ అభ్యర్థుల తరపున అధికారికంగా, అనధికారికంగా ప్రచారాన్ని సాగిస్తున్న కొంతమంది వార్డు వలంటీర్లు ఓటర్లకు చెబుతున్న మాటలు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను, హైకోర్టు ఉత్తర్వులను వార్డు వలంటీర్లు పట్టించుకోవడం లేదు. ఎవరెన్ని చెప్పినా.. తమను వలంటీర్లుగా నియమించిన అధికార పార్టీకి రుణం తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. తమ పరిధిలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కొందరు గుట్టుగా ప్రచారంలో పాల్గొంటుంటే, మరికొందరు బహిరంగంగానే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు కీలక వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించాలి, ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలి వంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేస్తున్నట్టు తెలిసింది.  


ఒంటరిగా ప్రచారం.. పంపిణీ.. 

నగర పరిధిలోని కొన్ని వార్డుల్లో వలంటీర్లు  అభ్యర్థుల వెంట తిరగకుండా.. రాత్రి వేళల్లో తన పరిఽధిలోని ఇళ్లకు వెళ్లి, వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగుతాయని చెబుతున్నారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తారన్న అనుమానం వుంటే... అటువంటి వారిని సుతిమెత్తగానే హెచ్చరిస్తున్నారు. కొన్ని వార్డుల్లో అధికార పార్టీ తరపున ఓటర్లకు స్లిప్పుల పంపిణీ బాధ్యతను వలంటీర్లే చూసుకుంటున్నారు. కాగా వలంటీర్ల పనితీరుపై అవగాహన ఉన్న కొందరు అభ్యర్థులు... డబ్బుల పంపిణీ బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఇంటింటికీ వెళ్లి అభ్యర్థి తరపున ఓటర్లకు డబ్బులు అందిస్తున్నారు.


వలంటీర్‌ పోస్టు వదులుకోవడానికైనా సిద్ధం

‘మీరు వలంటీర్లు. రాజకీయ పార్టీల తరపున ప్రచారం చేయడానికి వీల్లేదు కదా? అని ఎవరైనా అడిగితే.. ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా? కావాలంటే ఇప్పుడు రాజీనామా చేస్తాం. వైసీపీ గెలిచిన తరువాత మళ్లీ పోస్ట్‌ వేయించుకుంటామని   పలువురు వలంటీర్లు బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు.   వైసీపీ ప్రభుత్వం తమకు వలంటీరుగా అవకాశం కల్పించిందని, ప్రభుత్వం తమదైనప్పుడు ఎవరు తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు తీసేసినా.. కోడ్‌ ముగిసిన వెంటనే మళ్లీ పోస్టింగ్‌ వేయించుకు ంటామని ధీమాగా చెబుతున్నారు.

Updated Date - 2021-03-08T06:49:46+05:30 IST