Abn logo
Mar 4 2021 @ 03:00AM

వలంటీర్ల విధులను.. అడ్డుకోలేం

అధికార దుర్వినియోగంపై నిర్దిష్ట ఆధారాల్లేవు

వారి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పలేం

ఓటర్లను బెదిరిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు

బెదిరించాలనుకుంటే మొబైల్సే ఉండక్కర్లేదు

ప్రభావితం చేస్తే ఫిర్యాదు చేయాలని విస్తృత ప్రచారం కల్పించండి

అవసరమైన చోట పోలీసు రక్షణ

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచన

ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలుపై స్టే


అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచుతూ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గత నెల ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. వలంటీర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు నిర్దిష్ట ఆధారాల్లేవని తెలిపింది. ఈ నేపథ్యంలో వారి విధులను నిలువరిస్తూ.. ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పలేమని పేర్కొంది. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వలంటీర్లను విధులు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అభిప్రాయపడుతోందని తెలిపింది. వారిని దూరంగా ఉంచాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై స్టే ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజుల బుధవారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికలకు వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌ జైన్‌ వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం వాదనలు ముగియడంతో బుధవారం న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించారు.


‘ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లకు అప్పగించవద్దని ఎస్‌ఈసీ పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 19న ఇచ్చిన సర్క్యులర్‌లో ఓటరు స్లిప్పులను బ్లాక్‌ స్థాయి అధికారి/ఆథరైజ్డ్‌ అధికారి ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో ఉన్న వివిధ పథకాల లబ్ధిదారుల డేటాను దుర్వినియోగం చేసే అవకాశముదని ఎస్‌ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్లు ఉన్నా, లేకపోయినా డేటా లభ్యమవుతుంది. వలంటీర్లు డేటాను దుర్వినియోగం చేయాలనుకుంటే ఫోన్లు ఉన్నా, లేకపోయినా చేయొచ్చు. డేటాను ఉపయోగించుకుని ఫలానా వ్యక్తికి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని వలంటీర్లు బెదిరిస్తారని ఎస్‌ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్లు లేకపోయినా వలంటీర్లు ఆ పని చేయొచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీతో పాటు కరోనా టీకా వ్యవహారంలో వలంటీర్లు సమాచారం సేకరిస్తున్నట్లు కనిపిస్తోంది. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మాత్రమే నగదును నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మిగతా పథకాలకు సంబంధించిన సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. వలంటీర్లు రోజువారీ విధులు నిర్వహించేందుకు ఎస్‌ఈసీయే వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారుల వివరాలు వారికి తెలిసినప్పుడు రోజువారీ విధుల నిర్వహణకు అనుమతిస్తే.. డేటా దుర్వినియోగాన్ని ఎలా నిలువరిస్తారో స్పష్టం కావడం లేదు.


ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడం ఎస్‌ఈసీతో పాటు విధుల్లో ఉన్న అందరి కర్తవ్యం. సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తే ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవచ్చు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటల సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయవచ్చు. కాల్‌ సెంటర్లు, హెల్ప్‌ డెస్కులు, మొబైల్‌ కియో్‌స్కలతో ఫిర్యాదులు స్వీకరించవచ్చని సూచిస్తున్నాం. ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేయడం, బెదిరింపులకు గురిచేస్తే ఫలానా చ ట్టం మేరకు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఈసీ విస్తృత ప్రచారం కల్పించవచ్చు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమై చోట పోలీసుల రక్షణ కల్పించవచ్చు. ఈ నేపథ్యంలో వలంటీర్ల కార్యకలాపాలను నిలువరించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నాం.


వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసినా, బెదిరింపులకు పాల్పడినా చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అందుచేత ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు ముగిసే వరకు వారిని విధులకు దూరంగా ఉంచాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement