గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి బదిలీ

ABN , First Publish Date - 2021-06-14T04:57:56+05:30 IST

గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి బదిలీ

గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి బదిలీ

యాదాద్రి- భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌

కొత్త కమిషనర్‌ ఎవరనేది ప్రకటించని ప్రభుత్వం

వరంగల్‌ నగరాభివృద్ధిపై సత్పతి చెరగని ముద్ర

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని నైజం

ముక్కుసూటి తత్వంతో విధులు

పారిశుధ్యం, ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యత 


వరంగల్‌ సిటీ, జూన్‌ 13 : వరంగల్‌ మహానగర పాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. యాదాద్రి - భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందారు. యాదాద్రి - భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న అనితా రాంచంద్రన్‌ స్థానంలో పమేలా సత్పతికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పమేలా స్థానంలో కొత్త కమిషనర్‌ ఎవరనేది ప్రభుత్వం వెల్లడించలేదు. రాష్ట్రంలో మిగతా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు ఎక్కడా జరగకపోవడం గమనార్హం. 


2019లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా...

2019 డిసెంబర్‌ 24న జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా పమేలా సత్పతి బాధ్యతలు స్వీకరించారు. రవికిరణ్‌ స్థానంలో ఆమె వరంగల్‌కు వచ్చారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయి న పమేలా సత్పతి.. వరంగల్‌ నగరంపై తనదైన మార్కు వేశారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన క్రమంలో ‘టీమ్‌ వర్క్‌ - బెటర్‌ రిజల్ట్స్‌’ అనేది తన వర్క్‌ ఫార్ములా అని పమేలా సత్పతి ప్రకటించారు. 18 నెలల తన పాలనలో వరంగల్‌ నగరాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. మెరుగైన ఫలితాలు చూపెట్టారు. ‘కుడా’ వైస్‌ చైర్మన్‌గా పమేలా సత్పతి సమర్థవంతమైన సేవలు అందించారు. తన పనితీరుతో నగర వాసుల ప్రశంసలే కాదు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ల నుంచి పలుమార్లు ప్రశంసలను అందుకున్నారు. 


పారిశుధ్యం, ప్రజావాణికి ప్రాధాన్యత

నగరంలో మెరుగైన పారిశుధ్య, సేవలు, ప్రజావాణికి అత్యంత ప్రాధానత్య ఇస్తానని కమిషనర్‌ పమేలా సత్పతి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రకటించారు. ఈ మేరకు ప్రజావాణిలో సమస్యలపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై సత్వర పరిష్కార చర్యలు అందేలా చొరవ చూపారు. నిర్లక్ష్యం చూపిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఇక పారిశుధ్య సేవల విషయంలో ప్రతీరోజు క్రమం తప్పకుండా కమిషనర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీలు, పరిశీలనలు జరిపారు.  అధికారులు, సిబ్బంది పాలనాపరమైన తప్పుల్లో రాజకీయ జోక్యానికి కూడా పమేలా సత్పతి తలొగ్గలేదు.  జీడబ్ల్యూఎంసీ పరిధిలోని డివిజన్ల డీలిమిటేషన్‌ లీకేజీ విషయంలో డిప్యూటీ కమిషనర్‌ గోధుమల రాజును ఏకంగా సస్పెండ్‌ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ససేమిరా అన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ కరాఖండిగా వ్యవహరించారు. గత సంవత్సరం ఆగస్టులో నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నాలాల ఆక్రమణలపై విమర్శలు పెల్లుబికాయి. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నాలా ఆక్రమించి జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లను లెక్క చేయలేదు. ఈ క్రమంలో ఆమె ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా తన పని తాను చేసుకుపోయారు. 


హిజ్రాలకు చేయూత

సమాజంలో హిజ్రాలకు కూడా గౌరవప్రదమైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో పమేలా సత్పతి కృషి చేశారు. నగరంలో పబ్లిక్‌ టాయిలెట్లు, లూ కేఫ్‌ల నిర్వహణతో పాటు వరంగల్‌  కొత్త బస్‌ స్టేషన్‌ రోడ్డు హిజ్రాల చేత మెడికల్‌ షాపు పెట్టించి వారి అభివృద్ధికి బాసటగా నిలిచారు. 


సైకిల్‌ ట్రాక్‌లు 

స్మార్ట్‌సిటీ రహదారుల నిర్మాణంతో పాటు సైకిల్‌ ట్రాక్‌లు నిర్మించి పమేలా సత్పతి ప్రశంసలు పొందారు. నగర పర్యటనలో సైకిల్‌ ట్రాక్‌ను చూసిన మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రశంసించారు. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ ఫ్రీ సిటీ ప్రాజెక్టులో దేశంలోని రెండు నగరాలే ఎంపికయ్యాయి. ఒకటి సూరత్‌ కాగా మరొకటి వరంగల్‌ నగరం. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఇటీవల పమేలా సత్పతిని అభినందించారు.


కరోనా వారియర్‌గా..

కరోనా ఫస్ట్‌ వేవ్‌లో కమిషనర్‌ పమేలా సత్పతి తీసుకున్న నియంత్రణ చర్యలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, తరలింపు వంటి క్లిష్ట పరిస్థితుల్లో  కమిషనర్‌ సత్పతి పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది. వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించడంలో కమిషనర్‌ పమేలా సత్పతి చొరవ అభినందనీయం. కాజీపేట రై ల్వే జంక్షన్‌లో ఆమె ఉదయం నుంచి సాయంత్రం వ రకు తరలింపు చర్యలను స్వయంగా పరిశీలించారు.


అవసరమైతే నేనే ఊడుస్తా..

నగర పరిశుభ్రత విషయంలో రాజీపడబోనని కమిషనర్‌ పమేలా సత్పతి ప్రకటించారు. అవసరమైతే ’నేనే చీపురు పట్టి ఊడుస్తా’ అని తొలినాళ్లలో వెల్లడించారు. ఈ మేరకు కొన్ని సంస్థలు చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాల్లో స్వీపింగ్‌ చేసి చూపెట్టారు. నగరాభివృద్ధి విషయంలో కమిషనర్‌ పమేలా సత్పతి ఆలోచనలు వినూత్నం. రాష్ట్రంలోనే ఎక్కడా లేని రీతిలో బాలసముద్రంలో ’పెట్‌ పార్కు’ నిర్మాణం చేయించారు. అదే విధంగా హన్మకొండ పద్మాక్షి ఆలయం వద్ద  ’సరిగమ పదనిస’ పార్కును నిర్మించారు. పార్కుల అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. కాజీపేట ఫాతిమానగర్‌, వరంగల్‌ ఆటోనగర్‌ ప్రాంతాల్లో ’గ్రీన్‌ లెగస్సీ’ పార్కులను నిర్మించారు. గోడలపై సామాజిక బాధ్యత చిత్రాలను వేయించి నగర వాసుల్లో ఆలోచన రేకెత్తించారు. 

Updated Date - 2021-06-14T04:57:56+05:30 IST