వరంగల్‌ సెంట్రల్‌ జైలు నేలమట్టం

ABN , First Publish Date - 2021-06-13T05:14:37+05:30 IST

వరంగల్‌ సెంట్రల్‌ జైలు నేలమట్టం

వరంగల్‌ సెంట్రల్‌ జైలు నేలమట్టం
సెంట్రల్‌ జైలు నుంచి సామగ్రిని తరలిస్తున్న వాహనాలు

పోలీసు భద్రత నడుమ కూల్చివేస్తున్న అధికారులు

12 జేసీబీలతో 24 గంటల్లోనే పనిపూర్తి

సిబ్బంది ఎవరినీ అనుమతించని వైనం

వైద్యశాఖకు జైలు స్థలం అప్పగింత

ఇప్పటికే ఇతర జైళ్లకు ఖైదీల తరలింపు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూన్‌ 12: వరంగల్‌ సెంట్రల్‌ జైలును కూల్చేశారు. జైలు ఎదుట పెద్దఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి శుక్ర, శనివారాల్లో ఉదయం, రాత్రి వేళల్లో కూల్చివేతలు చేపట్టారు. సుమారు 200మంది సివిల్‌ పోలీసులు డీఎస్పీ స్థాయి అధికారుల సమక్షంలో జైలు చుట్టూ పహారా కాశారు. కూల్చివేతల సమయంలో వైద్య అధికారులను తప్ప జైలు సిబ్బందిని, అధికారులను కూడా అనుమతించలేదు. 

65ఎకరాల్లో నిర్మించబడి ఉన్న జైలు గోడలను 12జేసీబీలతో 24గంటల్లో నేలమట్టం చేశారు. జైలు బ్యారక్‌లన్నింటినీ కూల్చివేశారు. కృష్ణ సర్కిల్‌, భద్ర సర్కిల్‌, తెలంగాణ బ్యారక్‌, మహిళా బ్యారక్స్‌, ఎన్‌ఎక్స్‌ఎల్‌ బ్యారక్స్‌, హెచ్‌ఎ్‌సబీ (హైసెక్యూరిటీ) బ్యారక్స్‌, సింగిల్‌సెల్‌, డబుల్‌సెల్స్‌ను కూల్చివేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ సహకారంతో జైలు ఆవరణలో ఇప్పటికే 90శాతం కట్టడాలను కూల్చివేశారు. లోపల జరిగే పనులు బాహ్యప్రపంచానికి తెలియకుండా చుట్టూ ఉన్న గోడను మాత్రమే మిగిల్చారు. మరో రెండురోజుల్లో సెంట్రల్‌ జైలు ప్రాంతం పూర్తిగా నిర్మాణుష్యంగా కనిపించనుంది. వరంగల్‌ జిల్లాకే వన్నెతెచ్చిన సెంట్రల్‌ జైలు ఇక్కడ లేదని తెలిసిన చాలా మంది జీర్ణించుకోవడం లేదు. జైలును వరంగల్‌ నుంచి తరలించొద్దని కొందరు జైళ్లశాఖ ఉన్నతాధికారులు హై కోర్టులను ఆశ్రయించినా అవేమీ పట్టించుకోకుండా ఆగమేఘాలపై అధికారులు సెంట్రల్‌ జైలును నేలమట్టం చేసేపనిలో పడ్డారు. రాత్రికి రాత్రే యుద్ధప్రాతిపదికన 135 యేళ్ల చరిత్ర కలిగిన జైలు గోడలను బద్దలుకొట్టారు. 


స్థలం అప్పగింత

వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 20వ తేదీన సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డును సందర్శించారు. ఆ సమయంలో వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని వైద్యశాఖకు అప్పగించాలని ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఆటంకాలు వస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌ ద్వారా తెలుసుకుని రాష్ట్ర జైళ్లశాఖ.. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలాన్ని వైద్యశాఖకు అప్పగించాలని శుక్రవారం ఆదేశాల విడుదలయ్యాయి. ఈ మేరకు సంబంధిత జీవో కాపీని జైలు సిబ్బంది వైద్యశాఖ అధికారులకు అందించారు. 


ఖైదీలు, సిబ్బంది తరలింపు 

ఇప్పటికే వరంగల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఇతర జిల్లాల జైళ్లకు తరలించారు. ఇక్కడ ఉన్న 986 మంది ఖైదీలను రాష్ట్రంలోని పలు జిల్లాల జైళ్లతో పాటు సబ్‌జైళ్లలో ఉంచారు. ఇంకా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో పనిచేస్తున్న సిబ్బందితో పాటు మినిస్టీరియల్‌, వైద్యసిబ్బందికి రెండురోజుల కిందట బదిలీల కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారికి ఇష్టం ఉన్న ప్రాంతాల జైళ్లకు బదిలీ చేసేందుకు రాష్ట్ర అధికారులు అవకాశం కల్పించారు. దీంతో కోరుకున్న ప్రదేశాలకు బదిలీల ప్రక్రియ నిర్వహించగా, ఇంకా ఎవరికీ ఆర్డర్‌ ఇవ్వలేదని సిబ్బంది తెలిపారు. ఇంకా జైలులో మిగిలి ఉన్న పనులను చేసేందుకు, కొంత సామగ్రిని వాహనాల్లో ఎక్కించేందుకు 40మంది ఖైలు జైలులోనే ఉన్నట్టు తెలిసింది.



Updated Date - 2021-06-13T05:14:37+05:30 IST