Abn logo
Mar 5 2021 @ 17:10PM

వరంగల్‌ శ్రీనుకే ‘వీరమల్లు‌’?

సినిమా ట్రేడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ 'హరిహర వీరమల్లు'. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ కూడా వీరమల్లు బిజినెస్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఏ రేటు పలుకుతుంది? ఎంత రేటు కోట్‌ చేస్తున్నారు? ఈ ప్రశ్నలే ట్రేడ్‌ మొత్తం రౌండ్స్ కొడుతున్నాయి. సమాధానాలు మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎందుకంటే వీరమల్లు సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఏవీ రిలీజ్‌ కాలేదు. అంటే గెటప్ పోస్టర్ గానీ, పబ్లిసిటీ మెటీరియల్‌గానీ ఏవీ ఎవరి కంటా పడలేదు. షూటింగ్ మాత్రం హోరాహోరీగా సాగిపోతోంది. ఒరిజినల్‌ సైజులో చార్మినార్‌ వందల ఎకరాలలో నిర్మించి, అందులో కాస్ట్లీ ఫైట్లు, సీన్లతో పాటు పీరియడ్‌ ఫిల్మ్ కావడం వల్ల దానికి సంబంధించిన గ్రాండియర్‌.. అదీ నిర్మాత ఏఎం రత్నం, పవన్‌ కళ్యాణ్‌, దర్శకుడు క్రిష్‌ల కాంబినేషన్‌కి తగినట్టుగా.. ఇంత వరకూ పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో రానివిధంగా హయ్యస్ట్ బడ్జెట్టుతో షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంతో ముందుకెళ్తున్నాయి. అయినా ఏ అంశం కూడా అధికారికంగా మీడియా ద్వారా పబ్లిక్‌ అవలేదు. ఒక్క చిత్రజ్యోతి మాత్రమే 'హరిహర వీరమల్లు' టైటిల్‌ని కన్ఫర్మ్ చేసింది. ఇది తప్ప మీడియాకి ఏ ఉప్పూ అందలేదు ఇప్పటివరకూ. ఆ కారణంగా సినిమాకి సంబంధించిన ఎస్టిమేషన్‌గానీ, జడ్జిమెంట్‌గానీ ట్రేడ్‌కి ఏ మాత్రం అందలేదు. 

కానీ ఎవరికి వారు వీరమల్లు సినిమాని దక్కించుకోవాలని నిర్మాత ఏఎం రత్నం ఆఫీసుతో లాబీయింగ్‌ నడుపుతున్నారు. ఎవరికి వారు విశ్లేషించుకుంటే.. నిర్మాత ఏఎం రత్నం గత చిత్రాల మేకింగ్‌ రేంజ్‌, పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్‌… పీరియడ్‌ ఫిల్మ్ కావడం వల్ల జరిగే ఖర్చు ఇవన్నీ లెక్కల్లోకి వస్తున్న నేపథ్యంలో ఎంతైనాసరే ఈ మెగా కాంబినేషన్‌ సినిమాని ఎగరేసుకుపోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రత్నం ముందుపడి ఇంతకివ్వండి అని అడిగే ప్రయత్నం చేయడానికి మాత్రం కొంత వెనకాముందు అవుతున్న మాటైతే వాస్తవం. నైజాం వరకూ మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమా నైజాం రైట్స్ సాధించిన వరంగల్‌ శ్రీనుకే 'హరిహర వీరమల్లు' చిత్ర నైజాం రైట్స్ కూడా అందబోతున్నాయన్నది తాజాగా అందుతున్న సమాచారం. అయితే వరంగల్‌ శీనుకూడా ఎంత కోట్ చేయాలి అని మీమాంసలో పడ్డట్టు వరంగల్ శ్రీను సన్నిహితవర్గాలు చెబుతున్నమాట. ఏది ఏమైనా సరే ఇంత భారీ ఎత్తున దూసుకొస్తున్న సినిమాని తానే సొంతం చేసుకోవాలని వరంగల్‌ శ్రీను పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. 

సుమారుగా ఆచార్యకి, త్రిబుల్ ఆర్‌కి మధ్యలో వీరమల్లు నైజాం రేటుని రత్నం నిర్ణయించవచ్చు అన్నది చిత్రజ్యోతికి మాత్రమే అందిన సమాచారం. ఆచార్య చిత్ర రైట్స్ వరంగల్‌ శ్రీనే రూ.42 కోట్లకి దక్కించుకుంటే, త్రిబుల్‌ ఆర్‌ రైట్స్ దిల్‌రాజు రూ. 75 కోట్లకి తీసుకున్నారు. కాబట్టి మధ్యస్థంగా వీరమల్లు రేటును వరంగల్‌ శ్రీను ఊహించచలరు, దాని ప్రకారమే వరంగల్‌ శ్రీను కూడా ఆడ్వాన్స్‌కి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. అలా చూసుకున్నా పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ఇతర రెండు సినిమాల కన్నా, ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల కన్నా కూడా వీరమల్లు రేటు నూటికి నూరుపాళ్ళు ఎక్కువగానే ఉంటుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నమాట. అధికారికంగా రెండుమూడు రోజులలో అన్ని విషయాలు తెలిసిపోతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు. వినిపిస్తున్న మాటే నిజమైతే ఒకే సీజన్‌లో దగ్గరదగ్గరగా మెగాబ్రదర్స్ భారీ క్రేజీ చిత్రాలను సొంతం చేసుకున్న అరుదైన రికార్డు వరంగల్‌ శ్రీను సాధిస్తారు. 

Advertisement
Advertisement
Advertisement