పడకలపైనే మృతదేహాలు

ABN , First Publish Date - 2020-08-10T08:29:10+05:30 IST

పేదల ఆస్పత్రిగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే వరంగల్‌ ఎంజీఎంలో అవసరమైన చికిత్స అందకపోవడమే కాదు, ఆరోగ్యం విషమించి

పడకలపైనే మృతదేహాలు

  • వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దుస్థితి
  • పత్తా లేని బంధువులు.. పట్టించుకోని సిబ్బంది
  • పక్క బెడ్‌లపై ఉన్న రోగుల శవ జాగారం
  • ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యాల కొరత
  • మంత్రి ఆదేశాలిచ్చినా మారని పరిస్థితి
  • రక్షణ ఏర్పాట్లే లేవు: ల్యాబ్‌ టెక్నీషియన్ల వేదన


రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది! అయితే ఇన్నాళ్లూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదు కాగా.. ఇప్పుడు అక్కడ తగ్గి జిల్లాల్లో పెరుగుతున్నాయి!! హైదరాబాద్‌లో పేషెంట్లకు గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కానీ, జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. కరోనావార్డులో చికిత్స పొందుతున్నవారు రాత్రి పూట చనిపోతే.. పక్క బెడ్‌లపై ఉండేవారికి శవజాగారమే! మృతదేహాలు అలాగే గంటలకొద్దీ పడకలపైనే ఉంటున్న పరిస్థితి! వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యాల కొరత, సరిపడా సిబ్బంది లేకపోవడం, వార్డులను ముంచెత్తుతున్న వర్షపునీరు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో సమస్యలు!!


వరంగల్‌ అర్బన్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదల ఆస్పత్రిగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే వరంగల్‌ ఎంజీఎంలో అవసరమైన చికిత్స అందకపోవడమే కాదు, ఆరోగ్యం విషమించి మృత్యువుపాలయినా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది. చనిపోయినవారిని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు ముందుకు రాక.. మార్చురీలో చోటు లేకపోవడం, ప్రిజర్వేషన్‌కు సంబంధించిన సమస్యలతో మృతదేహాలను గంటలకొద్దీ వార్డుల్లో పడకలపైనే ఉంచేస్తున్నారు. దీంతో, పక్క బెడ్‌లపై ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వార్డులో చికిత్సపొందుతున్న వారెవరైనా రాత్రి పూట చనిపోతే ఇక శవజాగారమేనని మిగతావారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 28న ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ చేరుకుని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితిపై సుదీర్ఘ సమీక్షాసమావేశం నిర్వహించారు. అవసరమైన పరికరాలు కొనాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జ్జ్‌ కలెక్టర్‌గా ఉన్న వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌  హరిత ఆ ఆదేశాల మేరకు ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డును సందర్శించి, సమస్యలు తెలుసుకున్నారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని రోగులు వాపోతున్నారు.


సౌకర్యాల లేమితో నరకయాతన..

ఎంజీఎం ఆస్పత్రిలో.. శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే రోగులను ఉంచే వార్డు  కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ వార్డులో ఇప్పటికే సామర్థ్యానికి మించి కరోనా బాధితులు ఉన్నారు. అదనపు పడకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుంద ంటున్నారు. వెంటిలేటర్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అమర్చే వారే లేకుండా పోయారంటున్నారు. ఆక్సిజన్‌ సదుపాయం కూడా అందరికీ అందుబాటులో లేని దుస్థితి. ఆస్పత్రికి కొత్తగా వచ్చిన వెంటిలేటర్‌ను అమర్చడం అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యుడికి తెలియకపోవడం వల్లనే తన తండ్రి గత నెల 25న ప్రాణాలు కోల్పోయారంటూ వరంగల్‌కు చెందిన ఒక యువకుడు ట్విటర్‌లో వాపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇదే విషయాన్ని ఆ యువకుడు ఆదివారంనాడు మంత్రి కేటీఆర్‌ దృష్టికి ట్విటర్‌ ద్వారా తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్‌ అతనికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి.. దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎంజీఎంలో కేస్‌ షీట్ల విషయంలో కూడా గందరగోళం నెలకొందని.. కొందరు రోగులకు కేస్‌ షీట్లు లేకుండానే చికిత్స అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


పసిపిల్లల వార్డు పక్కనే..

కొవిడ్‌ వార్డులను ఇతర వార్డులకు దూరంగా ఏర్పాటు చేయాలి. కానీ, ఎంజీఎంలో కొవిడ్‌ ప్రత్యేకవార్డును.. నవజాత శిశువుల వార్డు పక్కనే ఏర్పాటు చేశారు. మాతా శిశుసంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఇందుకు ఉపయోగించారు. ఇప్పటికీ నవజాత శిశువుల చికిత్స అక్కడే కొనసాగుతోంది. పక్కనే కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేయడం వల్ల నవజాత శిశువులకు కరోనా సోకే ముప్పు అధికమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


సిబ్బంది కొరత

ఎంజీఎం ఆసుపత్రికి అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఎంజీఎం వైద్యులు చాలా మంది కరోనా బాధితులుగా మారారు. దీంతో వారంతా క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీనివల్ల.. రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన డాక్టర్లు అందుబాటులో లేకుండా పోయారు. విధుల్లో ఉండాల్సిన  సిబ్బందిసైతం హాజరు కావడం లేదన్న ఆరోపణలు న్నాయి. దీంతో జూనియర్‌ డాక్టర్లమీదే భారం పడుతోంది. రోగులకు వైద్యం పూర్తిస్థాయిలో అందట్లేదు.


వార్డుల్లోకి వర్షపు నీళ్లు

ఇటీవల కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీరు ఆస్పత్రి వార్డుల్లోకి చేరుకుంది. ఆ నీటి వల్ల అంటు రోగాలు వస్తాయేమో అన్న భయం రోగులను వెంటాడుతోంది. మరోవైపు.. తమకు కనీస రక్షణ పరికరాలు, సౌకర్యాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పని చేయాలని ఆస్పత్రిలోని ల్యాబ్‌టెక్నీషియన్లు వాపోతున్నారు. 12 గంటల చొప్పున డ్యూటీలు నిర్వహించినా.. తిరిగి విధులు నిర్వహించాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.


బతికుండగానే బయటపడేశారు

ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డు బయట వరండా! తలుపు పక్కనే ఒక వీల్‌చెయిర్‌!! దాని పక్కనే.. పుల్లల్లాంటి కాళ్లూ, చేతులతో ఒంటి మీద బట్టలు లేని దయనీయమైన స్థితిలో ఉన్నాడో వృద్ధుడు. ఆ పక్కనే వరండాని తుడుస్తున్నాడు మరో వ్యక్తి. వృద్ధుడు కనీసం మాట్లాడలేని స్థితిలో చేతులు పైకి లేపి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు. వరండా తుడిచి వార్డులోపలికి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు. అలా ఎంత సేపు అక్కడ పడి ఉన్నాడో ఆ వృద్ధుడు.. ఎంత బాధ అనుభవించాడో.. ఎప్పుడు కన్నుమూశాడో కూడా ఎవరికీ తెలియదు!! ఎంజీఎంలోని కొవిడ్‌ వార్డు వద్ద ఆ వృద్ధుడి దుస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.


కరోనా వార్డులో చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడికి విరేచనాలు అవుతుండడంతో ఆయన శరీరం మీద బట్టలు తీసేసినట్టుగా తెలిసింది. వరండాలో పడి ఉన్న ఆయన.. తనకు కనిపించిన వారికి ఏదో చెప్పాలన్న ప్రయత్నంలో చేతులూ ఊపుతున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. అంతటి దయనీయస్థితిలో కూడా ఆ వృద్ధుడు సిగ్గుతో తన మర్మావయవాలను ఒక చేతితో దాచుకునే ప్రయత్నం చేశారు. చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు!! మృతదేహాన్ని తరలించేందుకు సిబ్బంది సాహసించక పోవడంతో కొన్ని గంటల సేపు వరండాలో అలాగే పడి ఉంది!

Updated Date - 2020-08-10T08:29:10+05:30 IST