‘గ్రేటర్‌’ వార్‌ షురూ

ABN , First Publish Date - 2021-04-16T06:17:54+05:30 IST

‘గ్రేటర్‌’ వార్‌ షురూ

‘గ్రేటర్‌’ వార్‌ షురూ

కార్పొరేటర్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ 

నేటి నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ

ఎల్‌బీ, ఆర్ట్స్‌ కళాశాలల్లో సర్వం సిద్ధం

30న పోలింగ్‌.. మే 3న ఓట్ల లెక్కింపు

బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు.. 878 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు


హన్మకొండ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ మహానగర పాలక సంస్థ  (జీడబ్ల్యుఎంసీ) ఎన్నికల నగరా మోగింది. అనుకున్నట్టుగానే గురువారం డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  శుక్రవారం (16వ తేదీ) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అదే రోజు మునిసిపల్‌ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. నామినేషన్ల దాఖలుకు 18 చివరి తేదీ. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏవైనా నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. దానిపై జిల్లా ఎన్నికల అధికారికి, లేదా అదనపు జిల్లా ఎన్నికల అధికారికి, లేదా డిప్యూటీ ఎన్నికల అధికారికి, ఈనెల 20న సాయంత్రం 5 గంటల వరకు అప్పీలు చేసుకోవచ్చు. దాఖలైన అప్పీళ్లను 21న సాయంత్రం 5గంటలలోగా పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 సాయంత్రం 3 గంటల వరకు చివరి గడువు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అదే రోజు సాయంత్రం 3 గంటల తర్వాత ప్రచురిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. రీపోలింగ్‌ అవసరమైతే మే 2న నిర్వహిస్తారు. మే 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.


ఓటర్లు

నగరంలోని 66 కొత్త డివిజన్ల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల లెక్క తేల్చారు. నగరంలో మొత్తం 6,52,952 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,29,929 మంది, పురుషులు 3,22,847 మంది ఉన్నారు. ఇతరులు 176 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 4,31,091 మంది, ఎస్సీలు 94,612, ఎస్టీలు 15,780 మంది ఉన్నట్టు ఇంటింటా నిర్వహించిన ఓటర్ల గణనలో తేలింది. గతంలో కన్నా ఈసారి సుమారు లక్ష మంది ఓటర్లు పెరిగారు. 


స్వీకరణ కేంద్రాలు

వరంగల్‌ ఎల్బీ కళాశాల, హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నామినేషన్‌ స్వీకరణ కేందాలను ఏర్పాటు చేశారు. 1, 2 నుంచి 36వ వార్డు వరకు ఎల్బీ కాలేజీ డిగ్రీ బ్లాక్‌లో 37నుంచి 44 వార్డు వరకు పీజీ బ్లాక్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే 3 నుంచి 11 వరకు, 29 నుంచి 31 వరకు, 45 నుంచి 54 వార్డు వరకు నామినేషన్లను ఆర్ట్స్‌ కళాశాలలో, 55 నుంచి 66 డివిజన్‌ వరకు కామర్స్‌ క్లాస్‌రూమ్‌లో స్వీకరిస్తారు. ఎన్నికల నిర్వహణకు 878 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు.


రాజకీయ సందడి

వరంగల్‌ మహానగరంలో గత నెల 15న డివిజన్ల పునర్విభజన షెడ్యూల్‌ జారీతోనే ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈనెల 3న ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ జారీతో సందడి మరింత జోరందుకున్నది. పునర్విభజన ప్రక్రియ పూర్తయి డివిజన్ల సంఖ్య 58 నుంచి 66కు పెరిగిన తర్వాత పార్టీలు పోటీకి నడుం బిగించాయి. డివిజన్ల రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర సామాజిక వర్గాల గణనకూ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో షెడ్యూల్‌ జారీ చేయడంతో ఆశావహుల్లో అంచనాలు మొదలయ్యాయి. వివిధ సామాజిక వర్గాల జనాభా గణన కూడా పూర్తయింది. ఏ సామాజిక వర్గం వారు ఎంత మంది ఉన్నారో లెక్క తేలింది. వీటి ప్రాతిపదికగా డివిజన్ల రిజర్వేషన్లను గురువారం ప్రకటించారు. దీంతో పోటీకి రాజకీయ పార్టీలు నడుం బిస్తున్నాయి. వచ్చే 20 రోజులు నగరంలో సందడి నెలకొంది. 

Updated Date - 2021-04-16T06:17:54+05:30 IST