రైతుల జీవితాల్లో వెలుగు నింపడానికే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌

ABN , First Publish Date - 2022-05-25T05:10:59+05:30 IST

రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికే

రైతుల జీవితాల్లో వెలుగు నింపడానికే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌
పాల్మాకులలో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌

  • కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ 
  • పాల్మాకుల రచ్చబండ కార్యక్రమానికి భారీగా జనం


శంషాబాద్‌రూరల్‌, మే 24 : రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ చేశామని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. రైతు డిక్లరేషన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శంషాబాద్‌ పాల్మాకులలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అంజన్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రూ.2లక్షల రైతు రుణమాఫీపైనే అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రైతురాజ్యంగా మార్చడమే కాంగ్రెస్‌ ధ్యేయమని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన అంతం చేయడానికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని, దీనికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆదుకోని.. సీఎం కేసీఆర్‌ పక్క రాష్ట్ర రైతులకు రూ.3లక్షల పరిహారం ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సకు అధికారం ఇస్తే రాష్ట్రంలో పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు.  మిగులు బడ్టెట్‌ ఉన్న రాష్ట్రం.. టీఆర్‌ఎస్‌ పాలనలో నేడు అప్పుల ఊబిలో కూడుకుపోయిందని విమర్శించారు. 


పాలించే హక్కు కేసీఆర్‌కు లేదు : పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌రావు

తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్‌కు లేదని పీసీసీ అధికార ప్రతినిధిని అద్దంకి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తదని ప్రశ్నించావు కదా..? అధికారం మాకు వస్తే ఎలా చేస్తామో చేసి చూపిస్తామని ఆయన అన్నారు. సొంత రాష్ట్రం రైతులను పట్టించుకోని సీఎం కేసీఆర్‌..  పక్క రాష్ట్ర రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర  పడ్డాయని దుయ్యబట్టారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. అసైన్డ్‌ భూములను గుంజుకోవడానికి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని.. ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నారు. 1.5 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యాయని తెలుస్తోందని.. తాము అధికారంలోకి వస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌ లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు. తామిచ్చిన హామీలు నెరవేర్చకపోతే గల్లా పట్టుకొని అడుగొచ్చని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యఽక్షుడు జల్‌పల్లి నరేందర్‌, సుధీర్‌రెడ్డి, పార్టీ రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జి బొర్రా జ్ఞానేశ్వర్‌యాదవ్‌, సానెం శ్రీనివా్‌సగౌడ్‌, మైలారం సులోచన, ఏనుగు జంగారెడ్డి, జయపాల్‌రెడ్డి, మణికొండ మున్సిపల్‌ అధ్యక్షుడు, శంషాబాద్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు సంజయ్‌యాదవ్‌, నరేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-25T05:10:59+05:30 IST