వరంగల్ జిల్లా: వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్లకు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు పెరిగాయని ఇష్టమొచ్చినట్లు కేసులు బనాయించి వేధిస్తున్నారని హన్మకొండ జిల్లా, కమలాపూర్‌కు చెందిన కరట్లపల్లి దశరథం జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని దశరథం ఫిర్యాదులో పేర్కొన్నారు.
దశరథం ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న జాతీయ బీసీ కమిషన్ వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఐదు పనిదినాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బి ప్రకారం సివిల్ కోర్టు అధికారాలను వినియోగించుకుంటామని కమిషన్ హెచ్చరించింది.