అర్ధరాత్రి ఐదు గంటల పాటు పైశాచిక పర్వం.. వరంగల్ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజాలు..!

ABN , First Publish Date - 2020-05-26T19:07:23+05:30 IST

మనిషి కాదు మానవ మృగం. మూడేళ్ళ వయస్సున్న పిల్లవాడిని సైతం ఏమాత్రం కనికరం లేకుండా హతమార్చాడు. నిద్ర మాత్రలు అధిక మోతాదులో కలిపిన భోజనం ఆ చిన్నోడు తినక పోవడంతో నిద్రలోకి జారుకోలేదు.

అర్ధరాత్రి ఐదు గంటల పాటు పైశాచిక పర్వం.. వరంగల్ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజాలు..!

మనిషి కాదు.. మానవ మృగం

ఒక్క హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు మరో తొమ్మిది హత్యలు

గొర్రెకుంట బావి హత్య కేసులో వీడిన మిస్టరీ

నిందితుడు బిహార్‌వాసి  సంజయ్‌ కుమార్‌ అరెస్టు

భోజన పదార్థాల్లో మత్తు మందు కలిపి మృత్యు క్రీడ

గన్నీ బ్యాగులో పడుకోబెట్టి 9 మందిని బావివద్దకు చేరవేత

భోజనం తినకపోవడంతో మత్తులోకి జారుకోని మూడేళ్ల చిన్నారిపై అకృత్యం..

మూడు రోజుల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 


వరంగల్‌ అర్బన్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):   మనిషి కాదు మానవ మృగం. మూడేళ్ళ వయస్సున్న పిల్లవాడిని సైతం ఏమాత్రం కనికరం లేకుండా హతమార్చాడు.  నిద్ర మాత్రలు అధిక మోతాదులో కలిపిన భోజనం ఆ చిన్నోడు తినక పోవడంతో నిద్రలోకి జారుకోలేదు. ఎంత పిలిచినా తన తల్లి, అమ్మమ్మ, తాత, మామయ్యలు పలకకపోవడంతో అదే పనిగా ఏడుస్తున్న బాబును గొంతు పిసికి బావిలో పడేశాడు. అర్థరాత్రి గం.12.30 నుంచి ఉదయం 5 గంటలవరకు ఒక్కొక్కరిని లాక్కొచ్చి బావిలో పడేశాడు. మత్తు  భోజనం తిని అపస్మారక స్థితిలోకి చేరుకున్న వారిని, ఒక్కొక్కరిని ఒక గోనె సంచి మీద పడుకో బెట్టి బావి వరకు లాక్కొచ్చాడు. కొందరిని భుజాలపై మోసుకొచ్చి బావిలో పడేసినట్లు పోలీస్‌ విచారణలో అంగీకరించాడు. పని పూర్తి చేసుకున్న తరువాత ఏమీ తెలియనట్లు  జాన్‌పాకలోని తన ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.


నేరం కప్పి పుచ్చుకోవడానికే...

వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంట గోనె సంచుల రిపేర్‌ మిల్లులో జరిగిన 9 మంది హత్య కేసు మిస్టరీ వీ డింది. అనేక రకాల ప్రచారం అవుతున్న నేపథ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసులు సవాల్‌ గా తీసుకుని నిందితుడు  బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో నిందితుడు సంజయ్‌ కుమా ర్‌ యాదవ్‌ను ప్రవేశపెట్టారు.  గొర్రెకుంట సామూహిక హత్యల వివరాలను పోలీస్‌ కమిషనర్‌  వెల్లడించారు. 


బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌  పక్కా ప్రణాళిక ప్రకారం మత్తుమందు ఇచ్చి 9 మందిని కిరాతకంగా హత్య చేశాడు. హంతకుడు అంతకు ముందు చేసి న హత్యనుంచి తనను తాను కాపాడుకునేందుకు బర్త్‌డే పార్టీని ఉపయోగించుకున్నాడు. ఈ నెల 20వ తేది రాత్రి  7.30కు  మహ్మద్‌ మక్సూద్‌ పెద్ద కుమారుడు షా బాద్‌ పుట్టిన రోజు వేడుకల కోసం తయారు చేసిన భో జనం, పప్పు కూరలో మత్తు మందు కలిపి మొత్తం తొమ్మిది మందిని చంపేశాడు.  మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (47), మక్సూద్‌ భార్య మహ్మద్‌ నిషా ఆలం (47), మక్సూద్‌ కూతురు బుష్రా కాతూన్‌ (20), బుష్రా కాతూన్‌ కుమారుడు బబ్లూ (3), మక్సూద్‌ ఆలం పెద్ద కుమారుడు షాబాద్‌ (19), మక్సూద్‌ ఆలం చిన్న కుమారుడు సోహెల్‌ (18), బిహార్‌కు చెందిన శ్యాం కుమార్‌ షా (18),  బిహార్‌కు చెందిన శ్రీరాంకుమార్‌ షా (21), మహ్మద్‌ షకీల్‌ (38)లను మత్తులో ఉండగానే బావిలో పడేశాడు.


ఒకే ఒక్కడు.. పది హత్యలు

ఒక్క హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మరో తొమ్మిది మందిని మట్టు పెట్టాడు.  బిహార్‌ రాష్ట్రంలోని బిగుసరయి జిల్లా, నుర్లపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) ఆరు సంవత్సరాల క్రితం జీవనోపాధి  కోసం  వచ్చి మిల్స్‌కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనెసంచుల తయారీ కేంద్రంలో పనికి చేరాడు. ఈ క్రమంలో మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫికా (37)తో సాన్నిహిత్యం పెరిగింది. రఫీకాకు అప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో వారి పరిచయం క్రమంగా సహజీవనం చేసే స్థాయికి వెళ్ళింది.  


గీసుగొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో ఒక ఇంట్లో కాపురం పెట్టారు.   అయితే రఫికాను పెళ్ళి చేసుకోవడం మాట అటుంచి 14 ఏళ్ళ ఆమె కూతురుపై కన్నేశాడు. ఇది గమనించిన రఫికా సంజయ్‌తో పలుమార్లు గొడవపడింది. అయినా సంజయ్‌ తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో రఫికాను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. 


పోలీసులకు దొరకకుండా ఉండేందుకు..

పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్‌ ఆలం, భార్య నిషా ఆలంను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫికాను చంపినట్లుగానే నిద్రమాత్రలు కలిపి చంపాలని ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా గత 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మక్సూద్‌ కుటుంబం గొర్రెకుంటలో పని చేస్తున్న గోనెసంచుల తయారీ గోదాం వద్దకు రోజూ వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శవాలు వేసేందుకు పాత బావిని అనువైన ప్రాంతంగా నిర్ణయించుకున్నాడు.


పుట్టిన రోజే చావు రోజు.. 

ఈ నెల 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ ఆలం పుట్టినరోజు అని తెలియడంతో అదే రోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ నెల 18న నిందితుడు వరంగల్‌ చౌరస్తాలోని ఓ మెడికల్‌ షాపులో సుమారు 60కి పైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. అనుకున్న ప్రకారం 20వ తేదీన రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకొని అందరితో చాలాసేపు ముచ్చటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా టాబ్లెట్లను పౌడర్‌గా చేసి భోజనం, పప్పుల్లో కలిపాడు. వారు అపస్మారక స్థితికి చేరుకోగానే 9 మందిని బావిలో పడేశాడు.


కేసును చేధించడంలో శ్రమించిన ఈస్ట్‌ ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ శివరామయ్య, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌ క్రైం, ఐటీ కోర్‌, సీసీఎస్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్‌, రమేశ్‌కుమార్‌తోపాటు సిబ్బందిని వరంగల్‌ సీపీ అభినందించారు. 


పక్కా ప్లాన్‌తో..

పెళ్లి విషయమై బంధువులతో మాట్లాడేందుకు పశ్చిమబెంగాల్‌కు వెళదామని రఫికాను నమ్మించాడు. మార్చి 6వ తేదీన వరంగల్‌ నుంచి రాత్రి 10 గంటలకు గరీబ్‌రథ్‌ రైలులో విశాఖపట్నం వైపు వెళ్లారు. మధ్యలో మజ్జిగ ప్యాకెట్లను కొనుగోలు చేసి తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలు అందులో కలిపి రఫికాకు తాగించాడు.  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిడదవోలు సమీపంలో మత్తులో ఉన్న రఫికాను ఆమె చున్నితోనే ఉరేసి రైలునుంచి తోసివేశాడు. (దీనికి సంబంధించి తాడెపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు) అనంతరం రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో దిగి మరో మరో రైలులో వరంగల్‌కు చేరుకున్నాడు. రఫికా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లుగా రఫికా పిల్లలను నమ్మించాడు. కొద్దిరోజుల అనంతరం తన అక్క కూతురు బెంగాల్‌కు చేరుకోలేదని మక్సూద్‌ భార్య నిషా తెలుసుకున్నది. సంజయ్‌ను పలుమార్లు నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని అంతమొందించేందుకు సంజయ్‌ మళ్లీ ప్రణాళిక రూపొందించాడు.


ఆమెది హత్యే..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది హత్యలకు మూలం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం రైల్వేస్టేషన్‌ సమీపంలో కనిపించిన ఒక అనాథ మహిళ మృతదేహమని తేలింది. మార్చి 8న రైల్లో ప్రయాణిస్తూ ఆమె ప్రమాదవశాత్తూ చనిపోయిందని భావించారు. రైల్వే పోలీసులు అన్ని వైపులా దర్యాప్తు చేశారు. 72 గంటలపాటు వేచి చూసి ఎవరూ రాకపోవడంతో అనాథ మృతదేహంగా భావించి పోలీసులే ఖననం చేశారు. రైలులో ప్రయాణిస్తూ జారిపడి చనిపోయి ఉండొచ్చని భావించి పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. కరోనా కారణంగా ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడు చెప్పిన వివరాలను బట్టి బ్రాహ్మణగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద లభించిన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. ఆమె పేరు రఫికా (37) అని, ఆమెతో నిందితుడు సంజయ్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు విచారణలో తేల్చారు. పెళ్లి చేసుకునే నెపంతో రైలులో పశ్చిమ బెంగాల్‌ తీసుకెళ్తూ మార్గమధ్యలో ఆమెకు మత్తు మందు ఇచ్చి చున్నీతో ఉరేసి  రైలు నుంచి బయటకు తోసేశాడని, ఆమె గురించి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో మొత్తం కుటుంబ సభ్యులను హతమార్చాడని విచారణలో తేలింది. 


సీసీ కెమెరాల ఆధారంగా..

ఈ సంఘటనపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతోపాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో గోదాం, గొర్రెకుంట ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన బృందాలు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జాన్‌పాకలోని ఇంటిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణలో అసలు నిజాలు రాబట్టారు. 


ఎంజీఎం మార్చురీలోనే మృతదేహాలు..

గొర్రెకుంట పాడుబడిన బావిలో హత్యకు గురైన తొమ్మిది మంది మృతదేహాలకు సోమవారం సైతం అంత్యక్రియలు నిర్వహించలేదు. గురువారం నాలుగు, శుక్రవారం ఐదు మృతదేహాలను గుర్తించిన పోలీసు లు వాటిని పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలోని ఫ్రీజర్లలో భద్రపరిచారు. శవాలను పరిశీలించిన మంత్రులు వారి కుటుంబ సభ్యులు కోరితే ప్రభుత్వ ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలిస్తామని, లేదంటే ఇక్కడే  ఖననం చేస్తామని ప్రకటించారు.  సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం మృతదేహాలను అప్పగిస్తారని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది.

Updated Date - 2020-05-26T19:07:23+05:30 IST