Warangal Congress leaders మధ్య ఆధిపత్య పోరు..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరిక..!

ABN , First Publish Date - 2022-05-07T18:12:10+05:30 IST

ఓరుగల్లు. రాజకీయపార్టీలకు సెంటిమెంట్‌ను పండించే జిల్లా. ఇక్కడ సభలు సక్సెస్‌ అయితే చాలు అధికారం ఖాయమని రాజకీయపార్టీలు

Warangal Congress leaders మధ్య ఆధిపత్య పోరు..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరిక..!

అసమ్మతి విషయంలో కాంగ్రెస్‌ నేతలు తగ్గేదేలే అంటున్నారు.  ముఖ్యంగా ఈనెల 6వ తేదీన రాహూల్‌ సభ జరగనున్న వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్య పోరాటాలతో  కునారిల్లుతోంది. ఓ పక్క పెద్ద బహిరంగ సభకు జనసేకరణ చేయాల్సిన నేతలు ఆధిపత్యపోరుతో తగ్గేదేలే అంటుంటుంటే కార్యకర్తలకు దిక్కుతోచడం లేదు. అసలేం జరుగుతోంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం.. 


కాంగ్రెస్‌ నేతలమధ్య ఆధిపత్యపోరు

ఓరుగల్లు. రాజకీయపార్టీలకు సెంటిమెంట్‌ను పండించే జిల్లా. ఇక్కడ సభలు సక్సెస్‌ అయితే చాలు అధికారం ఖాయమని రాజకీయపార్టీలు నమ్ముతుంటాయి.  తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న కాంగ్రెస్‌ కూడా ఈ సెంటిమెంట్‌ అస్త్రాన్ని పండించాలని భావిస్తోంది. అయితే వరంగల్‌లో జిల్లా నేతల మధ్య కుమ్ములాటలు బాగానే ఉన్నాయి. ఒకరి మాట ఒకరికి పడదు. ఒకరు చెప్పింది మరొకరు చేయరు. అందరూ నాయకులే. ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రారు. వచ్చినా ఎక్కువసేపు ఐక్యంగా నిలవలేరు. అందుకే ఏకంగా టీపీసీసీ చీఫ్ ముందే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. దీంతో టీపీసీపీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందట. ఇప్పటిదాకా ఒక లెక్కఇప్పటినుంచి మరో లెక్క అంటూ ఆయన సీరియస్‌ అయిపోయారుట. నేతల మధ్య కుమ్ములాటలకు చెక్‌ పెట్టేందుకు రేవంత్ ప్లాన్‌ చేసుకున్నారని సమాచారం. 


ఓరగల్లు గడ్డపై ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం తథ్యం

ఓరగల్లు గడ్డపై ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం తథ్యమని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ఓరుగల్లు సెంటిమెంట్‌ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలేమీ దాచుకోవడం లేదు. పైకి గట్టిగానే చెపుతున్నారు. ఓరుగల్లు సభ సక్సెస్‌ అయితే 2023లో తెలంగాణను గుప్పెట పట్టడం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా ఈ సెంటిమెంట్‌ను గట్టిగానే నమ్ముతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా కాంగ్రెస్‌లోని నేతలమధ్య ఆధిపత్యపోరు ఆ పార్టీ కేడర్‌ను పరేషాన్‌ చేస్తోంది.  ఒకరు ఇన్‌చార్జ్‌గా ఉంటే మరొకనేత పెత్తనం చేస్తుండటంతో కేడర్‌ అయోమయానికి గురవుతోంది.  ఇప్పటికే జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈయన జనగామ ఇన్‌చార్జ్‌గా ఉన్న పొన్నాల లక్ష్మయ్యతో కొంతకాలం మాటల యుద్ధం నడిపారు.


తరువాత ఈయన చూపు హనుమకొండపై పడింది. అక్కడ నుంచి పోట చేయడానికి సిద్ధమవుతున్నారు.  దీనిపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  నాయిని రాజేందర్ రెడ్డి వర్గం భగ్గుంది. రాఘవరెడ్డి టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా మారారని  రాజేందర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. దీనిపై టీపీసీసీకి ఫిర్యాదు చేశారు.  దీంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జంగా రాఘవరెడ్డికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...జంగా తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తన ముందే ఘర్షణ పడడం ఆయనకు చిర్రెత్తిందట.   క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని ఘాటుగా హెచ్చరించారట.. ఎవరి జిల్లాల్లో వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహించు కోవాలని  పొరుగు జిల్లాల్లోకి వచ్చి కవ్విస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.


కొండా సురేఖ వర్సెస్ వెంకట్రామిరెడ్డి 

ఇక వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ సేమ్ సీన్ కొనసాగుతుంది.. ఇక్కడ కత్తి వెంకటస్వామి, దొంతి మాధవరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు... మాధవరెడ్డి కేడర్‌కు అందుబాటులో లేకపోవడంత, ఇదే అదునుగా కత్తి వెంకటస్వామి ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారుట. అయితే మాధవరెడ్డి మాత్రం వెంకటస్వామితో టచ్ లో ఉన్న వారికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారుట.  మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ లో నేతలంతా ఎవరికివారే   నియోజకవర్గ ఇన్‌చార్జ్ లమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.. మహబూబాబాద్, పరకాల నియోజకవర్గాల్లోనూ  నేతల మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు... పరకాలలోనూ కొండా సురేఖ వర్సెస్ వెంకట్రామిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.


ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా

రాహూల్‌ సభకు కార్యకర్తలను తరలించడంలో ఒకరిపై మరొకరు వంతు  పెట్టుకుంటున్నారు. దీంతో రాహూల్‌ సభకు లక్షలాది మందిని తరలించాలనే ప్లాన్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేయాలని, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా జనసేకరణ జరపాలని సూచించారుట.  తమకు తోచిందే చేసే కాంగ్రెస్‌ నేతలు రాహూల్‌ సభ ను ఎంతవరకు సక్సెస్‌ చేస్తారనేది కేడర్‌ మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more