మాటల యుద్ధం!

ABN , First Publish Date - 2022-07-02T05:45:19+05:30 IST

ఈనెల 3న హైదరాబాద్‌ లో నిర్వహించే కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్‌మీడియా వేదికగా మాటమాట పెరగడంతో జిల్లా అంతటా

మాటల యుద్ధం!
జైనథ్‌లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ నేత బిప్లవ్‌ కుమార్‌దేవ్‌

జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పొలిటికల్‌ వార్‌

సోషల్‌ మీడియా వేదికగా ఇరుపార్టీ నేతల వాగ్వాదం

జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న కమలం పార్టీ జాతీయస్థాయి నేతలు

మోదీ సభ విజయవంతం కోసం నాయకుల ప్రయత్నాలు

జిల్లావ్యాప్తంగా హాట్‌హాట్‌గా మారిన రాజకీయాలు

ఆదిలాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఈనెల 3న హైదరాబాద్‌ లో నిర్వహించే కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్‌మీడియా వేదికగా మాటమాట పెరగడంతో జిల్లా అంతటా ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఆరోపణలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో బీజేపీ జాతీయస్థాయి నేతల పర్యటన సందర్భంగా పోలీసు శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. జాతీయ నేత లు క్షేత్రస్థాయిలో పర్యటించి జనసమీకరణపై ప్రత్యేకదృష్టిని సారిస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌లు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. యువ మోర్చాతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ జిల్లాలో మరింతగా బలపడేందుకు పక్కా ప్లాన్‌తో ముం దుకు వెళ్తోంది. మోదీ ఇమేజ్‌తో యువతలో ఉత్సాహం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, నిధుల కేటాయింపును ప్రజల్లోకి తీసుకెళ్లేందు  కు ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ రాకపై జిల్లా కమలం పార్టీ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

25వేల మంది టార్గెట్‌

హైదరాబాద్‌లో నిర్వహించే మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి 25వేల మందిని తరలించేందుకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఎంపీ సోయం బాపురావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల శంకర్‌, మాజీ ఎంపీ రాథోడ్‌రమేష్‌, మహిళ నేత సుహాసినిరెడ్డి ఎవరికి వారే జన సమీకరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. శనివా రం రాత్రి 10.20 గంటలకు ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలను తరలించనున్నారు. ఇప్పటికే 25 రైలు బోగీల ను రిజర్వ్‌ చేసినట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచే మహారాష్ట్రలోని పాండ్రకవడ, ఇతర సరిహద్దు గ్రామాల బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా ప్రత్యేక బాధ్యతలను అప్పగించిన పార్టీ నేతలు జన సమీకరణలో నిమగ్నమయ్యారు. రైలు మార్గంతో పాటు పలు వాహనాల ద్వారా బహిరంగ సభకు తరలివెళ్లనున్నారు. 

పోటాపోటీగా పోస్టులు

ప్రధానమంత్రి మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. పోటీపోటీగా పోస్టులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రచారానికి దిగుతున్నారు. మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ బీజేపీ జిల్లా కేంద్రంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు సోషల్‌ మీడియాలోనూ ప్రచారం చేపడుతోంది. దీనికి దీటుగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘సాలు మోదీ.. సంపకు మోదీ బై బై..’ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తుండగా ‘సాలు దొరో.. నీ పాలన ఇక చాలు’ అంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత రెండు రోజులుగా జిల్లాలో జాతీయస్థాయి నేతల పర్యటనలు, వ్యాఖ్యలతో జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ నేతలు విమర్శనాస్ర్తాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపుతామంటూ టీఆర్‌ఎస్‌ నేతలు సవాల్‌ విసురుతుండగా.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  

Updated Date - 2022-07-02T05:45:19+05:30 IST