హూ లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌ అంటూ ట్విటర్‌లో Pawan వీడియో.. కౌంటర్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2021-09-29T08:12:48+05:30 IST

మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతూనే ఉంది. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని..

హూ లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌ అంటూ ట్విటర్‌లో Pawan వీడియో.. కౌంటర్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

  • పవన్‌ VS జగన్‌
  • రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న రచ్చ

  • ట్విటర్‌లో పవన్‌పై మండిపడ్డ మంత్రి పేర్ని నాని
  • గ్రామ సింహాలకు ‘వరాహ సమానుల’తో కౌంటర్‌
  • పవన్‌ కల్యాణ్‌ సినీ రంగానికి గుదిబండ: సజ్జల
  • సర్కారుపై కాపు, బలిజ సంఘాల ఆగ్రహం
  • వచ్చే ఎన్నికల్లో పర్యవసానం అనుభవిస్తారని హెచ్చరిక


ఈ ప్రభుత్వ ‘పాలసీ ఉగ్రవాదం’తో అన్ని రంగాలు, వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

పవన్‌


అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతూనే ఉంది. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నానితోపాటు పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. ‘‘తమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం పవన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా మంగళవారం  పేర్ని నాని... ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్విటర్‌ వేదికగానే కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ‘హూ లెట్‌ ది డాగ్స్‌ ఔట్‌’ (కుక్కలను వదిలిందెవరు) వీడియో లింక్‌ పోస్ట్‌ చేయగా... పవన్‌ను ట్రోల్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ను మంత్రి పేర్ని నాని పోస్ట్‌ చేశారు.


ఇక... వైసీపీకి మద్దతుగా సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి వరుసగా రెండో రోజూ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసారి ఆయన పవన్‌ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. తనకు పవన్‌ అభిమానులు ఫోన్‌ చేసి తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నారని చెబుతూ... పవన్‌పై ఆయన దూషణలకు దిగారు. వ్యక్తిగత విమర్శలూ చేశారు. ఇక... పవన్‌కు మద్దతుగా రాష్ట్రంలోని కాపు, బలిజ సంఘాల నేతలు ప్రకటనలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దీని పర్యవసానం అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు... పవన్‌ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ ఒక గుదిబండగా భావిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.


ఆ తిట్ల వెనుక జగన్‌: హరిరామ జోగయ్య

పవన్‌ కల్యాణ్‌ను కాపు మంత్రులు తిట్టడం వెనుక సీఎం జగన్‌ హస్తం ఉందని చెప్పక తప్పదని కాపు సంక్షేమసేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. పవన్‌ను అవమానించడమంటే కాపు సమాజాన్ని అవమానించడంగానే భావించవలసి వస్తుందన్నారు. ఇలాంటి నీచమైన చర్యల పర్యవసానం 2024లో సీఎం జగన్‌ చూస్తారని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో హెచ్చరించారు.


జగన్‌ మెప్పుకోసం తిడతారా?: కాపు సంక్షేమ సేన

జగన్‌ మెప్పుపొందడం కోసం కొందరు మంత్రులు కాపులను కులం పేరుతో దూషించడం సిగ్గుచేటని కాపు సంక్షేమ సేన నాయకుడు గద్వాల రమేశ్‌ మండిపడ్డారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ... తమ స్వార్థ రాజకీయాల కోసం కొందరు కాపు నాయకులు సొంత కులాన్నే దూషిస్తున్నారన్నారు. కులం పేరుతో బూతులు తిడుతున్నారని, ఈ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.


నాని... నోరు అదుపులో పెట్టుకో

పవన్‌ కల్యాణ్‌ విషయంలో మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు పామురాయి వెంకటేశ్‌ హెచ్చరించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే కాపులు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాపుల సంక్షేమానికి ఏమాత్రం కృషిచేయకుండా పదవులు కాపాడుకోవడం కోసం పవన్‌ని విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాపులంతా ఏకమై తరిమికొడతారని హెచ్చరించారు. 

Updated Date - 2021-09-29T08:12:48+05:30 IST