వైసీపీలో వార్‌

ABN , First Publish Date - 2020-11-28T06:11:43+05:30 IST

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలోని పశ్చిమ నియోజక వర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

వైసీపీలో వార్‌

నియోజకవర్గాల్లో గ్రూపుల గోల

 తారస్థాయికి నేతల మధ్య విభేదాలు 

 వేర్వేరుగా కార్యక్రమాలు

 ‘తూర్పు’లో అక్కరమాని, వంశీకృష్ణ వర్గాలు

‘సౌత్‌’లో నాలుగు... ‘పశ్చిమ’లో అయితే రచ్చకెక్కిన నేతలు

ఇదే పరిస్థితి కొనసాగితే జీవీఎంసీ ఎన్నికల్లో  ఎదురుదెబ్బ తప్పదని కార్యకర్తల ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలోని పశ్చిమ నియోజక వర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారం వ్యవధిలో రెండుసార్లు నాయకులు రచ్చకెక్కారు. ఇక, దక్షిణ నియోజకవర్గంలోనూ నాలుగు వర్గాల నడుమ కార్యకర్తలు నలిగి పోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 

2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఓటమిపాలైంది. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకే అప్పగిస్తూ సమన్వయ కర్తలుగా నియమించింది. అధిష్ఠానం నిర్ణయం పార్టీ ఆవిర్భావం నుంచి వున్న నేతలకు మింగుడుపడలేదు. అయినా బయటపడకుండా సమన్వయకర్తలకు పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేతల మధ్య విభేదాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆవిర్భావం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చారు. నియోజకవర్గ క్యాడర్‌లో మంచిపట్టు సంపాదించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు భీమిలి టిక్కెట్‌ కేటాయించాల్సి రావడంతో, అక్కడ సమన్వయకర్తగా వున్న అక్కరమాని విజయనిర్మలకుతూర్పు నియోజకవర్గం టిక్కెట్‌ ఇచ్చారు. దీనిపై అప్పట్లో వంశీకృష్ణ అనుచరులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ఆయనకు పార్టీ నగర అధ్యక్ష పదవి ఇచ్చి బుజ్జగించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన విజయనిర్మలను అధిష్ఠానం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఆమెతో పాటు ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ను కలిగి వున్న వంశీకృష్ణ కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తు న్నారు. నియోజకవర్గంలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వస్తుండడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఎవరితో వుండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. దక్షిణ నియోజకవర్గం విషయానికి వస్తే ఏకంగా నాలుగు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి సమన్వయకర్తగా పనిచేసిన కోలా గురువులును కాదని గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ద్రోణంరాజును నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంతో పాటు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత ఆయన కుమారుడు శ్రీవాత్సవ్‌ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కూడా వైసీపీకి దగ్గరయ్యారు.ఆయన కుమారులకు జగన్‌తో పార్టీ కండువాలు వేయించారు. దీంతో ప్రస్తుతం వాసుపల్లి, కోలా గురువులు, ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌ వర్గాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఈ మూడు గ్రూపులు కాకుండా రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి దగ్గరగా వుంటున్న జాన్‌ వెస్లీ కూడా నియోజకవర్గంలో తన ముద్ర వుండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గంలో నాలుగు ముక్కలాట అన్న చందంగా పార్టీ పరిస్థితి మారిందని వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. వార్డు స్థాయిలో నేతలు వర్గాలుగా విడిపోయి నిత్యం కొట్లాటలు, వాగ్వాదాలకు దిగుతున్నాయి. 60వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి పీవీ సురేష్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ నడిరోడ్డుపైనే వాగ్వాదానికి దిగడంపార్టీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్‌ సమక్షంలోనే ఫ్లెక్సీలు చించుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడంతో పార్టీ కార్యకర్తలను అవాక్కయ్యేలా చేసింది. నియోజక వర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీపరంగా నష్టపోక తప్పదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-11-28T06:11:43+05:30 IST