వైసీపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2020-11-19T05:42:55+05:30 IST

వైసీపీ నుంచి గెలిచిన నాయకులు అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ప్రాధాన్యమిస్తున్నారు.

వైసీపీలో వర్గపోరు

  1. మూడు నియోజకవర్గాల్లో ముసలం
  2. అభివృద్ధి వదిలి.. ఆధిపత్యం కోసం..!
  3. ఒక ఒరలో ఇమడని రెండు కత్తులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: వైసీపీ నుంచి గెలిచిన నాయకులు అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలను పక్కన పెట్టి పక్కనున్న నాయకులపైనే దృష్టి పెడుతున్నారు. అవకాశం దొరికినపుడల్లా బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య పొసగడంలేదు. గెలిచి రెండేళ్లు గడవకనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం తపన పడుతున్నారు. తమకు పోటీ వస్తారనుకున్న వాళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. జగన్‌ పాదయాత్ర ముగిసి మూడేళ్లయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. 


హఫీజ్‌ వర్సెస్‌ ఎస్వీ

కర్నూలు - కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హఫీజ్‌ఖాన్‌కు ఎమ్మెల్యే సీటు దక్కుతుందని అనుకున్నారు. అనూహ్యంగా ఎస్వీ మోహన్‌రెడ్డి పేరును వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. గెలిచిన తరువాత ఎస్వీ మోహన్‌ రెడ్డి టీడీపీలో చేరారు. దీంతో హఫీజ్‌ఖాన్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో హఫీజ్‌ఖాన్‌కు వైసీపీ టికెట్‌ వచ్చింది. ఎస్వీ మోహన్‌రెడ్డికి టీడీపీలో సీటు దక్కలేదు. దీంతో తిరిగి వైసీపీలో చేరారు. కానీ, ఆయనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదు. నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. 2019 దీపావళి సమయంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లారు. ఆ తరువాత ఇతర పార్టీవారిని వైసీపీలోకి చేర్చుకునే అంశంపైనా విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో ఇద్దరు నాయకులు పత్రికలకు ఎక్కారు. తనకు తెలీకుండా పార్టీలోకి ఇతరులను ఎలా చేర్చుకుంటారని ఎస్వీని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ప్రశ్నించారు. దీనికి ఎస్వీ కూడా కౌంటర్‌ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న సీఎం హోదాలో జగన్‌ తొలిసారి కర్నూలుకు వచ్చారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీలను అవమానించారనే వార్తలు వినిపించాయి. సీఎం రాకకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలోనూ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సభా వేదికపై ఉన్న ఎస్వీ కుటుంబాన్ని అధికారులు బలవంతంగా కిందకు దించేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వైఎస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను కూడా వేర్వేరుగా నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎమ్మెల్యేల పాదయాత్ర ముగింపు సభలో ‘ఓ పెద్ద మనిషి’ అని సంబోధిస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరి, జగన్‌పై అవాకులు చెవాకులు మాట్లాడారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిసి వెనక్కొచ్చారని ఎస్వీపై విమర్శలు గుప్పించారు. అతని వర్గీయులకు నామినేటెడ్‌ పదవులను ఎలా కట్టబెట్టుకుంటారని ప్రశ్నించారు. పార్టీకి పని చేసిన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హఫీజ్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఎస్వీ వర్గీయులు ఖండించారు. ఎన్నికల సమయంలో హఫీజ్‌ కుటుంబ సభ్యులంతా కలిసి ‘అదే పెద్ద మనిషి’ వద్దకు వెళ్లారని, తమ బిడ్డను గెలిపించాలని కోరిన విషయం గుర్తుచేశారు


సవాళ్లు.. ప్రతి సవాళ్లు 

కర్నూలు కొత్త బస్టాండ్‌ ఆవరణలోని ఓ హోటల్లో నందికొట్కూరు నియోజక వర్గంలోని స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని తెలుసుకున్న కుల సంఘాల నాయకులు అక్కడకు వెళ్లారు. మంత్రి అనిల్‌, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటి తోపులాటలు జరిగాయి. ఆ సమయంలో ఆర్థర్‌ను కొందరు బెదిరించారని సమాచారం. దీంతో కంగారు పడ్డ ఎమ్మెల్యే సంఘటనా స్థలం నుంచి గప్‌చుప్‌గా వెళ్లిపోయారని చెబుతారు. కుల సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. పరిస్థితి సద్దుమణిగి, నియోజకవర్గం ప్రశాంతంగా ఉందనుకునే సమయంలో పాదయాత్ర సభ వేదికగా మరోసారి విభేదాలు బహిర్గతం అయ్యాయి. జగన్‌ పాదయాత్ర ముగిసి మూడేళ్లు అయిన సందర్భంగా నందికొట్కూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జెండా మోసిన వాళ్లు నష్టపోతున్నారని, కొందరు నాయకులు స్థానికంగా శిఖండి రాజకీయం చేస్తున్నారని సిద్ధార్థరెడ్డి విమర్శించారు. జిల్లాలో పెద్ద నాయకులు అనుకునే వారు నియోజకవర్గంలో వేలు పెడతామంటే ఊరుకోబోనని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక వారి నియోజకవర్గానికి తానే వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ నెల 16న ఎమ్మెల్యే మరో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మరో పదేళ్లు తానే ఎమ్మెల్యే అభ్యర్థినని జగన్‌ తనకు చెప్పారని ఆర్థర్‌ ప్రకటించారు. కానీ ఆ మాటలకు తాను పొంగిపోనని, ఎపుడు ఇవ్వమంటే అపుడు రాసిచ్చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.


కోడుమూరులోనూ అంతే

ఎన్నికల తరువాత కోడుమూరు నియోజకవర్గంలో విభేదాలు ఎక్కువయ్యాయి. తన అనుమతి లేకుండా ఏమీ జరక్కూడదనే ధోరణిలో ఎమ్మెల్యే సుధాకర్‌ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. వైసీపీలో మొదట్నుంచి ఉన్న నాయకులను కాదని, వలస నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారని అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి హోదాలో ఇటీవల పాదయాత్ర చేసిన కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి గూడూరులో బహిరంగ సభ పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేపై పరోక్ష విమర్శలు చేశారు. వలస నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం పార్టీ సీనియర్‌ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు నిజంగా బలముంటే టీడీపీ నాయకులను చేర్చుకోవాల్సిన అవసరమేమిటని వ్యాఖ్యానించారు. 


సిద్ధార్థరెడ్డి దూకుడు.. ఆర్థర్‌ అసంతృప్తి

నందికొట్కూరు  నియోజకవర్గంలో రాజకీయ, వర్గ విభేదాలు ఆది నుంచి వైసీపీకి సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేంత స్థాయులో వర్గపోరు కొనసాగుతోంది. ఒకానొక సమయంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన కొన్నాళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా మసిలారు. ఆ కేసులో అత్యుత్సాహం చూపారన్న భావనతో రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యంను సిద్ధార్థ రెడ్డి బదిలీ చేయించారన్న ప్రచారం ఉంది. అనంతరం ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌పై ఒత్తిళ్లు పెరిగాయి. జూపాడుబంగ్లా మండలం బన్నూరు గ్రామంలో భూమి పూజ నిమిత్తం వెళ్లిన ఎమ్మెల్యేని కొందరు కార్యకర్తలు బహిరంగంగా విమర్శించారు. తమను పార్టీ కార్యక్రమాలకు రానివ్వడంలేదని, జెండా మోసిన తమను దూరం పెడుతున్నారని నిలదీశారు. దీంతో ఒత్తిడికి లోనైన ఎమ్మెల్యే, తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, తాను అనుకున్నదేదీ ఇక్కడ జరగడంలేదని వ్యాఖ్యానించారు. తాను పార్టీ కోసం పనిచేస్తానే తప్ప ఎవరి కాళ్లూ పట్టుకోవాల్సిన పనిలేదని ఎమ్మెల్యే అన్నారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి విషయంలో సిద్ధార్థ రెడ్డి, ఆర్థర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. తాను ప్రతిపాదించిన వ్యక్తికి కాకుండా సిద్ధార్థరెడ్డి మరో వ్యక్తిని చైర్మన్‌గా ఎంపిక చేయించారని ఆర్థర్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేను కాదని అభ్యర్థుల ఎంపి కలో సిద్ధార్థరెడ్డి చక్రం తిప్పారు. తన అనుయాయులకు అవకాశం కల్పిస్తూ, కార్యకర్తలను దూరం పెట్టారని ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ఆ విషయంలో సిద్ధార్థరెడ్డికి సహకరించిన ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పూర్తిగా సిద్ధార్థరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేం దుకూ సిద్ధపడ్డారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సర్దిచెప్పారు. 

Updated Date - 2020-11-19T05:42:55+05:30 IST