ఆర్‌డబ్ల్యూఎస్‌లో వార్‌!

ABN , First Publish Date - 2022-05-04T07:13:30+05:30 IST

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వార్‌ మొదలైంది.

ఆర్‌డబ్ల్యూఎస్‌లో వార్‌!

అధికారులు వర్సెస్‌ కాంట్రాక్టర్లు 

ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల ఎదురుదాడి

మద్దతు కోరుతూ జిల్లా అసోసియేషన్‌కు లేఖ 

పనిలేని కాంట్రాక్టర్లు ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఆగ్రహం

వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’పైనా అక్కసు 


జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వార్‌ మొదలైంది. జిల్లావ్యాప్తంగా రక్షిత మంచినీటి పథకాలు అవినీతి ఊటతో నిండిపోవటం, కలెక్టర్‌ విచారణకు ఆదేశించటం, విజిలెన్స్‌కు, ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదులు చేయడంతో ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులు ఎదురుదాడికి దిగారు. తమపై ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లపై యుద్ధానికి సిద్ధమయ్యారు. పనిలో పనిగా ఈ పరిణామాలను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’పైనా అక్కసు వెళ్లగక్కారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తమకు మద్దతుగా నిలవాలంటూ జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అసోసియేయేషన్‌ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావుకు లేఖ రాశారు. రెండు రోజుల్లో సమావేశం నిర్వహించాలని డెడ్‌లైన్‌ విధించారు. జిల్లా, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఉద్యోగుల సంఘం, మీడియా సమక్షంలో తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కలెక్టర్‌ దిల్లీరావు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విచారణాధికారిని నియమించగా, విచారణాధికారిపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో మొత్తం వ్యవహారాలపైనా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆరోపణలెదుర్కొంటున్న అధికారులు ఈ దశలో జిల్లా అసోసియేషన్‌ నాయకత్వాన్ని తమకు మద్దతుగా రంగంలోకి దిగమనటం గమనార్హం. 


జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన అవినీతి వ్యవహారాలపై కాంట్రాక్టర్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేయటంతో పాటు లోకాయుక్తలో కూడా కేసు వేశారు. ఆ తర్వాత ఏసీబీ, విజిలెన్స్‌ డీజీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ, రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీలకు ఫిర్యాదులు చేశారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఫిర్యాదులు చేరటంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విజిలెన్స్‌ విచారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భయంతోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షునికి లేఖ రాశారు. తమపై కొందరు పని లేని కాంట్రాక్టర్లు ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. శాఖలో 50 శాతం సిబ్బంది కొరత వేధిస్తోందని, ఒక్కో అధికారి రెండు, మూడు మండలాల్లో పనిచేయాల్సి వస్తోందని, ఇలాంటి సందర్భంలో పనిలేని కాంట్రాక్టర్లు తమను బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగక, ఎంతో నిజాయతీగా పనిచేసే తమపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ద్వారా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 


అసోసియేషన్‌  ఆచితూచి అడుగులు

అధికారుల లేఖలపై స్పందించే విషయంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అసోసియేషన్‌ తొందరపడటం లేదు. ఈ వ్యవహారం ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావటం, లోకాయుక్త విచారణలో ఉండటం, ఇప్పటికే జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించటంతో.. అసోసియేషన్‌ తర్జన భర్జనలు పడుతోంది. అధికారులపై వచ్చిన ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు ఉండడంతో జిల్లా అసోసియేషన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 


సాక్ష్యాలు చూపమనండి : కాంట్రాక్టర్లు

అధికారుల లేఖపై కాంట్రాక్టర్లు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం పనులన్నీ అవినీతి కూపాలుగా మారిపోయాయని, కాంట్రాక్టర్లను కూడా భయపెట్టి నాణ్యత లేకుండా పనులు చేయించారని ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పులకు సాక్ష్యాలు ఉన్నాయని, విజిలెన్స్‌ విచారణను ఎదుర్కోలేక తమ మీద పడుతున్నారని కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. అధికారులు అసోసియేషన్‌కు లేఖ రాసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తామే అసోసియేషన్‌ నాయకత్వాన్ని కలిసి, లేఖ రాసిన వారి బాగోతాలను బయట పెడతామంటున్నారు. అధికారుల ఎదుట అయినా, మీడియా సమక్షంలో అయినా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అధికారులు తప్పు చేయలేదని సాక్ష్యాలు తీసుకువస్తే వారి కాళ్లు పట్టుకుంటామని సవాల్‌ విసురుతున్నారు. 


‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు ఎందుకు? 

ఆర్‌డబ్ల్యూఎస్‌లో పరిణామాలను ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఆరోపణలెదుర్కొంటున్న అధికారులు ‘ఆంధ్రజ్యోతి’ని కూడా టార్గెట్‌ చేశారు. అధికారులు ఎలాంటి తప్పూ చేయకపోతే విచారణలో సచ్ఛీలురు అని తేలుతుంది. ఉన్నతస్థాయిలో ఫిర్యాదులు వచ్చిన అంశాలనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పేర్లను రాయలేదు. కానీ కొందరు అధికారులు భుజాలు తడుముకుంటున్నారు. 

Read more