తగ్గేదేలే.. గన్నవరం YSRCPలో మాటల తూటాలు

ABN , First Publish Date - 2022-05-21T06:31:25+05:30 IST

తగ్గేదేలే.. గన్నవరం YSRCPలో మాటల తూటాలు

తగ్గేదేలే.. గన్నవరం YSRCPలో మాటల తూటాలు

  • ఎమ్మెల్యే వంశీపై శివభరత్‌రెడ్డి విమర్శలు
  • ప్రతిగా దుట్టా వర్గంపై విరుచుకుపడిన వంశీ
  • వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిన బాధంటూ చమత్కారం
  • నాకు ఖాళీ లేదు.. వారికి పనిలేదంటూ ఎద్దేవా
  • తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న దుట్టా వర్గం


గన్నవరంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే వంశీమోహన్‌, వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు మధ్య ప్రత్యక్ష యుద్ధం తారస్థాయికి చేరుతోంది. వంశీపై గురువారం దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించగా, ప్రతిగా వంశీ శుక్రవారం విరుచుకుపడటంతో రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గన్నవరం వైసీపీలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. గురువారం వంశీపై దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి మాటలతో ప్రత్యక్ష దాడికి దిగగా, శుక్రవారం వంశీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నాకేమో ఖాళీ లేదు. వారికేమో పనిలేదు. రిటైర్‌ అయినవారు, పనిలేని వారు ఏం చేస్తారో, వారూ అదే చేస్తున్నారు.’ అంటూ దుట్టా వర్గంపై విమర్శలు గుప్పించారు. వరుసగా ఎన్నికల్లో తన చేతిలో సింగిల్‌గానూ.. గ్రూపులుగానూ వచ్చి ఓడిపోయారని, ఇగో వల్ల ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వంశీ వ్యాఖ్యానించారు. ‘వారికి కచ్చితంగా నాతో సమస్య ఉంటుంది. ఎందుకంటే 10-15 ఏళ్లుగా వారి ఊర్లోనే, వారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను. గడిచిన ఎన్నికల్లో వారిని ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదు. అందుకే నేను నచ్చను. వారికి ఎవరితో సమస్య ఉందో నాకు తెలియదు. నా మొహం నచ్చలేదంటే దానికి నేను బాధ్యుడ్ని కాదు.’ అని వంశీ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎవరూ తనపై ఆధిపత్యం సాధించలేకపోయా రన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులకు నాతో సమస్యా.. లేక పార్టీతో సమస్యా.. అనేది అర్థం కావట్లేదన్నారు. 


సమస్యలపై మాట్లాడేందుకే సీఎం పేషీకి వెళ్లా.. 

సీఎం పేషీకి వెళ్లింది కేవలం గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి పనులు, సమస్యలపై మాట్లాడేందుకేనని వంశీ తెలిపారు. అక్కడ దుట్టాని, నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది లేదని స్పష్టం చేశారు. ‘అక్కడ అధికారులు బిజీగా ఉన్నారు.. సోమవారం కలుద్దామన్నారు. అంతే జరిగింది.’ అని వంశీ తెలిపారు. తాను మట్టిని అక్రమంగా తవ్వుతున్నానని వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ మట్టి తవ్వకం కేవలం జగనన్న లే అవుట్ల కోసమేనన్నారు. అది కూడా సంబంధిత గ్రామస్థులు తోలుకుంటున్నారని చెప్పారు. వైసీపీ కేడర్‌ను ఎక్కడా తాను నిర్లక్ష్యం చేయలేదని, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులతో కలిసే పని చేసుకుంటున్నామన్నారు. ‘ఎక్కడ నొప్పి ఉందో, ఎవరికి నొప్పి ఉందో వారినే సమస్య ఏంటో అడగాలి’ అన్నారు. తాటాకు చప్పుళ్లు చేసే వారితో తనకు పనిలేదన్నారు. 


రగిలిపోతున్న దుట్టా వర్గం

వంశీ వ్యాఖ్యలపై దుట్టా రామచంద్రరావు వర్గం రగిలిపోతోంది. సీనియర్‌ నాయకుడన్న గౌరవం కూడా లేకుండా దుట్టాని ఉద్దేశించి పనీపాటా లేదంటూ వంశీ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. పదేపదే తమను అవమానించేలా వంశీ వ్యవహరిస్తున్నారని, ఆయన శైలిపై అధిష్ఠానం ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై తామే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దుట్టా కుమార్తె జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరు నుంచి ప్రారంభించిన వంశీ కనీసం తమను ఆహ్వానించకపోవడం, పైగా అవమానించేలా మాట్లాడుతుండటం వంటి అంశాలను మరోసారి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని దుట్టా వర్గీయులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-21T06:31:25+05:30 IST