అయోధ్య ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే

ABN , First Publish Date - 2020-02-22T08:37:13+05:30 IST

అయోధ్యలో బాబ్రీ మసీదు స్థలానికి ప్రతిగా వేరేచోట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తీసుకోవడం తమకు సమ్మతమేనని

అయోధ్య ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే

  •  యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు అంగీకారం 

లఖ్‌నవూ, ఫిబ్రవరి 21: అయోధ్యలో  బాబ్రీ మసీదు స్థలానికి ప్రతిగా వేరేచోట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తీసుకోవడం తమకు సమ్మతమేనని యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. వివాదాస్పద స్థలం రాముడికే చెందుతుందంటూ నవంబరు 9న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అదే సమయంలో ముస్లిం కక్షిదారులకు (సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ఐదెకరాల భూమిని ఇవ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ బోర్డుకు అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో లక్నో హైవేపై ఉన్న ధనిపూర్‌ అనే గ్రామం వద్ద ఆ భూమిని కేటాయించింది. దీనిని తిరస్కరించాలని కొన్ని ముస్లిం సంస్థలు, పర్సనల్‌ లా బోర్డు సున్నీలను కోరాయి. అయితే సున్నీ బోర్డు అందుకు అంగీకరించలేదు. ‘‘ఈ భూమిని తిరస్కరించలేం. దీనిని తీసుకోవడం మినహా మాకు మరో మార్గం లేదు. తీసుకోకుంటే  అది కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తుంది. మా వైఖరిలో మార్పులేదు. ఆ ఐదెకరాలూ ఎలా వినియోగించుకోవాలన్నది సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయించుకుంటాం’’ అని సున్నీ బోర్డు నేత ఫరూకీ తెలిపారు. 

Updated Date - 2020-02-22T08:37:13+05:30 IST