కరోనా పోవాలి.. అమరావతి కావాలి

ABN , First Publish Date - 2020-03-31T09:03:08+05:30 IST

కరోనా పోవాలి.. రాజధానిగా అమరావతి కావాలి.. అంటూ రాజధాని రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. సోమవారం 104వ రోజు రాజధాని గ్రామాల్లో

కరోనా పోవాలి.. అమరావతి కావాలి

104వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు


తుళ్లూరు, గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా పోవాలి.. రాజధానిగా అమరావతి కావాలి.. అంటూ రాజధాని రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. సోమవారం 104వ రోజు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటానే అమరావతి ఉద్యమం కొనసాగించారు. పలు గ్రామాల్లో మహిళలు మాస్కులు తయారు చేసి వాటిపైన జై అమరావతి, సేవ్‌ అమరావతి అని రాసి రాష్ట్ర వ్యాప్తంగా పంచడానికి సిద్ధమవుతున్నారు. అవ్వ, తాత అంటూ ముద్దులు పెడితే నమ్మి మోస పోయాం అంటూ రాయపూడికి చెందిన ముస్లీం రైతులు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.


పెదపరిమి శివాలయంలో మహిళలు ఆందోళనలు కొనసాగించారు. నీరుకొండ, పెదపరమి దీక్షా శిబిరాల్లో సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళనలు చేశారు.  తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం ఇలా 29 గ్రామాల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపి కొవ్వుతులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు చేస్తున్న నిరసన సోమవారం కూడా జరిగింది.   

Updated Date - 2020-03-31T09:03:08+05:30 IST