ఈ నియోజకవర్గానికి TDP నాయకులు కావలెను.. నేడు కీలక సమావేశం.. ఆ ఒక్క ఫ్యామిలీ పార్టీలోకి వస్తే..!

ABN , First Publish Date - 2021-12-23T12:42:11+05:30 IST

ఈ నియోజకవర్గానికి TDP నాయకులు కావలెను.. నేడు కీలక సమావేశం.. ఆ ఒక్క ఫ్యామిలీ పార్టీలోకి వస్తే..!

ఈ నియోజకవర్గానికి TDP నాయకులు కావలెను.. నేడు కీలక సమావేశం.. ఆ ఒక్క ఫ్యామిలీ పార్టీలోకి వస్తే..!

  • శ్రేణుల అభిప్రాయం తెలుసుకునేందుకు భేటీ
  • తెరమీదకు లక్ష్మీదేవమ్మ కుటుంబం పేరు


తిరుపతి : గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో నాయకత్వలేమితో సతమతమవుతున్న తంబళ్ళపల్లె మీద తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దృష్టిపెట్టింది. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరగనుంది. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుని నేత ఎవరో నిర్ణయిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీదేవమ్మ కుటుంబం పేరు తెరమీదకు వస్తోంది.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండున్నరేళ్ళుగా తంబళ్ళపల్లె టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యారు.


అరుదుగా మాత్రమే నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశం ఒక్కసారి కూడా జరగలేదు. మరోవైపు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి రాజకీయ దూకుడు పెరుగుతూనే ఉంది. కష్టమొస్తే అండగా నిలిచే నాయకుడు లేకపోవడంతో చాలావరకూ టీడీపీ క్యాడర్‌ చెదిరిపోయింది. పలువురు వైసీపీలో చేరిపోయారు. పార్టీ పట్ల అభిమానం చంపుకోలేని కార్యకర్తలు, గ్రామ, మండల స్థాయి నాయకులు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుని కొనసాగుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ బాధ్యతలు నిలబడి మోసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పార్టీ స్థానిక కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధపడింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఏవీ లక్ష్మీదేవమ్మ కుటుంబం ప్రస్తావన మళ్లీ తెరమీదకు వస్తోంది.


నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం గణనీయంగా వుంది. ఆ వర్గంలో మెజారిటీ భాగం వైసీపీ పక్షాన వుంది. లక్ష్మీదేవమ్మ కుటుంబం కూడా అదే వర్గానికి చెందింది కావడంతో ఆమెకు గానీ లేదా ఆమె కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి గానీ నాయకత్వం అప్పగిస్తే రెడ్డి సామాజికవర్గంలో చీలిక వస్తుందని కొందరు సూచిస్తున్నారు. టీడీపీని వీడిపోయాక ప్రవీణ్‌ మౌనం దాల్చినప్పటికీ, మళ్లీ క్రియాశీలం కావాలని ఆ కుటుంబం భావిస్తోందని చెబుతున్నారు. దీంతో లక్ష్మీదేవమ్మతోనూ, ఆమె తనయుడు ప్రవీణ్‌తోనూ జిల్లా టీడీపీ ఇంఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పలు దఫాలు చర్చించినట్టు సమాచారం.


లక్ష్మీదేవమ్మ కుటుంబం టీడీపీలో చేరి నాయకత్వ బాధ్యతలు చేపడితే వైసీపీలో చేరిపోయిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో 90 శాతం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశముంది. మరోవైపు ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి పట్ల అసంతృప్తితో వున్న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు  కూడా టీడీపీలో చేరే అవకాశముంది. ఈ ఫీడ్‌ బ్యాక్‌ను అందించిన టీడీపీ ముఖ్యనేతలు ఇటీవలే ఆ ఇద్దరినీ అధినేతతో కూడా మాట్లాడించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. అయితే నిర్ణయం తీసుకునే ముందు నియోజకవర్గంలో ఇంతకాలం పార్టీని బతికించుకున్న శ్రేణులతో సమావేశమై వారి విలువైన అభిప్రాయాలు తెలుసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. దానికోసమే గురువారం మంగళగిరిలో సమావేశం జరుగుతోంది.


కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌ తన వర్గంతో పాటు సమావేశానికి హాజరవుతున్నారు. ఇంఛార్జిగా తనే కొనసాగేందుకు వీలుగా నియోజకవర్గ పార్టీ శ్రేణుల మద్దతు కోసం గట్టిగా యత్నిస్తున్నారు. మరోవైపు బి.కొత్తకోట మాజీ జడ్పీటీసీ పర్వీన్‌ తాజ్‌ సైతం తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద తంబళ్ళపల్లె నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చే దిశగా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-12-23T12:42:11+05:30 IST