Teacher recruitment Scam: ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం.. కంటతడి పెట్టిన పార్థా చటర్జీ, అర్పిత

ABN , First Publish Date - 2022-09-15T01:32:49+05:30 IST

టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఈడీ అరెస్టుతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో..

Teacher recruitment Scam: ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం.. కంటతడి పెట్టిన పార్థా చటర్జీ, అర్పిత

కోల్‌కతా: టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం ( Teachers Recruitment Scam)లో ఈడీ అరెస్టుతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (partha Chatterjee), ఆయన సన్నిహిత సహచరురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) బుధవారం కోర్టు విచారణ సందర్భంగా కంటతడి పెట్టారు (Break down). ''మేము ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నాం'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వర్చువల్ పద్ధతిలో వీరిరువురూ కోర్టు విచారణకు హాజరయ్యారు.


రాజకీయ బాధితుడిని..

"ప్రజల్లో నాకున్న ఇమేజ్ విషయం నన్ను కలవర పెడుతోంది. నేను ఎకనామిక్స్ విద్యార్థిని. మంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. నేను రాజకీయ బాధితుడ్ని. ఈడీని మా ఇంటికి రమ్మనండి, నా నియోజకవర్గానికి ఒకసారి వచ్చి చూడమనండి. నేను ఎల్ఎల్‌బీ చేశా. బ్రిటిష్ స్కాలర్‌షిప్ అందుకున్నాం. నా కుమార్తె యూకేలో ఉంటోంది. ఇలాంటి కుంభకోణంలో నేనెందుకు ఉంటాను?'' అని పార్థా చటర్జీ న్యాయమూర్తి ముందు వాపోయారు. పార్థా ఛటర్జీ బెయిలుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెస్తూ, దర్యాప్తు సంస్థకు తన క్లయింట్ సహకరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా సహకరిస్తారని చెప్పారు. '' మీరు ఎలాంటి షరతులు విధించినా సరే... దయచేసి నా క్లెయింట్‌కు బెయిల్ మంజూరు చేయండి'' అని కోర్టును అభ్యర్థించారు. దీనికి కొనసాగింపుగా పార్థాచటర్జీ కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ, తాను ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నానని అన్నారు. ''ప్రశాంతంగా జీవితం గడిపేందుకు దయచేసి అనుమతించండి. ఏ షరతుల మీదైనా సరే నాకు బెయిల్ ఇవ్వండి'' అని కోరారు.


అనంతరం, అర్పితా ముఖర్జీని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ''నాకు ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది? ఎలా ఈడీ స్వాధీనం చేసుకుందనేది నిజంగానే నాకు తెలియదు'' అని అన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎక్కడ డబ్బు దొరికిందో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. ''నా నివాసంలోనే'' అని అర్పిత సమాధానం ఇచ్చారు. ''మీరు ఆ ఇంటికి యజమానేనా?" అని జడ్జి తిరిగి ప్రశ్నించారు. ''అవును'' అంటూ ఆమె సమాధానమిచ్చారు. ''అప్పుడు చట్టప్రకారం దీనికి మీరే జవాబుదారు'' అని జడ్జి వివరించారు. దానికి అర్పిత తిరిగి స్పందిస్తూ, స్వాధీనం చేసుకున్న సొమ్ముపై తనకెంలాటి ఐడియా లేదని, తాను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. తన తండ్రి చనిపోయారని, 82 ఏళ్ల తల్లి ఆరోగ్యం బాగోలేదని, తాను ఓ సాధారణ కుటుంబీకురాలినని, అలాంటి తన ఇంటిపై ఈడీ ఎందుకు రెయిడ్ చేస్తుందని అన్నారు. దానికి న్యాయమూర్తి తిరిగి స్పందిస్తూ, విచారణకు అవసరమనుకుంటే ఏ ఇంట్లోనైనా సోదాలు చేసే అధికారం ఈడీకి ఉంటుందని అన్నారు. గత జూలైలో అర్పిత నివాసంపై ఈడీ దాడుల్లో సుమారు 50 కోట్ల నగదు, బంగారం, ఆభరణాలు లభ్యమయ్యాయి. కీలక డాక్యుమెంట్లు దొరికాయి. బెంగాల్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పార్థా ఛటర్జీతో ఆమెకు సంబంధాలున్నాయనే అభియోగంపై ఈడీ వీరిరువుని అరెస్టు చేసింది.

Updated Date - 2022-09-15T01:32:49+05:30 IST