విదేశాల్లో ఎలక్ట్రానిక్స్‌లో పీజీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ABN , First Publish Date - 2021-12-13T16:29:38+05:30 IST

మా అమ్మాయి..

విదేశాల్లో ఎలక్ట్రానిక్స్‌లో పీజీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ఎలక్ట్రానిక్స్‌లో పీజీ

మా అమ్మాయి టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతోంది. విదేశాల్లో ఎలక్ట్రానిక్స్‌లో పీజీ చేయాలని అనుకుంటోంది. ఏ దేశాల్లో ఈ కోర్సు బాగుంటుందో సలహా ఇవ్వగలరు? తను ఏయే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ఎంత స్కోరు రావాలి? ఒకటి, రెండు సంవత్సరాలు ఏదైనా ఉద్యోగం చేసిన తరవాత పీజీకి వెళితే మంచిదా లేకుంటే గ్రాడ్యుయేషన్‌ తరవాత నేరుగా పీజీకి వెళితే మంచిదా సలహా ఇవ్వగలరు?

- మీనాక్షి, సత్తుపల్లి

ఆసక్తిని బట్టి తను అనుకున్న దేశానికి చదువుకోవడానికి వెళ్లవచ్చు. విదేశాల్లో ఎక్కడ చదవొచ్చు అని బ్రాడ్‌గా అడిగితే కష్టం. చాలా దేశాల్లో అవకాశాలు ఉంటాయి. అమ్మాయి ఆసక్తులు, ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకొమ్మని చెప్పండి. మొదట తనని  జీఆర్‌ఈ, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ని రాయాలని చెప్పండి. జీఆర్‌ఈలో 327 కంటే ఎక్కువ వస్తే మంచి స్కోర్‌ కింద లెక్క. ఇక ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌లో అయితే టోఫెల్‌లో 100 అంతకంటే ఎక్కువ, ఐఈఎల్‌టీఎ్‌సలో అయితే 7 అంతకంటే ఎక్కువ అయితే మంచి స్కోరు. 


ఇక ఏ దేశానికి వెళ్లాలి అనేది తన ప్రాధాన్యాల ఆధారంగా నిర్ణయించుకోమనండి. సాధారణంగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు అక్కడే స్థిరపడిపోవడం, వర్క్‌ వీసాల సౌలభ్యం, కోర్సుల కాలవ్యవధి, ట్యూషన్‌ ఫీజు, స్కాలర్‌షిప్‌ అవకాశాలు, లొకేషన్‌, ఆయా యూనివర్సిటీలు అందజేసే సబ్జెక్టులు, యూనివర్సిటీ ర్యాంకు తదితరాలను పరిశీలించుకుంటారు. ఇందులో తమ ప్రాధాన్యాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎంఎస్‌ కోర్సు విషయానికి వస్తే ఒకటి రెండు సంవత్సరాలు పనిచేయడం అనేది కోర్సు పరంగా తనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎంబీఏ చేయాలనుకునే వారికే వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఉపయోగం ఉంటుంది.



నానో టెక్నాలజీలో మాస్టర్స్‌..!

నేను మెకానికల్‌ ఇంజనీరింగ్‌తో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాను. నానో టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయాలని అనుకుంటున్నాను. దీనికి ఏ కాలేజీలు బాగుంటాయి, ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుపగలరు? 

- రాజేష్‌, కరీంనగర్‌

ఏ రంగంలోనైనా స్కోప్‌ అనేది ఆ సబ్జెక్టులో అభ్యర్థి పర్ఫార్మెన్స్‌ ఆధారంగానే ఫలితం ఉంటుంది. నిజంగా నానో టెకాల్నజీపై ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టుపై ఎంత పట్టు సంపాదించగలరు అని అంచనావేసుకోండి. తరవాత కెరీర్‌లో కూడా ఎలాంటి వాతావరణంలో పనిచేయాలో గమనిస్తూ ఉండండి. దేశంలోని చాలా కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటి, ఎన్‌ఐటి, బిట్స్‌ పిలానీ కాకుండా నోయిడాలోని ‘అమిటి’ యూనివర్సిటీ, చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎమ్‌, తిరుచ్చిలోని అన్నా యూనివర్సిటీ, పట్నాలోని ఆర్యభట్టా నాలెడ్జ్‌ యూనివర్సిటీ, అజ్మీర్‌లోని భగవంత్‌ యూనివర్సిటీ వంటి జాతీయ స్థాయి వర్సిటీల్లో ఈ కోర్సులు ఉన్నాయి. చాలా యూనివర్సిటీలు ‘గేట్‌’ ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్‌ ఇస్తాయి. అడ్మిషన్లను దాదాపుగా ప్రతీ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. 



ఉద్యోగం వస్తుందా?

నేను బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవాలనుకుంటున్నాను. ప్రైవేటు యూనివర్సిటీల్లో చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? ఐసీఏఆర్‌ గుర్తింపు లేకుండా కేవలం యూజీసీ గుర్తింపు ఉన్నా పర్వాలేదా? 

- దేవిక,  యాదాద్రి

అగ్రికల్చర్‌ ఎందుకు చదవాలనుకుంటున్నారు. తదుపరి ఏ కెరీర్‌లోకి వెళ్లాలనుకుంటున్నారు అనే విషయంలో మొదట క్లారిటీకి రండి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సును చదవడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే అగ్రికల్చర్‌ కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ పాలసీలు తరచుగా మారే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్‌ విషయానికి వస్తే వీరికి ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు రంగంలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులపై పట్టు ఉండి సైంటిఫిక్‌ ల్యాబ్‌ లేదా ఫీల్డ్‌లో కానీ పనిచేయగలిగేవారు ఇందులో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి టీచింగ్‌ ఫ్యాకల్టీ, ఇన్ర్ఫాస్ట్రక్చర్‌, పరికరాలతోపాటు పేరున్న కాలేజీలో చేరితే తరవాత అవకాశాలు బాగుంటాయి. ఇలాంటి కాలేజీల్లో చేరిన విద్యార్థులు రాణించడానికి అవకాశం ఉంటుంది. 

- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏవైనా సందేహాలు ఉంటే సంప్రదించండి:

చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-12-13T16:29:38+05:30 IST