Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 18 Jan 2022 03:19:55 IST

అటవీ భూమే కావాలి!

twitter-iconwatsapp-iconfb-icon
అటవీ భూమే కావాలి!

  • విశాఖలో మరో భూ స్కామ్‌కు బీజం!?
  • పర్యాటకం పేరుతో ప్రభుత్వ పెద్దల పావులు
  • భీమిలి బీచ్‌ రోడ్డులో 22 ఎకరాలపై కన్ను
  • స్థలం కోసం రెండు సంస్థల దరఖాస్తు
  • వెంటనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరిన ఫైలు
  • షెల్టర్‌ బెల్ట్‌ను గాలికి వదిలేసిన అధికారులు
  • పర్యావరణవేత్తల ఆందోళన, అనుమానాలు

తీర నగరం విశాఖలో మరో ‘భూదందా’కు బీజం పడినట్లు తెలుస్తోంది. పర్యాటకాభివృద్ధి పేరుతో కీలక ప్రాంతంలో ఉన్న 22 ఎకరాల అటవీ భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదులుతున్నాయని పర్యావరణ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంస్థలు దరఖాస్తు చేసుకోవడం... ఆ వెంటనే అధికారులు అందుకు ఆమోదం తెలిపి, ఫైలును ఢిల్లీకి పంపించేయడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా చూస్తుంటే... ఈ తతంగం వెనుక పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

విశాఖ నగరం... ఎప్పటి నుంచో సీమాంధ్ర ఆర్థిక రాజధాని! దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే పర్యాటక రాజధాని కూడా! ఇప్పుడు... జగన్‌ సర్కారు దీనిని ‘పరిపాలన రాజధాని’గా కూడా చేస్తామంటోంది! అదే క్రమంలో... విశాఖలో కీలకమైన భూములు, ప్రాజెక్టులు చేతులు మారుతూ వస్తున్నాయి. తాజాగా... పర్యాటకం పేరుతో భీమిలి బీచ్‌ రోడ్డులో 22 ఎకరాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. అది కూడా... అటవీ భూమి కావడం గమనార్హం. ‘విశాఖపట్నం - భీమిలి - భోగాపురం’ బీచ్‌ కారిడార్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ బీచ్‌  కారిడార్‌ను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక పాలసీని ప్రకటించింది. దాని ఆధారంగా.... బీచ్‌ను ఆనుకొని ఉన్న అటవీ భూములను లీజుకు దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘ఇక్కడ ప్రైవేటు స్థలాలు లేవు. అందుకే అటవీ భూములు కోరుతున్నాం’ అని నేరుగా చెప్పేస్తున్నారు.


అటవీ భూమే కావాలి!

2 ప్రాజెక్టులు.. 22 ఎకరాలు.. 99 ఏళ్ల లీజు

విశాఖపట్నంలో బీచ్‌ రిసార్ట్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యాప్‌ బీచ్‌ రిసార్ట్స్‌, మెరైన్‌ బ్రిజో అనే రెండు సంస్థలు రామానాయుడు స్టూడియోకు ఎదురుగా ఉన్న బీచ్‌లో 19 ఎకరాలు, గుడ్లవానిపాలెం వద్ద బీచ్‌లో మూడు ఎకరాలు 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వాలని అటవీ శాఖకు దరఖాస్తు చేశాయి. పైకి చూస్తే... ఇవి రెండూ వేర్వేరు సంస్థలు, వేర్వేరు ప్రాజెక్టులు. కానీ... అవి సమర్పించిన దరఖాస్తులు ‘సేమ్‌ టు సేమ్‌’గా ఉన్నాయి. ప్రాజెక్టు పేర్లు, వివరాలు మినహా... మిగిలిన పదాలు, వాక్యాలు దాదాపుగా ఒక్కటే. దీంతో... ఈ రెండు గ్రూపుల వెనుక ఒక్కరే ఉన్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.


ఆ సంగతి పక్కనపెడితే.. అటవీ శాఖ చట్టాలు కఠినంగా ఉంటాయి. ఒక్క సెంటు అటవీ భూమిని ఇతరులకు అప్పగించాలన్నా సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. చివరికి.. అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంత సులువుగా సేకరించలేవు. మరోవైపు.. విశాఖలో పర్యాటక అభివృద్ధి కోసం అనేక ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ముం దుకు రావాలని రాష్ట్ర పర్యాటక శాఖ ఎప్పటి నుంచో ఆహ్వానిస్తోంది. అయినా సరే.. ఆ 2 సంస్థలు అటవీ భూములనే కోరుకోవడం విశేషం.


స్తుతం ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ ప్రకారం.. ఈ భూ ముల విలువ దాదాపు సుమారు రూ.300 కోట్లు. పర్యావరణ పరంగా చూస్తే.. అసలు ఆ భూములకు వెల కట్టలేం. ఎందుకంటే.. 2014లో హుద్‌హుద్‌ తుఫా న్‌ వచ్చిన తరువాత బీచ్‌ కారిడార్‌లో షెల్టర్‌ బెల్ట్‌ అభివృద్ధి చేస్తామని అటవీ శాఖ ప్రకటించింది. అయినా సరే.. దరఖాస్తులు అందడమే ఆలస్యం అన్నట్లుగా వా టిపై రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఆ 22 ఎకరాలను మ్యాప్‌ బీచ్‌ రిసార్ట్స్‌, మెరైన్‌ బ్రిజో సంస్థలకు 99 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆగమేఘాల మీద ఫైలు పం పించారు. ఆ కంపెనీల వెనుక పెద్దలు ఉన్నారని, అందుకే ఎటువంటి కొర్రీలు లేకుండా పంపారని విశ్వసనీయ సమాచారం. భీమిలి బీచ్‌ రోడ్డులోని తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియోకు ఎదురుగా బీచ్‌ ను ఆనుకొని అటవీ భూములున్నాయి.


తిమ్మాపురం ఫారెస్ట్‌ బ్లాక్‌ కంపార్ట్‌మెంట్‌ నంబరు 964లో ఏడు హెక్టార్లు(సుమారుగా 19 ఎకరాలు) కావాలని మ్యాప్‌ బీచ్‌ రిసార్ట్‌ దరఖాస్తు చేసింది. అందులో కన్వెన్షన్‌ సెంటర్‌, హెల్త్‌ ఎరీనా, వెల్‌నెస్‌ స్పా, ఎంటర్‌టైన్‌మెం ట్‌ జోన్‌, ఆక్వా స్పోర్ట్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, హై ఎం డ్‌ షాపింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రూ.142 కోట్లు వ్యయమవుతుందని, 250 మందికి  ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ఇందులోనే 120 గదులతో రిసార్ట్‌ హోటల్‌ కూడా నిర్మిస్తామని తెలిపింది. ఇక.. బీచ్‌ రోడ్డులో జూ వెనుక గేటు దాటగానే వచ్చే గుడ్లవానిపాలెంలో బీచ్‌ను ఆనుకొని ఫారెస్ట్‌ బ్లాక్‌, కంపార్ట్‌మెంట్‌ నంబరు 965లో సుమారు హెక్టారు (2.74 ఎకరాలు) భూమి కావాలని మెరైన్‌ బ్రిజో దరఖాస్తు చేసింది. 


రిసార్ట్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, హెల్త్‌ ఎరీనా, డ్రైవ్‌ ఇన్‌ బార్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌ వంటివి ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ సంస్థ పెట్టుబడి రూ.10 కోట్లు కాగా 100 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ‘‘విశాఖపట్నం-భీమిలి బీచ్‌ కారిడార్‌లో పర్యాటకానికి ఎంతో అవకాశం ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు’’ అని ఈ రెండు సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.