వామ్మో పులి...

ABN , First Publish Date - 2022-08-08T04:01:35+05:30 IST

మండలంలో మళ్లీ పులి సంచారం మొదలైంది. కొన్ని నెలల విరామం తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారంతో ప్రజలు వామ్మో పులి అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన పులి మండలంలోని వెంచపల్లి అటవీ సమీపంలో 20 రోజుల క్రితం కనబడింది. వెంచపల్లి నుంచి బొప్పారం అటవీ ప్రాంతం గుండా పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పులి అడుగుల ముద్రల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు.

వామ్మో పులి...
అటవీ ప్రాంతంలో పులి కోసం అన్వేషిస్తున్న అధికారులు

ప్రాణహిత సరిహద్దుల్లో సంచారం 

ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు 

అవగాహన కల్పిస్తున్న అధికారులు 

వేటగాళ్లతో పొంచి ఉన్న ముప్పు 

కోటపల్లి, ఆగస్టు 7: మండలంలో మళ్లీ పులి సంచారం మొదలైంది. కొన్ని నెలల విరామం తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారంతో ప్రజలు వామ్మో పులి అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన పులి మండలంలోని వెంచపల్లి అటవీ సమీపంలో 20 రోజుల క్రితం కనబడింది. వెంచపల్లి నుంచి బొప్పారం అటవీ ప్రాంతం గుండా పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో సంచరించినట్లు పులి అడుగుల ముద్రల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఎడగట్ట ప్రాంతంలో ఎద్దు, బొప్పారంలో మేకపై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.  నాలుగు రోజులుగా ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన అన్నారం, అర్జునగుట్ట ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులి రాకతో అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలపై వివరాలను సేకరిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి పులి అడుగులను గుర్తిస్తూ పులి ఎటు వైపు వెళ్తుందనే దానిపై సమాచారం సేకరించే పనిలో పడ్డారు.  

వచ్చింది కొత్తపులి....

మహారాష్ట్ర నుంచి కోటపల్లి రేంజ్‌ పరిధిలో సంచరిస్తున్న పులి కొత్త పులిగా అటవీ అధికారులు భావిస్తున్నారు. ఎద్దు, మేకపై దాడి చేసిన పులి కే4 పులినా? లేక గతంలో పక్క జిల్లా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సంచరించిన ఎస్‌8 పులినా? గతంలో మండలంలో సంచరించిన ఏ2 అనే పులినా అనే దానిపై సందేహాలు వెలువడ్డాయి. అయితే సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాల ఆధారంగా గతంలో ఇక్కడ సంచరించిన పులులు కాదని, ఇది కొత్తగా వచ్చిన పులి అని తేలినట్లు తెలుస్తోంది. దీనికి ఇంకా పేరు నిర్ధారణ కాలేదని సమాచారం. అయితే ఇక్కడ అడుగు పెట్టిన వారంలోనే ఎద్దు, మేకపై దాడి చేసి చంపడంతో పులి కొన్నాళ్లు ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి..

పులికి పొంచి ఉన్న ముప్పు....

పులికి వేటగాళ్ల రూపంలో ముప్పు పొంచి ఉంది. గతంలో పిన్నారం, ఎడగట్ట అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి పులి మృతి చెందింది. దీనిపై పోలీసు, అటవీ అధికారులు కొన్నాళ్లు నిఘా పెట్టడంతో అప్పట్లో వేట తగ్గినా మళ్లీ జోరందుకుంది. మూడు నెలల క్రితమే ఇదే ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన తీగలకు ఓ వేటగాడే మృతి చెందాడు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో పులి ఎద్దుపై దాడి చేయడం, ఈ ప్రాంతంలో సంచరిస్తుండడంతో వేటగాళ్ల నుంచి పులికి ఆపద ముంచుకు వస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ అధికారులు పులికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఆందోళనలో గ్రామాల ప్రజలు 

పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు ఆయా గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు. వెంచపల్లి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి బొప్పారం, పిన్నారం, ఎడగట్ట గ్రామాల అటవీ ప్రాంతంలో మూడు రోజుల పాటు మకాం పెట్టడం, ప్రస్తుతం అర్జునగుట్ట, అన్నారం ఏరియాలో సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.  పులి అటవీ ప్రాంతాన్ని వీడి జనావాసంలోకి వస్తుందేమోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామాలను అనుకుని అటవీ ప్రాంతాలు ఉండడం, మూగ జీవాలపై దాడి చేయడంతో పులి ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో, ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

అవగాహన కల్పిస్తున్న అటవీ అధికారులు..

పులి సంచారంతో కోటపల్లి అటవీ రేంజర్‌ రవి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు తీసుకువెళ్లవద్దని, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని అవగాహన కల్పించారు. పిన్నారం, ఎసన్‌వాయి, ఎడగట్ట, పారుపెల్లి,  కోటపల్లి, లింగన్నపేట, అర్జునగుట్ట గ్రామాల్లో రెండు రోజులుగా అటవీ శాఖ అధికారులు పులి సంచారంపై టాంటాం చేయడంతో పాటు అవగాహన కల్పించారు. వేటగాళ్లు ఎవరు కూడా వేట సాగించవద్దని, వేట సాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.  

Updated Date - 2022-08-08T04:01:35+05:30 IST