యంత్రలక్ష్మ్మి కరుణించేదెన్నడో?

ABN , First Publish Date - 2022-05-14T06:03:31+05:30 IST

వ్యవసాయంలో యాంత్రికరణను ప్రోత్సహించడం ద్వారా రైతుల సాగు వ్యయం, శ్రమను తగ్గించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన యంత్రలక్ష్మీ పథకానికి నాలుగేళ్లుగా బ్రేక్‌ పడింది.

యంత్రలక్ష్మ్మి కరుణించేదెన్నడో?
2018లో రైతులకు అందజేసిన సబ్సిడీ ట్రాక్టర్‌లు, వరికోత మిషన్‌లు

- 2018లో పథకానికి బ్రేక్‌

- నాలుగేళ్లుగా రైతుల ఎదురుచూపులు

కామారెడ్డి, మే 13: వ్యవసాయంలో యాంత్రికరణను ప్రోత్సహించడం ద్వారా రైతుల సాగు వ్యయం, శ్రమను తగ్గించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన యంత్రలక్ష్మీ పథకానికి నాలుగేళ్లుగా బ్రేక్‌ పడింది. దీంతో యాంత్రికీకరణపై ఆసక్తి ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా కొద్దిమందికే సబ్సిడీపై ట్రాక్టర్‌లు, ఇతర వ్యవసాయ పరికరాలు అందాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అర్హులైన రైతులు ఈ పథకం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు

యంత్రలక్ష్మీ పథకంలో భాగంగా భారీ యంత్రాలైన వరినాటు మిషన్లు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్‌లు, గడ్డిచుట్టె యంత్రాలు, రోటావేటర్లు, దమ్ముచక్రాలు, కల్టివేటర్లు, నాగళ్లు, మినీ ట్రాక్టర్లువంటి వ్యవసాయ పరికరాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకైతే 95 శాతం రాయితీపై ఇస్తారు. దీంతో ఈ పథకానికి మంచి స్పందన వచ్చింది. అనేక మంది రైతులు యంత్రాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఈ పథకంలో రైతుల డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో బడారైతులు, పైరవీఉన్న వారికే ఇవి దక్కినట్లు విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యవసాయంతో సంబంధం లేని వారికి సైతం ట్రాక్టర్లు అందినట్లు ఆరోపణలున్నాయి. ఈ పథకం ద్వారా పొందిన ట్రాక్టర్లు పూర్తిగా వ్యవసాయ పనులకే ఉపయోగించాల్సి ఉన్నా కొంత మంది ఇసుక అక్రమ రవాణాతో పాటు వ్యవసాయేతర పనుల్లో వినియోగిస్తున్నారు.

యాంత్రికీకరణతో ప్రయోజనం

వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, యంత్రాల వాడకం పెంచడం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం కూలీల కొరత అధికమవుతున్న దశలో యంత్రాల వినియోగంతో ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. అలాగే వ్యవసాయఖర్చులు, శ్రమ, సమయం ఆదా అవుతాయి. అధిక సబ్సిడీపై అందించడంతో రైతులంతా యాంత్రికీకరణ వైపు మారడానికి అవకాశాలున్నాయి. ప్రస్తుతం యంత్రాలు కొనాలనుకునే రైతులు అధిక ధరలు వెచ్చిస్తూ బహిరంగ మార్కెట్‌లో వివిధ రకాల పరికరాలు కొనడం తలకు మించిన భారంగా తయారైందని వాపోతున్నారు. ఇకనైన ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ఆదేశాలు రాగానే అమలు చేస్తాం

- భాగ్యలక్ష్మీ, జిల్లా వ్యవసాయాధికారి, కామారెడ్డి

యంత్రలక్ష్మీ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. యంత్రాలతో సాగు వ్యయం, సమయం కలిసి వస్తాయి. కూలీల కొరత ఇబ్బందులు తొలగిపోతాయి.

Read more