వామ్మో.. ఆటోలు!

ABN , First Publish Date - 2022-05-14T06:01:17+05:30 IST

గత వారం రోజుల కిందట ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ట్రాలీ ఆటో ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం విధితమే.

వామ్మో.. ఆటోలు!
అన్నాసాగర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో నుజ్జునుజైన ఆటో

- భయాందోళనకు గురి చేస్తున్న ఆటో ప్రయాణాలు

- పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించుకుంటూ

- అతివేగంగా నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి

- ఆటో ప్రమాదాలతో అధిక ప్రాణ నష్టం

- జిల్లాలో ఏడాదిలో 21 ఆటో ప్రమాదాలు, 16 మంది మృత్యువాత

- హైవేలపై నడపవద్దనే నిబంధన ఉన్న పాటించని ఆటోవాలాలు

- పట్టింపులేని ఆర్‌టీవో, పోలీసుశాఖలు


కామారెడ్డి, మే 13(ఆంధ్రజ్యోతి): గత వారం రోజుల కిందట ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ట్రాలీ ఆటో ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం విధితమే. అప్పటి నుంచి ఆటోల్లో ప్రయాణించాలంటేనే జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని కొందరు ఆటోవాలాలు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించి వేగంగా నడపడంతో వరుస రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. అన్నాసాగర్‌ ఘటన మరవకముందే శుక్రవారం ఎల్లారెడ్డి మండలం పెద్దిరెడ్డి గ్రామం వద్ద ఆటో బోల్తాపడి 5 గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆటో వాలాలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రవాణా, పోలీసుశాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు, చర్యలకు పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రమాదం జరిగిన సమయంలోనే ఆడపదడప తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. దీంతో ఆటో వాలాలు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారనే వాదన ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.

తరచూ చోటు చేసుకుంటున్న ఆటో ప్రమాదాలు

జిల్లాలో ఆటో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటుండడం ఆందోళన కల్గిస్తోంది. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం అతివేగంగా వెళ్లడం ప్రయాణికుల చావుకు కారణమవుతున్నారు. ఇందుకు నిదర్శనం గత వారం రోజుల కిందట ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద ఆటో ట్రాలీ, బియ్యపు లారీ ఢీకొన్న సంఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 17 మంది క్షతగాత్రులయ్యారు. ట్రాలీ ఆటో డ్రైవర్‌ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం తాగి అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఎల్లారెడ్డి మండలం పెద్దిరెడ్డి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం ఇంటర్‌ పరీక్షలు రాసే ఐదుగురు విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించడం వల్ల ఇంటర్‌ పరీక్షకు దూరమయ్యాడు. గతంలోనూ జిల్లాలో ఆటో ప్రమాదాలు చాలానే జరిగాయి. సదాశివనగర్‌ మండలం ఎక్స్‌రోడ్డు వద్ద ఓ ఆటో లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. టెక్రియాల్‌ జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా మరో 6 గురికి తీవ్ర గాయాలయ్యాయి. మాచారెడ్డి మండలం మంథన్‌ దేవునిపల్లివాగు వద్ద ప్రమాదంలో పలువురు క్షతగాత్రులు అయ్యారు. ఇలా జిల్లాలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఏడాదిలో 21 ఆటో ప్రమాదాలు, 16 మంది మృత్యువాత

జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులతో పాటు పట్టణ కేంద్రాల్లో, గ్రామీణ రహదారులపై అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది కాలంలో మొత్తం 21 ఆటో ప్రమాదాలు జరుగగా 16 మంది మృతి చెందారు. 2021లో 31 ఆటో ప్రమాదాలు చోటు చేసుకోగా 18 మంది మృతి చెందారు. 2020లో 36 ప్రమాదాలు చోటు చేసుకోగా 22 మంది మృతి చెందారు. 2019లో 28 ఆటో ప్రమాదాలు జరుగగా 19 మంది మృతి చెందారు. 2018లో 24 ఆటో ప్రమాదాలు జరుగగా, 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆటో వాలాలు

జిల్లాలోని సుమారు 1200లకు పైగా ఆటోలు, ట్రాలీ ఆటోలు, ఇతర గూడ్స్‌ ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. చాలా మంది ఆటోవాలాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆటోలు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రయాణికులను ఎక్కించుకుని నడపాల్సి ఉంటుంది. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులైన హైవేలపై నడపవద్దని నిబంధనలు ఉన్నా వాటిని పాటించకుండా యథేచ్ఛగా హైవేలపై ఆటోలను తిప్పుతున్నారు. ఆటోలలో రవాణాశాఖ ప్రయాణికులను తరిలించే విషయంలో పరిమితి విధించాయి. కానీ కొన్ని ఆటోల్లో ముగ్గురు మరికొన్నిట్లో ఆరుగురు, ఏడుగురిని తరలించే అవకాశం ఉంది. కానీ ముగ్గురు తీసుకెళ్లే ఆటోలో 8 మంది, ఆరుగురుని తరలించే దాంట్లో 15 మందిని ఎక్కిస్తున్నారు. డ్రైవర్‌ తప్పనిసరిగా యూనిఫాం ధరించి ఉండాలి. కొందరు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా ఆటో నడపడంపై అవగాహన లేకున్నా నేరుగా రోడ్లు ఎక్కుతున్నారు. శుభకార్యాలు, వింధుల కోసం పలువురు సరుకు రవాణా వాహనాలలో తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనాల సామర్థ్యం, డ్రైవర్‌ అనుభవాన్ని పరిశిలించడం లేదు. విందు, వినోదాలకు వెళ్తుండడంతో డ్రైవర్‌ కూడా తాగేసి నడిపిస్తున్నారు. ఆటో వాహనాల కంపెనీల నుంచి వేగానికి పరిమితి విధించేలా స్పీడ్‌ లిమిట్‌ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. పలువురు డ్రైవర్‌లు అత్యుత్సాహంతో వాటి వేగాన్ని తిరిగి పెంచుకుంటున్నారు. ఇలా యథేచ్ఛగా ఆటోవాలాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలైన రవాణా, పోలీసు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అడపాదడప తనిఖీలు చేస్తున్నారే తప్ప ఆటో వాలాల ఆగడాలను అరికట్టలేక పోతున్నారు.

Read more