
పాఠశాల ఆవరణలో ప్రభుత్వ కార్యాలయాలు, రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)ల నిర్మాణం చేపట్టొద్దనీ, ఉన్నవాటిని కూడా దూరంగా తరలించాలని కోర్టు.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పలువురు ఐఏఎ్‌సలకు జరిమానా విధించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం, ఉన్నతాధికారులు.. పాఠశాలలకు దూరంగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించనున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే వారికి అడ్డదారి దొరికింది. పాఠశాల ఆవరణలోనే కార్యాలయాలు కట్టేస్తున్నారు. పాఠశాలతో సంబంధం లేదన్నట్లుగా మధ్యలో గోడ కట్టేస్తున్నారు. పాఠశాల ఆవరణాలు, క్రీడా మైదానాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తుండడంతో బడి భవిష్యత అవసరాలకు స్థలం లేకుండా పోతోంది. మైదానాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ధర్మవరం మండలంలోని కుణుతూరు గ్రామంలోని మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సచివాలయం, ఆర్‌బీకే, బడన్నపల్లిలోని మండలపరిషత ప్రాథమికోన్నత పాఠశాల కాంపౌండ్‌లో గ్రామ సచివాలయం, చిగిచెర్ల జిల్లా పరిషత పాఠశాలలో గ్రామ సచివాలయం, ఆర్‌బీకే నిర్మాణాలు చేపట్టారు. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పాఠశాల సమీపంలోనే సచివాలయాలు, ఆర్‌బీకేలు ఉండటంతో పిల్లల చదువుకు అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై మండల ఇనచార్జి ఇంజనీర్ రమణయ్యను అడగ్గా.. సమగ్రశిక్ష అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలకు మంజూరైన ప్రహరీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
- ధర్మవరం రూరల్