కదిలొచ్చారు

ABN , First Publish Date - 2021-09-29T07:27:43+05:30 IST

పిఠాపురం బైపాస్‌లో జాతీయ రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలపై నేషనల్‌ హైవే అథా రిటీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు.

కదిలొచ్చారు
పిఠాపురం బైపాస్‌లో అనుమతి లేకుండా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్సు కొలతలు వేస్తున్న ఎన్‌హెచ్‌ అధికారులు

పిఠాపురం బైపాస్‌లో రెండు మీటర్ల మేర ఆక్రమణ ఉన్నట్టు గుర్తించిన ఎన్‌హెచ్‌ అధికారులు

అయితే అవి ఎవ్వరివో తెలియదట 

ఇటువైపు కన్నెత్తి చూడని మునిసిపల్‌ యంత్రాంగం

పిఠాపురం, సెప్టెంబరు 28: పిఠాపురం బైపాస్‌లో జాతీయ రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలపై నేషనల్‌ హైవే అథా రిటీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని బైపాస్‌లో జాతీయరహదారిని చేర్చి ఎటువంటి అనుమతి తీసుకోకుండా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నా మునిసిపల్‌, ఎన్‌హెచ్‌ అధికారులు పట్టించుకోకపోవడాన్ని వివరిస్తూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురిమైంది. దీనిపై ఇప్పటివరకు మునిసిపల్‌ అధి కారులు స్పందించలేదు. నేషనల్‌ హైవే అథారిటీ తరపున సూపర్‌వైజరు కిరణ్‌కుమార్‌, ఇతర సిబ్బంది మంగళవారం షాపులు  నిర్మించిన ప్రాంతం వద్దకు వచ్చారు. రోడ్డు నుంచి వాటి కొలతలు తీసుకుని రికార్డుల ఆధారంగా రెండు మీటర్ల మేర జాతీయ రహదారుల సంస్థ స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించారు. ఆ మేరకు తొలగించేందుకు సిద్ధం కాగా కొందరు వ్యక్తులు వచ్చి డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిని చూపిస్తామని గడువు ఇవ్వాలని కోరడంతో నోటీసులు ఇచ్చి వెనుతిరిగారు. ఏప్రిల్‌ నెలలో తొలిసారి నోటీసు ఇచ్చామని చెప్తున్న ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో హడావుడిగా వచ్చి మరోమారు నోటీసులు ఇచ్చినట్టు భావిస్తున్నా రు. ఇప్పుడు మూడు కాంప్లెక్సులుగా నిర్మించిన వీటిలో ఏడు షాపులు ఉన్నాయి. అసలు వీటిని ఎవరు నిర్మించారన్న ప్రశ్నకు ఎన్‌హెచ్‌ అధికారులు తమకు తెలియదని బదులు ఇవ్వడం గమనార్హం. ఇవి పూర్తిగా ప్రభుత్వ స్థలాలు అని కొందరు చెప్తున్నారు. తమ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే అడ్డుకోవడంతో పాటు కూల్చివేయాల్సిన మునిసిపల్‌ అధికారులు వాటి నిర్మా ణం పూర్తయ్యే వరకు ఇటువైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా వీటిపై కోర్టులో చార్జిషీటు దాఖ లు చేస్తామని వారు చెప్పడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీ నేతల అండతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.



Updated Date - 2021-09-29T07:27:43+05:30 IST