పదిలంగా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-03-07T05:50:42+05:30 IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబిక, మల్లన్న దర్శనానికి భక్తులు పాదయాత్రగా వెళుతున్నారు.

పదిలంగా పాదయాత్ర

  1. నల్లమలలో నడక కష్టతరం
  2. వైద్యుల సూచనలు పాటించాలి
  3. ఔషధాలు, ఆహారం, నీరు తెచ్చుకోవాలి
  4. పాలిథిన్‌, పొగాకు, మద్యం, నిప్పు.. నిషిద్ధం
  5. బ్రహ్మోత్సవాలకు వెళ్లే మల్లన్న భక్తులు జాగ్రత్త


ఆత్మకూరు, మార్చి 6: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబిక, మల్లన్న దర్శనానికి భక్తులు పాదయాత్రగా వెళుతున్నారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలనుంచి పాదయాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు గణనీయంగా పాదయాత్రగా వస్తారు. చాలామంది ఆత్మకూరు మీదుగా స్వామి సన్నిధికి కాలినడకన చేరుకుంటారు. తెలుగురాష్ట్రాల భక్తుల్లో కొందరు వారం రోజులకుపైగా పాదయాత్ర సాగిస్తారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాలి నడక భక్తులకు అనారోగ్య  ఇబ్బందులు తప్పవు. పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రి తీవ్రమైన చలి ఉంటోంది. నల్లమలలో 40 కి.మీ. పైగా భక్తులు కాలినకడన వెళ్లాల్సి ఉంటుంది. వెంకటాపురం, గోసాయికట్ట, నాగలూటి వీరభధ్రాలయం, పెచ్చెర్వు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా శ్రీశైలానికి వెళతారు. నాగలూటి నుంచి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పాదయాత్రభక్తులు వైద్యుల సూచనలు పాటిస్తే ఈ యాత్ర మధురానుభూతిని మిగులుస్తుంది.


వైద్యుల సలహా తీసుకోండి

చిన్నారులు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులు కాలినడకన వెళ్లకపోవడం మంచిది. తప్పదని భావిస్తే వైద్యుల సూచనలు పాటించాలి. శరీరానికి ఎక్కువ అలుపు రాకుండా అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగాలి. మందులు, ఆహారం, తాగునీరు వెంట తెచ్చుకోవాలి. - డాక్టర్‌ మోతీలాల్‌ నాయక్‌, వైద్యాధికారి, ఆత్మకూరు 


సూచనలు పాటించాలి

కాలినడకన వెళ్లే భక్తులు పర్యావరణ సూచనలు పాటించాలి. అడవికి నిప్పు పెట్టడం, టపాకాయలు కాల్చడం వంటివి చేయరాదు. అడవిలోకి ప్లాస్టిక్‌ కవర్లను అనుమతించేది లేదు. భక్తులను తనిఖీ చేసి బీడీలు, కవర్లు, మద్యం బాటిళ్ల వంటివి స్వాధీనం చేసుకుంటాం.  భక్తులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి. - ఆశాకిరణ్‌, డీఎఫ్‌వో, ఆత్మకూరు


ఆరోగ్యం జాగ్రత్త

కాలినడకన వెళ్లే సమయంలో గతంలో కొందరు భక్తులు గుండెపోటుకు గురయ్యారు. బీపీ, షుగర్‌ సమతుల్యత లోపించి కొందరు మరణించారు. అందుకే కాలినడకన వెళ్లే వృద్ధులు, దీర్ఘకాళిక వ్యాధులతో బాధపడే వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. చిన్నారులను కాలినడకన తీసుకువెళ్లేవారు కూడా వారి ఆరోగ్యం గురించి తగుజాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

అటవీ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీ హైడ్రేషన్‌ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. స్వస్థత కోసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, శుద్ధజలాలు, చక్కెర, ఉప్పు వంటి పదార్థాలు వెంట తీసుకువెళ్లాలి. ఓఆర్‌ఎస్‌ లేని సమయంలో చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కర కలిపిన నీటిని తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. 

అటవీ ప్రాంతంలో సెలయేళ్లు, కుంటల్లో నీటిని తాగకూడదు. వెంట తీసుకువెళ్లిన  శుద్ధ జలాలను తాగడం ఉత్తమం. అడవుల్లో ఉండే నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

గుండెజబ్బు రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పాదయాత్ర సమయంలో తగినంత విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగాలి. తొందరగా క్షేత్రానికి చేరుకోవాలన్న ఆత్రుత వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధులతో బాధపడేవారు తమ వెంట ఔషధాలను, ఆహారాన్ని, తాగునీటిని తీసుకువెళ్లాలి.  ఒంటరిగా ప్రయాణించకూడదు. బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లాలి. 

 నల్లమలలో రాత్రిళ్లు చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. అస్తమా రోగులు రాత్రిపూట నడక విరమించుకోవడం శ్రేయస్కరం. 

అటవీ ప్రాంతంలో నడిచే సమయంలో కొందరి కాళ్లకు బొబ్బలు వస్తుంటాయి. దీక్ష తీసుకున్నవారు కాళ్లకు గోనె సంచి బట్టలు ధరించాలి. సాధారణ భక్తులు పాదరక్షలు ధరించాలి. బొబ్బలు వస్తే ఉపశమనం కోసం ఆయింట్‌మెంట్లు, నొప్పి తగ్గించే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. 


పర్యావరణ పరిరక్షణ

పాదయాత్రికుల వల్ల అడవికి, వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి. అటవీ శాఖ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. అటవీమార్గంలో అక్కడక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి, భక్తులను తనిఖీ చేస్తోంది. బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, అగ్గిపెట్టెలు తదితర సామగ్రి ఉంటే స్వాధీనం చేసుకుంటారు. పాలిథీన్‌ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకువెళుతుంటే, కవర్లను తీసుకుని, కాగితాల్లో ఆహారాన్ని పొట్లం కట్టి ఇచ్చి పంపుతున్నారు. 

రాత్రిళ్లు వన్యప్రాణుల సంచారానికి భయపడి కొందరు భక్తులు అడవిలో నిప్పంటిస్తున్నారు. దీని వల్ల అడవి దగ్ధమౌతోంది. విలువైన వృక్ష, జంతు సంపదకు నష్టం జరుగుతోంది. గుట్కాకవర్లు, ప్లాస్టిక్‌ కవర్లను వన్యప్రాణుల తిని జీర్ణం కాక మృత్యువాతపడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. భక్తులు కూడా నిబంధనలను పాటించి, అటవీ సంరక్షణకు సహకరించాల్సిన అవసరం ఉంది. 


Updated Date - 2021-03-07T05:50:42+05:30 IST