గొర్రెల కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2021-11-30T06:48:14+05:30 IST

సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. లబ్ధి దారుడి వాటా కింద ఇప్పటికే డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో వెంటనే పంపిణీ చేపట్టాలని పోరుబాట పడుతున్నా రు.

గొర్రెల కోసం నిరీక్షణ

ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు మంజూరు కాని వైనం 

పెరిగిన యూనిట్‌ ధర 

 పాత డీడీల మేరకే ఇవ్వాలని గొర్రెలకాపరుల డిమాండ్‌

భువనగిరి రూరల్‌, నవంబరు 29 : సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. లబ్ధి దారుడి వాటా కింద ఇప్పటికే డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో వెంటనే పంపిణీ చేపట్టాలని పోరుబాట పడుతున్నా రు. ప్రభుత్వం గొర్రెల పంపిణీపై జాప్యాన్ని వీడి యూనిట్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. గొల్ల, కురుమలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొల్లకురుమల ఆర్థిక పరిపుష్టిని పెంపొందించేందుకు గొర్రెల పంపిణీ పథకం మొదటి విడత అట్టహాసంగా సాగగా, రెండో విడత మాత్రం పడకేసింది. ప్రభుత్వం 2017లో గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గొర్రెల, మేకల కాపరులకు స్వయం ఉపాధి అందించేందుకు 18 ఏళ్లు నిండి ఉండి, ఆసక్తి ఉన్న వారందరికీ రూ.1.25లక్షల ఒక్కో యూనిట్‌ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇవ్వాలని నిర్ణయించింది. 75 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసింది. ప్రభు త్వం చెల్లిస్తున్న సబ్సిడీ పోను మిగతా సొమ్మును లబ్ధిదారుడి వాటా కింద 25శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడి వాటా రూ.31,250 చెల్లించిన పక్షంలో ప్రభుత్వం రూ.93,750 రాయితీ రూపంలో అందిస్తుం ది. గొర్రెల పంపిణీ పథకానికి అప్పట్లో జిల్లా వ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించిన అధికారులు లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాలు, 6 మునిసిపాలిటీ పరిధిలో 32,010 మంది గొర్రెల కాపరు లు ఉండగా వారిలో మొదటి విడతలో 16,005గాను 14,763మంది లబ్ధిదారులకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ పూర్తి చేశారు. మొదటి విడతలో యూనిట్లు మంజూరు, పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరిగింది. రెండో విడతలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం యూనిట్‌ ధరను రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచింది. లబ్ధిదారుడిగా వాటా 25 శాతం మేరకు రూ.43,750 చెల్లించాలి. 

అయితే ఇందు కోసం రెండో విడత లబ్ధిదారుల్లో ఇది వరకే 1847 మంది తమ వాటా కింద కింద రూ.31,250 డీడీలు చెల్లించారు. గొర్రెల పంపిణీలో జాప్యం జరుగుతుండడంతో దాదాపు 1000 మంది లబ్ధిదారులు డీడీలను వెనక్కి తీసుకున్నారు. అయితే నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో 400మందికి అడపదడప రెండో విడత సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేశారు. అయితే మరో 447మంది డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఉన్నారు. వీరు పెరిగిన లబ్ధిదారుడి వాటా కింద అదనంగా మరో రూ.12,500 చెల్లించాలని జిల్లా పశుసంవర్థక అధికారులు సమాచారాన్ని అందించారు. తమతోపాటు డీడీలు కట్టిన వారందరికీ గతంలో ఉన్న యూనిట్‌ విలువ ఆధారంగా యూనిట్లు మం జూరు చేస్తే, మిగిలిపోయిన వారు మాత్రమే అదనం గా లబ్ధిదారుడి వాటా ఎలా చెల్లిస్తారని గొర్రెల,కాపరు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు అదనంగా డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, గతంలో మంజూరైన లబ్ధిదారుల మాదిరిగానే తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న గొల్లకురుమలకు గొర్రె లు వస్తే బాగుపడుతామని ఆశ పడ్డవారికి భంగపా టుతప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం గతంలో చెల్లించిన లబ్ధిదారుల వాటా ప్రకారమే యూనిట్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. 

రెండో విడత పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం 

జిల్లాలోని రెండో విడత గొర్రె ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడతలో 16,005మందికి 14,763 మం ది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశాం. అయితే ప్రభు త్వం ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.50వేలు పెంచింది. దీంతో లబ్దిదారుడి వాటా కింద రూ.43,750 డీడీ చెల్లించాలని సమాచారమిచ్చాం. సాధ్యమైనంత త్వరగా రెండో విడత ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

- డాక్టర్‌ వి.కృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాదాద్రి భువనగిరి 


పాత డీడీల ప్రకారమే పంపిణీ చేయాలి

జిల్లాలోని గొర్రెలకాపరులకు గతంలో మాదిరిగానే రూ.31, 500 డీడీ చెల్లించిన వారికి రెండో విడత పంపిణీ చే యా లి. పెరిగిన యూనిట్‌ ప్రకారం అదనంగా రూ. 12,500 చెల్లించే పరిస్థితిలో గొర్రెకాపరులు లేరనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జాప్యం చేయకుండా రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి. 

- నర్సింహ, జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2021-11-30T06:48:14+05:30 IST