రెండో డోస్‌ కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2021-05-13T07:25:53+05:30 IST

నల్లగొండ జిల్లాలో కరోనా నివారణకు వేయాల్సిన టీకా సమస్యగా మారింది. రెండో డోసుకు సంబంధించి నిల్వలు లేకపోవడంతో ప్రజలు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేతులెత్తేసేలా కనిపిస్తోంది.

రెండో డోస్‌ కోసం నిరీక్షణ
భూదాన్‌పోచంపల్లిలో రెండో డోస్‌ లేకపోవడంతో వాగ్వాదానికి దిగిన ప్రజలు

నల్లగొండ, మే 12: నల్లగొండ జిల్లాలో కరోనా నివారణకు వేయాల్సిన టీకా సమస్యగా మారింది. రెండో డోసుకు సంబంధించి నిల్వలు లేకపోవడంతో ప్రజలు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేతులెత్తేసేలా కనిపిస్తోంది. జిల్లాలోని 47కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. జిల్లాలో మొదటి డోస్‌ లక్షా14వేల 570 మందికి వేశారు. ఇక సెకండ్‌ డోస్‌ కేవలం ఇప్పటివరకు 29,995 మందికి మాత్రమే వేశారు. ఇంకా 85,575 మందికి టీకా వేయాల్సి ఉంది. కరోనా మహమ్మారి నిలువరించాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటేమార్గం ఉండటంతో అందుకనుగుణంగా ప్రభుత్వం, అధికారులు అడుగులు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగా ముందుగా ఫస్ట్‌ డోస్‌ వేసుకున్న వారికి రెండో డోస్‌ పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ, అందుకు సరిపడా నిల్వలులేకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సెకండ్‌డోస్‌ల సంఖ్య తక్కువగా ఉండటంతో మొదటి డోసు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. 


రెండో డోస్‌ వారికి మాత్రమే

మొదటిడోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మాత్రమే రెండోడోస్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఈ నెల 4వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌లో భాగంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి రెండో డోస్‌ మాత్రమే ఇస్తున్నారు. ఈనేపథ్యంలో సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో అధికారులకు ఎదురు చూపులు తప్పడంలేదు. టీకా సరఫరా అంతంత మాత్రంగానే రావడంతో రెండో డోస్‌ వేసుకునే వాళ్లు ప్రతిరోజూ వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళ్లి బారులు తీరాల్సి వస్తోంది. 


18-45 ఏళ్ల వారికి ఇప్పట్లో కష్టమే

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కోవిన్‌ యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం టీకా కొరత కారణంగా 18-45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్‌ నిలిపివేశారు. మొదటి, రెండో డోస్‌ తీసుకున్న వారికి టీకా వేసేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతున్న తరుణంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేసే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. ఈనెల 15వ తేదీ నుంచి మొదటి డోస్‌ టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదిఎంత వరకూ సాధ్యమవుతుందనేది వేచి చూడాల్సిందే. 


జిల్లా వ్యాప్తంగా 370 డోస్‌లే

జిల్లాలోని 47 కేంద్రాల్లో బుధవారం రెండో విడత 370 డోసులను మాత్రమే వేశారు. జిల్లాలోని ఆయాకేంద్రాల్లో 3,500 డోస్‌లు మాత్రమే ఇవ్వడానికి కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ టీకాలు పంపిణీ చేశారు. ఒక్కో కేంద్రానికి 10 వాయిళ్లు (100టీకాలు) కేవలం రెండో డోస్‌ వారికే పంపిణీ చేశారు. జిల్లాలో 1,14,570 మందికి మొదటి విడత టీకాలు ఇచ్చారు. అయితే రెండో డోస్‌ కోసం సరఫరా టీకాలు రాలేదు. జిల్లాలో మొత్తం 84,570 మంది రెండో డోస్‌ టీకాల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండో డోస్‌ పూర్తి కావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతోందని వైద్యుల అభిప్రాయం. టీకాల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


అందరికీ వ్యాక్సిన్‌ ఇస్తాం  : డాక్టర్‌ సాంబశివరావు,డీఎంహెచ్‌వో, యాదాద్రి జిల్లా

అర్హులందరికీ దశలవారీగా వ్యాక్సిన్‌ ఇస్తాం. వ్యాక్సిన్‌కోసం ప్రజలెవ్వరూ ఆందోళనకు గురి కావద్దు. ప్రభుత్వం  సరఫరా చేస్తున్న వ్యాక్సిన్‌ను రోజువారీగా జిల్లాలోని 26కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నాము. సరఫరాలో జరుగుతున్న అవాంతరాలతో వ్యాక్సిన్‌ ప్రక్రియలో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వ్యాక్సిన్‌ కోసం ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందితో వాగ్వావాదాలు చేయవద్దు పారదర్శకంగా టీకా ప్రక్రియను కొనసాగిస్తున్నాము. 


Updated Date - 2021-05-13T07:25:53+05:30 IST