ప్రోత్సాహకం ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-02-28T05:41:57+05:30 IST

ఏకగ్రీవ పంచాయతీల నజరానా కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ‘స్థానిక’ ఎన్నికల వేళ.. పంచాయతీల అభివృద్ధి కోసం.. పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను, వార్డుమెంబర్‌లను ఎన్నుకుంటే భారీగా నజరానా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రోత్సాహకం ఎప్పుడో?

ఏకగ్రీవాల నజరానా కోసం ఎదురుచూపు

జిల్లాలో 130 పంచాయతీలకు.. రూ.7.45 కోట్ల మేర నిధుల బకాయి

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

ఏకగ్రీవ పంచాయతీల నజరానా కోసం కొత్త సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ‘స్థానిక’ ఎన్నికల వేళ.. పంచాయతీల అభివృద్ధి కోసం.. పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను, వార్డుమెంబర్‌లను ఎన్నుకుంటే భారీగా నజరానా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. 2 వేల జనాభా లోపు ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5వేల మంది ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, ఐదువేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, పదివేల మంది జనాభా దాటిన పంచాయతీలకు రూ.20 లక్షలు చొప్పున ప్రోత్సాహకం నగదు అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 1190 పంచాయతీలకు గానూ 1166 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో  140 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 130 పంచాయతీలకు మాత్రమే ప్రోత్సాహకం వర్తించనుంది. మిగిలిన పది పంచాయతీల్లో కొన్నిచోట్ల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైనా.. వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అటువంటి పంచాయతీలకు ప్రోత్సాహకం వర్తించదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక మేజర్‌ పంచాయతీతో పాటు 129 మైనర్‌ పంచాయతీలకు  మొత్తంగా రూ.7.45 కోట్ల మేర ప్రోత్సాహకం నిధులు విడుదల కావాల్సి ఉంది. వీటిలో పదివేల లోపు జనాభా గల పంచాయతీ ఒకటి, 5వేల మంది జనాభా గల పంచాయతీలు 17, 2వేల మంది జనాభా గల పంచాయతీలు 112 ఉన్నాయి. 2006 సంవత్సరంలోని ‘స్థానిక’ ఎన్నికల్లో ఏకగ్రీవమైన మైనర్‌ పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్‌ పంచాయతీలకు రూ.15 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదును ప్రభుత్వం విడుదల చేసింది. 2013 సంవత్సరంలోని ఎన్నికల్లో మైనర్‌ పంచాయతీకి రూ.7లక్షలు, మేజర్‌ పంచాయతీకి రూ.20 లక్షలు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. తాజాగా జనాభా ప్రాతిపదికన నజరానా అందజేయనున్నట్టు వెల్లడించింది. అయితే గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికం ఇవ్వలేదని పలుమార్లు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పారితోషికం ఎప్పుడు విడుదల చేస్తారనేది చర్చనీయాంశమవుతోంది. కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పంచాయతీల్లో కొలువుదీరారు. పల్లె పాలనపైనే దృష్టి పెడుతున్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మాదిరి ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.  


 ప్రభుత్వానికి పంపించాం 

జిల్లాలో నిబంధనల మేరకు 130 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 112 పంచాయతీలకు రూ.5.60 కోట్లు, 17 పంచాయతీలకు రూ. 1కోటి 70 లక్షలు, ఒక పంచాయతీకి రూ. 15లక్షలు నిధులు రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.   

రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి

Updated Date - 2021-02-28T05:41:57+05:30 IST