ఆసరాకోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-08-05T05:20:32+05:30 IST

వృద్ధులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు పంపిణీ నిలిచిపోయింది.

ఆసరాకోసం ఎదురుచూపు

 పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు

కొత్తగూడెం టౌన్‌, ఆగస్టు 4: వృద్ధులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు పంపిణీ నిలిచిపోయింది. జూలై నెల పెన్షన్లు జిల్లా వ్యాప్తంగా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో 96,962మందికి ప్రభుత్వం పెన్షన్లను అందిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఏఆర్‌టీ బాధితులు పెన్షన్ల బాధితులు లబ్ధిదారులుగా ఉన్నారు. లబ్ధిదారులకు గత నెల చివరి వరకు పెన్షన్ల కోసం ఎదురుచూపు చూసినప్పటికి పెన్షన్లు వేయకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. పెన్షన్లు వస్తేనే మందులు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని జీవనం సాగించే వారికి ఆసరా ఆలస్యం కావడంతో జీవనం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతి నెల 25 నుంచి 30 తేదీ లోపు పడే పెన్షన్‌ ఆగస్టు నెల 4వ తేదీ అయిన పెన్షన్లు అందకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకులు, మిని ఏటీఎం సెంటర్ల చుట్టు వృద్ధులు, వికలాంగులు ప్రదక్షణలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ల వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని 96,962 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 33,136మంది కాగా దివ్యాంగులు 12,352, వితంతువులు 46,443, ఒంటరి మహిళలు 5,739, ఏఆర్‌టీ బాధితులు 980, బోదకాలు 150, చేనేత కార్మికులు 18, బీడీ కార్మికులు ముగ్గురు ఉన్నారు. వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వం పెన్షన్‌ మంజూరు చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెన్షన్ల పంపిణీ పై డీఆర్‌డీఏ పీవో మధుసూధన్‌ రాజును వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని, నిధులు మంజూరైన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. 


Updated Date - 2022-08-05T05:20:32+05:30 IST