29 ఏళ్లుగా కానిస్టేబుల్‌ కొలువులోనే..పదోన్నతుల కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-11-13T04:43:49+05:30 IST

పాలమూరు ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుల్స్‌, హెడ్‌కానిస్టేబుల్స్‌, ఏఎ్‌సఐలు పదోన్నతుల కోసం పడిగాపులు కాస్తున్నారు.

29 ఏళ్లుగా కానిస్టేబుల్‌ కొలువులోనే..పదోన్నతుల కోసం పడిగాపులు
విధుల్లో ఉన్న పోలీసులు

హెడ్‌ కానిస్టేబుల్స్‌, ఏఎస్‌ఐలదీ అదే పరిస్థితి

పదోన్నతుల కోసం నిరీక్షణ


మహబూబ్‌నగర్‌: పాలమూరు ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుల్స్‌, హెడ్‌కానిస్టేబుల్స్‌, ఏఎ్‌సఐలు పదోన్నతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో 1999-2000 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్స్‌కు ఇటీవలే పదోన్నతులు వర్తించగా, పాలమూరు జిల్లా వాసులకు మాత్రం నిరీక్షణే మిగిలింది. కొత్త స్టేషన్లు ఏర్పాటు చేసిన వాటికి సిబ్బందిని కేటాయింపు చేయలేదు. పక్క స్టేషన్ల నుంచే వాటిలో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీలు లేకపోవడం, ఉద్యోగ విరమణ వయస్సును 61కి పెంచడంతో పద్నోతుల కోసం ఎదురుచూసి రిటైర్‌ కావాల్సిందేనని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1992 నుంచి 2000 వరకు రిక్రూట్‌ అయినవారు మావోయిస్టు ప్రాంతాల్లో సేవలందించారు. ఆ సమయంలో నక్సల్స్‌ సమస్య తీవ్రంగా ఉండగా, ప్రాణాలు అరచేత పట్టుకుని విధులు నిర్వర్తించారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యుల్లో విపరీత ఒత్తిడి ఉండేది. అలా ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ చేసిన వారికి పదోన్నతులు లేకుండా కాలం వెళ్లదీయడం అనేది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పాలమూరు ఉమ్మడి జిల్లా జిల్లాల విభజన అనంతరం 5 ఐదు జిల్లాలుగా విడిపోయింది. పలు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 5 జిల్లాల్లో 16 కొత్త మండలాలను ఏర్పాటు చేయగా, 16 పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన పోలీస్‌ స్టేషన్‌లకు ఎస్‌ఐలను అలాట్‌ చేసినా. ఇప్పటివరకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించ లేదు. పక్క పోలీస్‌ స్టేషన్‌ల నుంచి కొంతమందిని తీసి. అటాచ్‌ చేసి కొత్త స్టేషన్‌లను నడిపిస్తున్నారు. ఒక్కో స్టేషన్‌కు కనీసం 25 మంది స్టాఫ్‌ను ఇవ్వాలి. ఇప్పటి వరకు కొత్త పీఎ్‌సలకు స్టాఫ్‌ను అలాట్‌ చేయకపోవడంతో ఉన్నవారిపై పని భారం పడుతోంది. కొత్త స్టేషన్‌లకు స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తే ఖాళీలు ఏర్పడి కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌, ఏఎ్‌సఐలకు పదోన్నతులు వచ్చేవని, అలా చేయకుండా సర్దుబాటు చేయడం వల్ల పదోన్నతుల ఊసే లేకుండా పోయింది. సుదీర్ఘకాలంగా ఒకే పోస్ట్‌లో నెట్టుకొస్తున్నారు. 


కొత్త స్టేషన్లు..

వనపర్తి జిల్లాలో మదనాపూర్‌, శ్రీరంగాపూర్‌, రేవల్లి, చిన్నంబావి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పెంట్లవెల్లి, ఊర్కొండ, పదర, చారగొండ, గద్వాల జిల్లాలో కేతిదొడ్డి, ఉండవల్లి, నారాయణపేట జిల్లాలో మరికల్‌, కృష్ణా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూసాపేట, రాజాపూర్‌, మహ్మదాబాద్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా మండల కేంద్రాల్లో పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లలో పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయిస్తే, ప్రజలకు మెరుగైన సేవలు అందడంతోపాటు ఖాళీలు ఏర్పడి సీనియర్‌లకు పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-11-13T04:43:49+05:30 IST