నాలుగేళ్లుగా ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-08-17T05:39:11+05:30 IST

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి నోచుకోవడం లేదు.

నాలుగేళ్లుగా ఎదురుచూపులు

- ‘మత్స్య సంపద యోజన’కు నోచుకుని మత్సకారులు

- సబ్సిడీ సొమ్మును విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం

- కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి నోచుకోవడం లేదు. ఆయా యూనిట్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. జిల్లా మత్స్య శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆరా తీస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్ల మంజూరు కోసం 55 మంది దరఖాస్తు చేసుకోగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 104 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేంద్రం నిధులను విడుదల చేయకపోవడంతో అధికారులు సబ్సిడీని మంజూరుచేయడం లేదు. 

104 దరఖాస్తులు..

మత్స్యకారులను అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పలు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టింది. చేపల పెంపకానికి పట్టా భూముల్లో పాండ్ల నిర్మాణాలు, చేప పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, చేపలకు వేసే దాణా మిల్లుల ఏర్పాటు, సంచార చేపల విక్రయ కేంద్రాలు, చేపలను రవాణా చేసే ఇన్సులేటేడ్‌ ట్రక్కుల కొనుగోలు, అక్వా కల్చర్‌ ద్వారా చేప పిల్లల పెంపకం, మూడు చక్రాల వాహనాల యూనిట్లను ప్రవేశపెట్టింది. ఇందులో చేపల పాండ్ల నిర్మాణాలకు 7లక్షలు, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలకు 25 లక్షలు, చేపల దాణా మిల్లుల ఏర్పాటుకు 30 లక్షలు, ఇన్సులేటేడ్‌ ట్రక్కు కొనుగోలుకు 20 లక్షలు, అక్వాకల్చర్‌ సిస్టమ్‌కు 25 నుంచి 50 లక్షల వరకు, సంచార వాహనాల ద్వారా చేపల విక్రయాల కోసం 10 లక్షలు, మూడు చక్రాల వాహనాల కోసం 5లక్షలు యూనిట్‌ ధరగా నిర్ణయించారు. ఈ యూనిట్ల కోసం ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు 60 శాతం సబ్సిడీ, ఇతర మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. మిగతా మొత్తాన్ని ఏదేని జాతీయ బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఫిష్‌ పాండ్‌ల కోసం 49మంది, అక్వా కల్చర్‌ చేపల పెంపకానికి 5 దరఖాస్తులు, సంచార వాహనం ద్వారా చేపల విక్రయాల యూనిట్‌కు ఒక దరఖాస్తు వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిష్‌ పాండ్ల నిర్మాణానికి 43 మంది, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం కోసం ఒకరు, చేపల దాణా మిల్లుల కోసం ముగ్గురు, ఇన్సులేటేడ్‌ ట్రక్కుల కోసం ఏడుగురు, మూడు చక్రాల ఆటో కోసం ఇద్దరు, అక్వాకల్చర్‌ చేపల ఉత్పత్తి కోసం 8 మంది, సంచార చేపల విక్రయాల కోసం 40 దరఖాస్తులు వచ్చాయి. 

స్పష్టత కరువు..

జిల్లాలో ఏయే యూనిట్‌ ఎంత మందికి మంజూరు చేయాలనే విషయమై ప్రభుత్వం కోటా విధించ లేదు. అలాగని సబ్సిడీ సొమ్ము కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. మత్స్యకారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. ఫిష్‌ పాండ్‌లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫోర్‌మెన్‌ గల కమిటీ వ్యవసాయ శాఖాధికారి, భూగర్భ జల శాఖ, ఇరిగేషన్‌ అధికారి, మత్స్య అభివృద్ధి అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం ఎప్పుడు సబ్సిడీ యూనిట్లను మంజూరు చేస్తుందా అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. యూనిట్ల మంజూరు విషయమై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులను ఎంత మందిని ఎంపిక చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి జాబితాను జిల్లా మత్స్య అభివృద్ధి శాఖాధికారి ఉన్నతాధికారులకు పంపించారు. సత్వరమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పీఎం మత్స్య సంపద యోజన కింద యూనిట్లు, సబ్సిడీ సొమ్మును విడుదల చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-17T05:39:11+05:30 IST